ఈ ఒక్కటి నీ కోసం

31 Mar, 2018 03:09 IST|Sakshi

ఒక రాజు దగ్గర ఒకాయన పని చేసేవాడు. ఆయన భవనాలను ఎంతో శ్రద్ధగా నిర్మించేవాడు. వాటి పునాదులు లోతుగా తీయించేవాడు, స్తంభాలు దృఢంగా వేయించేవాడు, పైకప్పు కోసం వాడే సామగ్రి నాణ్యంగా ఉండేది. తలుపులు మంచి కలపతో చెక్కేవాడు. ఒక్కో ఇళ్లు వంద ఏళ్లయినా చెక్కు చెదరదేమో అన్నంత గొప్ప పనితనం వాటిల్లో కనబడేది. దాంతో ఆయనకు ఎంతో పేరొచ్చింది. రాజు కూడా ప్రత్యేకంగా అభిమానించేవాడు. పేరంటూ వచ్చాక ఆయనకు తన పనిమీద శ్రద్ధ తగ్గిపోయింది.

ఎక్కువగా తన సహాయకులకు పనులు అప్పగించేవాడు. వాళ్లలో కొందరు అవినీతిపరులు ఉండేవారు. నాణ్యమైన సామగ్రి వాడేవారు కాదు. ఈ విషయం నెమ్మదిగా రాజుకు తెలిసింది. ఒకరోజు రాజు అతణ్ని పిలిపించి, ‘మీరు చివరిగా ఒక్క భవనాన్ని నాకోసం నిర్మించండి. తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుందురు’ అన్నాడు. అతడు అలాగే అని ఒప్పుకున్నాడు.

కానీ తన ధోరణిలో ఆ పనిని సహాయకులకు అప్పగించాడు. వాళ్లు వాళ్ల ధోరణిలో సొమ్ము మిగుల్చుకుంటూ భవనాన్ని పూర్తి చేశారు. ఒకరోజు రాజుతో పని పూర్తయిందని చెప్పడానికి వెళ్లాడు మేస్త్రి. ‘మీరు ఈ రాజ్యానికోసం ఎంతో సేవ చేశారు. ఈ భవనం మీరు నివాసం ఉండటానికే’ అని చెప్పాడు రాజు. మేస్త్రికి ఒక్కసారిగా ఆ భవనం కూలిపోయినట్టు అనిపించింది.

మరిన్ని వార్తలు