అల్లాహు అక్బర్

21 Jun, 2016 23:05 IST|Sakshi
అల్లాహు అక్బర్

అల్లాహు అక్బర్ అని అజాన్ వినిపించగానే అమితమైన భక్తితో మస్జిద్ వైపు కదులుతారు. పాతికవేల మంది ఒక్కచోట చేరినా ఇతరులకు ఇబ్బంది లేకుండా నమాజ్ ఆచరిస్తారు. వేలాదిమంది కలిసికట్టుగా ప్రార్థించే ఈ ప్రాంత   ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం.

 

నిండైన వస్త్రధారణ..!
జామె మసీదును సందర్శించాలనుకునేవారు నిండైన వస్త్రధారణ కలిగి ఉండాలి. స్లీవ్‌లెస్‌లు, షార్ట్‌లు వేసుకుని వెళ్లేవారికి అక్కడి నిర్వాహకులు వస్త్రాలు ఇస్తారు. స్త్రీలు తలపై వస్త్రం కప్పుకోవాలి. వస్త్రాలు సమకూర్చినందుకు ఎలాంటి రుసుమూ వసూలు చేయరు. వచ్చేటప్పుడు ఆ దుస్తులను తిరిగి ఇచ్చేయాలి.

 

ఐదేళ్ల క్రితం...
కొంతమంది మిత్రులం కలిసి జమాత్ మహాసభలకోసం ఢిల్లీ వెళ్ళాము. ఎలాగూ ఢిల్లీ వచ్చాం కదా, ఇక్కడికొన్ని చారిత్రక ప్రదేశాలు చూసివెళదామని అనుకున్నాం. అక్కడి మహాసభల నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనంలో ఇండియా గేట్, లాల్ ఖిలా, జామా మస్జిద్ లాంటి కొన్ని చారిత్రక ప్రదేశాలను సందర్శించాము. జామా మసీదు చూడాలని బయలుదేరిన మమ్మల్ని ట్రాఫిక్ ఇబ్బంది కారణంగా టాక్సీ డ్రైవర్ కొంతదూరంలోనే విడిచి పెట్టాడు. అక్కడినుండి కాలినడకనే వెళ్ళాము. మీనా బజార్ మార్గం గుండా వెళ్ళిన మాకు ఇసుకేస్తే రాలనంత జనం కనిపించారు. ఎలాగోలా మస్జిద్‌కు చేరుకున్నాం. దాన్నే జామా మస్జిద్, జుమ్మా మస్జిద్ అని కూడా అంటారు. తీరా వెళ్ళిన తర్వాత అది చాలా ఎత్తులో కనబడింది. దాదాపు 30 మెట్లు ఎక్కేసరికి అలసట వచ్చింది.  పైకి వెళ్ళిన తరువాత మేము పొందిన అనుభూతి అంతాయింతా కాదు. అదొక అధ్భుత ఆధ్యాత్మిక కళాఖండమే కాక చారిత్రక సంపద కూడా! ఇస్లామీయ వాస్తు నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన ఆ మస్జిద్ మమ్మల్ని మంత్రముగ్దుల్ని చేసింది. ఉత్తర ద్వారానికి సమీపంలో చెక్కతో నిర్మించిన ఒక గదిలో ప్రత్యేకమైన ఫలకం మీద ఖురాన్ వాక్యాలు రాయబడి ఉన్నాయని, ముహమ్మద్ ప్రవక్తకు చెందిన కొన్ని స్మృతి చిహ్నాలు ఉన్నాయని అక్కడి వారు కొందరు చెప్పారు. వాటిని కూడా మేము సందర్శించాం. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న, అంతటి అత్యధ్భుత ఇస్లామిక్ శిల్పకళా నైపుణ్యానికి అచ్చెరువొందాం. ఇదే నమూనా గల మస్జిదును పాకిస్తాన్‌లోని లాహోర్‌లో నిర్మించారట. ఈ అద్భుత కట్టడం గురించి మాకెన్నో విషయాలు తెలిశాయి. 

 
ఇస్లామీయా కళాసంస్కృతి

మొఘల్ చక్రవర్తుల కళారాధనకు, శిల్పకళా నైపుణ్యానికి ఈ మస్జిద్ సజీవ సాక్ష్యం. మొఘల్ చక్రవ ర్తి షాజహాన్ దీనిని నిర్మించాడు. ఆయన నిర్మించిన అనేక కట్టడాల్లో ఈ మస్జిద్ అత్యంత ప్రాముఖ్యతను పొందింది. దేశ విదేశాల నుండి నిత్యం వేలాదిమంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ మసీదు అసలు పేరు ‘మస్జిదె జహా నుమా’. బహుశా ఈ మస్జిద్ కాంతులు జగమంతా ప్రసరించాలని షాజహాన్ ఈ పేరు పెట్టి ఉంటాడు. ఇస్లామీయ కళాసంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దబడిన ఈ మసీదు నిర్మాణం 1644లో ప్రారంభించారు. షాజహాన్ ఆంతరంగికుడు, ఆయన కొలువులో ప్రధానమంత్రి అయిన సఅదుల్లా ఖాన్ పర్యవేక్షణలో సుమారు 6 వేల మంది నిపుణులు, శ్రామికులు, శిల్పులు పదేళ్లకు పైగా రేయింబవళ్ళు శ్రమించి ఈ అద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దారు. 1656 జూలై 23న దీని ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చక్రవర్తి షాజహాన్ ఆహ్వానం మేరకు బుఖారాకు చెందిన ప్రముఖ దార్మిక విద్వాంసుడు షాహ్ బుఖారీ జామా మస్జిద్‌ను ఈదుల్ ఫిత్ ్ర(రమజాన్) పర్వదినాన లాంఛనంగా ప్రారంభించారు. ఈ మస్జిద్‌కు మౌలానా సయ్యద్ అబ్దుల్ గఫూర్ షా బుఖారీని చక్రవర్తి షాజహాన్ మొట్టమొదటి ఇమామ్‌గా నియమించాడు. తరువాతి కాలంలోనూ, నేటివరకూ అదే వంశానికి చెందిన బుఖారీలే జామె మస్జిద్ ఇమాములుగా కొనసాగుతున్నారు.

 
ఒకేసారి 25,000 మంది నమాజ్

ఈ మస్జిదు పొడవు 261 అడుగులు, వెడల్పు 90 అడుగులు. ఒకేసారి 25,000 మంది నమాజ్ ఆచరించుకునేటంత వైశాల్యం కలిగిన ఈ మసీదు భారతదేశంలోనే అతి పెద్ద మస్జిదు. మస్జిద్‌పై కప్పు మూడు గుమ్మటాలను పాలరాతితో అత్యద్భుతంగా నిర్మించారు. మసీదుకు రెండువైపులా రెండు అందమైన, ఎత్తై మినార్లు ఉన్నాయి. ఈ మినార్ల ఎత్తు సుమారు 130 అడుగులు. మినార్లపైకి చేరుకోవడానికి ఒక్కొక్క మినారుకు 132 చొప్పున 264 మెట్లు కూడా ఉన్నాయి. మసీదులో ప్రవేశించడానికి పెద్ద పెద్ద గేట్లు మూడున్నాయి. ప్రధాన గేటు మిగిలిన రెండింటికన్నా చాలా పెద్దది. ఇది ‘లాల్ ఖిలా’ (ఎర్రకోట) వైపు ఉంటుంది. ఈ ద్వారాన్ని‘బాద్ షా దర్వాజా’ అంటారు. చక్రవర్తి షాజహాన్ ఈ ద్వారం గుండానే నమాజుకు వచ్చేవాడట. ఇప్పుడు జామె మస్జిద్ ఉన్న ప్రాంతం ఒకప్పుడు ఎత్తై కొండ ప్రాంతం. మస్జిద్ నిర్మాణం కోసం కొండను తొలగించినప్పటికీ ఇంకా అది చాలా ఎత్తులోనే ఉంది. మస్జిద్‌లోకి వెళ్లాలంటే సుమారు 35 మెట్లు పైకి ఎక్కవలసిందే.

 
ప్రాంగణం మధ్యలో పాలరాతి తొట్టి

జామె మస్జిద్ గర్భ నిర్మాణానికి, నిర్మలమైన పాలరాతిని ఉపయోగించారు. మిగతా నిర్మాణానికి ఎర్రరాయిని వినియోగించారు. ప్రాంగణం మధ్యలో ‘వజూ’ (నమాజ్ సమయంలో ముఖం, కాళ్లు చేతులు కడుక్కోవడం) చేసుకునేందుకు తెల్లని పాలరాతితో ఒక పేద్ద హౌజు నిర్మించారు. ఆ కాలంలో బావి నీటితోనే తొట్టిని నింపేవారు. దీనికోసం ఉత్తరవైపు ద్వారానికి దగ్గరలో ప్రత్యేకంగా ఒక బావిని తవ్వించారు.

 
ఆధ్యాత్మిక పరిమళాలు

నిత్యం వేలాదిమంది నమాజీలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ఈ అపురూప మస్జిదు రమజాన్ మాసంలో మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణతో చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ సుందర కట్టడాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి సందర్శకులు కుప్పలు తెప్పలుగా పోటెత్తుతుంటారు. మస్జిద్ కట్టడం, ఆ రాజసం కనులారా వీక్షించాల్సిందే తప్ప ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి చారిత్రక మసీదును సందర్శించే అవకాశం కల్పించిన దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ రెండు రకాత్‌ల నమాజ్ చేసుకొని తీయని అనుభూతులతో తిరుగుప్రయాణమయ్యాము.

 - యండీ.ఉస్మాన్ ఖాన్

 

చేరుకోవడం ఇలా!
దేశంలోనే అతి పెద్ద మెట్రో పాలిటన్ నగరాలలో ఒకటి ఢిల్లీ. ఇక్కడే ఈ అద్భుత చారిత్రక కట్టడం ఉంది. హైదరాబాద్ నుంచి సుమారు 1543 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చాందినీ చౌక్‌లోని మస్జిద్ చేరుకోవడానికి ట్యాక్సీలు, బస్సులు ఉన్నాయి.  ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 10- 15 నిమిషాలలోపు జామె మస్జిద్‌కు చేరుకోవచ్చు.  దేశంలోని అన్ని చోట్ల నుంచి ఈ నగరానికి కనెక్టివిటీ ఉంది.

 

మసీదు దగ్గర ిపిల్లలెంతో ఉత్సాహంగా...
ఈ మసీదు దగ్గర పిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. రమజాన్ నెలవంక కోసం చిన్న పిల్లలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. నెలవంక కనిపించగానే వారి కళ్ళలో కనిపించే ఆనందం వర్ణనాతీతం. పెద్దవాళ్ళతోపాటు ఉత్సాహంగా రోజా పాటిస్తారు. సాయంత్రం ఇఫ్తార్ వేళ వాళ్ళ హడావిడి మామూలుగా ఉండదు. ఎంతో భక్తిశ్రధ్ధలతో శుభ్రమైన వస్త్రాలు ధరించి, చక్కని టోపీలు పెట్టుకొని మసీదులకు క్యూ కడతారు. సైరన్ మోగేవరకూ నిరీక్షించి పెద్దలతో కలసి ఇఫ్తార్ చేస్తారు. పెద్దలు కూడా వారిని ప్రోత్సహిస్తూ, ఎంతసేపటి వరకు ఉండగలరో అప్పటివరకూ రోజా పాటింపజేస్తారు. దీనివల్ల చిన్నతనం నుండే వారిలో భక్తిభావం, నైతిక విలువలు అలవడతాయి. పేదసాదలకు దానం చేయడానికి కూడా కొంతసొమ్ము వారిచేతికిచ్చి వారి చేతులతోనే దానధర్మాలు చేయిస్తారు. దీనివల్ల వారిలో ఇప్పటినుండే దానగుణం కూడా అలవడుతుంది. ఇక పండుగనాటి వారి సంతోషానికి ఆకాశమే హద్దు. తెల్లవారుజాము నుంచే పిల్లల హడావిడి మొదలవుతుంది. స్నానపానాదులు ముగించుకొని పెద్దలతో కలసి మస్జిద్‌కు వెళతారు. అమ్మా నాన్నలు ఇచ్చిన పైకాన్ని దారిలో ఉన్న పేదసాదలకు దానం చేసి సంతోషిస్తారు.

మరిన్ని వార్తలు