పూజ పరమార్థం

10 Oct, 2017 00:25 IST|Sakshi

ఆత్మీయం

కొందరు పూజ ప్రారంభంలో సంకల్పం విషయంలో చాలా శ్రద్ధ చూపుతారు. తమకున్న అనేక కోరికలు సఫలం కావాలని సంకల్పంలో చెప్పుకుంటారు. గుడికి వెళితే, పూజారికి తమ పేరు, గోత్రం చెబుతారు. ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులవి, తెలిసిన వాళ్లవి, తమకు ఇష్టమైన వారివి... ఇలా కనీసం ఒక డజనుకుపైగా పేర్లు, గోత్రాల జాబితా చెప్పందే వదలరు. ఆ తర్వాత పూజమీద మాత్రం మనసు లగ్నం చేయరు. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఎక్కడైనా దేవుడి ప్రతిమ కనిపిస్తే, అక్కడినుంచే ఒక నమస్కారం విసిరేస్తారు. గుడికి వెళ్లినప్పుడు మాత్రం దేవుడి మీద మనసు లగ్నం చేయరు. ముందువాళ్లని, పక్కవాళ్లని తోసుకుంటూ, తామే ముందుగా వెళ్లడం మీదే దృష్టి అంతా.  ఇంకొందరికి కోరికల మీద తప్ప దేవుడి మీద భక్తి ఉండదు. ఏ దేవుడు ఏ కోరిక తీర్చడంలో ప్రసిద్ధో తెలుసుకుని ఆయా ఆలయాలకు వెళుతుంటారు. నిజానికి కోరికలు కోరడంలో తప్పేమీలేదు. కానీ, తన భక్తులకు ఏమి కావాలో ఈశ్వరునికి తెలుసనే విషయం మీద నమ్మకం ఉంటే అలా చేయరు.

మనకేది మంచిదో దానిని ఎప్పుడు ఎలా, ఎవరి ద్వారా ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి కోరికలు నెరవేర్చుకోవడం కోసం చేసే పూజ నిజమైనది కాదు. భక్తితో ఈశ్వరార్చన చేయడంæసద్గుణం. సర్వాంతర్యామి అయిన భగవంతుని ఆలయానికి వెళ్లినప్పుడు మనసుకు పశాంతత, ఏకాగ్రచిత్తం లభిస్తాయి. వాటితోపాటు అక్కడ నిత్యం చూసే ఆచారాలు (ఆచరించే వాటిని ఆచారాలు అంటాం) మనలను ఆలోచింపచేస్తాయి. వాటివెనుక కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయని, ఈ ఆచారాల వెనుక లౌకికమైన, వేదాంతపరమైన అంశాలు మిళితమై ఉన్నాయని ఆధ్యాత్మిక గురువులు, అర్చకులు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం అవసరం. గుడికి వెళ్లిన కాసేపూ మనసును ప్రశాంతంగా ఉంచుకుని, భగవంతుడి మీద లగ్నం చేస్తే, మనకు కావలసినవేవో ఆయనే తీరుస్తాడు కదా!  

మరిన్ని వార్తలు