కోతులు తాకని పంజరపు తోట!

25 Sep, 2018 06:59 IST|Sakshi
ఇనుప పంజరంలో ఇంటి పంటలు

ఇంటి పంట

ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకునే వారికి తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో కోతుల బెడద పెద్ద సమస్యగా మారింది. కోతుల తాకిడికి తట్టుకోలేక పెరటి తోటలు/ మేడలపై ఇంటిపంటల సాగుకు స్వస్తి పలుకుతున్న వారు లేకపోలేదు. అయితే, పెరట్లో పాతికేళ్లుగా ఇంటిపంటలు సాగు చేసుకునే అలవాటు ఉన్న ముళ్లపూడి సుబ్బారావు కోతుల సమస్యను ఎలాగైనా అధిగమించాలన్న పట్టుదలతో పంజరపు తోట(కేజ్‌ గార్డెన్‌)ను ఏర్పాటు చేసుకున్నారు.

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుబ్బారావు ప్రకృతికి దగ్గరగా జీవించాలన్న తపన కలిగిన వ్యక్తి. సామాజిక చైతన్యం కలిగిన కథా రచయిత కూడా. సింగరేణి కాలరీస్‌లో అదనపు జనరల్‌ మేనేజర్‌గా కొత్తగూడెంలో పనిచేస్తున్న ఆయన తన క్వార్టర్‌ పక్కనే గచ్చు నేలపై ఇనుప మెష్‌తో పంజరం నిర్మించుకొని.. అందులో మడులు, పాత టబ్‌లు, బక్కెట్లలో సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటున్నారు. 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవున 9 అడుగుల ఎత్తున తన కిచెన్‌ గార్డెన్‌కు రూ. 40 వేల ఖర్చుతో ఇనుప పంజరాన్ని నిర్మించుకున్నారు.

కుమారుడు విదేశాల్లో స్థిరపడటంతో దంపతులు ఇద్దరే నివాసం ఉంటున్నారు. సుబ్బారావు తన అభిమాన మినీ పొలమైన ఇనుప పంజరంలో.. బెండ, వంగ, టమాటా, అలసంద, పొట్ల, ఆనప(సొర) వంటి కూరగాయలతోపాటు 6 రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు. ఏడాదిలో 6 నెలలు కూరగాయలు, ఆకుకూరలు నూటికి నూరు శాతం, మిగతా 6 నెలలు 50% మేరకు తమ పంజరపు తోటలో కూరగాయలు, ఆకుకూరలనే తింటున్నామని ఆయన సంతృప్తిగా చెప్పారు.

ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను పొందడంతోపాటు.. కంటి నిండా పచ్చదనం పంజరపు తోట రూపంలో అందుబాటులో ఉండటంతో దైనందిన జీవితంలో ఒత్తిడిని మర్చిపోయి సాంత్వన పొందుతున్నానని ఆయన తెలిపారు. ఇప్పుడు ఫైబర్‌ టబ్‌లు అందుబాటులోకి రావడంతో ఇంటిపంటల సాగు కొంత సులభమైందన్నారు. తక్కువ స్థలంలో, మనకు నచ్చిన కూరగాయలు, ఆకుకూరలను అధిక దిగుబడి పొందడానికి పంజరపు తోట ఉపకరిస్తోందన్నారు.

క్వార్టర్లలో, అద్దె ఇళ్లలో నివసించే ఉద్యోగులు అవకాశం ఉన్న వారు పంజరపు తోటను ఏర్పాటు చేసుకుంటే.. ఇల్లు మారినా, ఊరు మారినా.. దీన్ని కూడా పెద్దగా కష్టపడకుండానే తరలించుకెళ్లవచ్చని ఆయన అనుభవపూర్వకంగా చెబుతున్నారు. సొంత ఇల్లున్న వారికి పంజరపు తోట ఖర్చు భరించలేనిదేమీ కాదని, ఒక సోఫాపై పెట్టే ఖర్చుతోనే దీన్ని సమకూర్చుకోవచ్చన్నారు. క్యాంపులకు వెళ్లినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి టైమర్‌తో కూడిన డ్రిప్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నట్లు సుబ్బారావు తెలిపారు. కోతుల బెడదకు విరుగుడుగా పంజరపు తోటను నిర్మించుకున్న సుబ్బారావు (94911 44769) దంపతులకు ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది.   


ముళ్లపూడి సుబ్బారావు

మరిన్ని వార్తలు