కొడుకు మాట్లాడితే చాలు

4 Aug, 2015 23:17 IST|Sakshi
కొడుకు మాట్లాడితే చాలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి
 
ఈ అమ్మ ముద్ద అడగడం లేదు. ప్రేమ అడుగుతోంది.
తన కొడుకు చేత మాట్లాడించమని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.
‘నా కొడుకు మీద కేసు పెట్టకండి... నా కొడుకును కొట్టకండి...
వాడిని నాతో మాట్లాడమని చెప్పండి చాలు’ అని ప్రాధేయపడింది.
ఇటీవల ముసలి తల్లిదండ్రులని పిల్లలు బస్టాండ్లలో, శ్మశానాల్లో, బజార్లలో వదిలివెళ్లిపోవడం వింటున్నాం. భార్యని వేధిస్తే కేసు పెట్టొచ్చు.
అమ్మని పట్టించుకోకపోవడం వేధింపు కాదా? అది కేసు కాకూడదా?
నిజానికి అలాంటి చట్టం ఉంది. కానీ ఏ తల్లి, ఎంత వేధింపునకు గురైనా తన కొడుకు మీద
కేసు పెడుతుందా? ఇక్కడ కేసు ప్రేమకు సంబంధించినదే తప్ప నేరానికి సంబంధించినది కాదు.
తల్లి మనల్ని చూసుకున్నట్టుగా అల్లారు ముద్దుగా చూసుకోనక్కర్లేదు.
పస్తులుండి భోజనాలు పెట్టక్కర్లేదు. జీవితాలు త్యాగం చేసి, ఆస్తులు కట్టబెట్టక్కర్లేదు.
అమ్మా అని పిలిస్తే చాలు. బిడ్డలా చూసుకుంటే చాలు.     

 
అరవై ఏళ్ల సరోజనమ్మ (పేరు మార్చాం)... భర్త, ఇద్దరు కొడుకులతో హైదరాబాద్‌లోని ఓ బస్తీలో ఉంటోంది. పిల్లల ఆదరణ, ఆప్యాయతలతో నిశ్చింతగా గడపాల్సిన సరోజనమ్మ వారి నిరాదరణ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో తనకు న్యాయం కావాలంటూ పోలీసుస్టేషన్‌కు వెళ్లింది!

‘అయ్యా, నాకు నా కొడుకు ప్రేమ కావాలె, మీరే న్యాయం చేయాలె’ అంటూ ఏడుస్తూ ఠాణాలోనే కూర్చుంది. ‘ఇది మీ ఇంటి సమస్య. మీరే పరిష్కరించుకోవాలి. ఏదైనా నేరం జరిగితే చెప్పండి. కేసుపెడతాం’ అన్నారు పోలీసులు. ‘అయ్యా, కేసొద్దు. నా కొడుకును కొట్టద్దు. జైల్లో పెట్టద్దు. వాడి కొలువు పోవద్దు. వాడు నాతో మునుపటిలా మాట్లాడితే సాలు. నాకీ సాయం చేయుండ్రి’ అని చేతులెత్తి దండంపెట్టింది సరోజనమ్మ. పోలీసులు కొడుకులను పిలిపించారు. విషయం కనుక్కున్నారు. సరోజనమ్మ ఆవేదనను శ్రద్ధగా, సానుభూతితో విన్నారు.
 ‘‘ఈ ఏడాది జనవరిలో చిన్న కొడుకు పెండ్లి చేసిన్నయ్యా. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, వాళ్ల పిల్లలతో ఈ ముసలితనంలో సంతోషంగా ఉండాలని నే కోరుకున్న. కానీ, పెళ్లయిన రెణ్ణెళ్లకే నా కొడుకు నాతో మాటలు బంజేశిండు. ‘అమ్మా! ఎట్లున్నవే’ అని అడుగతలేడు. ఎందుకిట్లా అవుతోందని నాకు మనసు మనసుల లేదు.

యాపైఏళ్ల క్రితం...
పదకొండేళ్ల వయసులో హైదరాబాద్‌కు అత్తగారింటికి వచ్చిన. మా ఆయనకు మతి సరిగ్గా ఉండేది కాదు. గవర్నమెంట్ ఆఫీసులో ఓ చిన్న ఉద్యోగం చేసేటోడు. మతి సరిగ్గా లేదు, ఉద్యోగం నుంచి తీసేస్తామంటే.. ఆడికి పోయి పై అధికారులందరి కాళ్లు పట్టుకున్నా. ఆ రోజులు కాబట్టి, నా బాధ అర్థం చేసుకొని ఉద్యోగంలో ఉండనిచ్చిండ్రు. ‘మా అక్క ముఖం చూసి నిన్నిచ్చినా బిడ్డా, మతిలేనోడితో ఎట్లా ఏగుతవ్, వదిలొచ్చెయ్, ఇంకో పెండ్లి చేస్తా!’ అన్నడు మా నాయిన. ‘వద్దు నాయినా, సావ యినా.. బతుకైనా ఇక్కడే’ అనే జెప్పిన. ముగ్గురు పిల్లలు కలిగిండ్రు. ఉన్నంతల్నే పిల్లలకు సదువులు జెప్పించిన. ఆయనకొచ్చే కొద్ది జీతంల్నే పొదుపుగా నెట్టుకొస్తూ చిన్న జాగన రెండంతస్తుల ఇల్లు కట్టించిన. కూతురికి మంచి సంబంధమే చేసిన. పెద్దోడి పెళ్లైనంక మొదటి అంతస్తులో కాపురం పెట్టించిన. అలాగే, ఆర్నెల్ల క్రితం చిన్నోడికి పెళ్లి చేసి ఆ పై అంతుస్తులో కాపురం ఉంచిన. కొడుకులు-కోడండ్లు నా దగ్గరకే వచ్చి భోజనం చేసేటోళ్లు. కానీ, ఎందుకో నా ఈ నడాన మాటంటేనే నా కొడుక్కు పడకుండా అయ్యింది.

 నన్ను చూడందే కళ్లు తెరిచేటోడు కాదు
 బడికి పోయేటప్పుడే కాదు, నిన్నమొన్నటిదాక ఆఫీసుకు పోయేటప్పుడు కూడా పొద్దున్నే పాలు పట్టుకొని కొడుకుల ఎనకాలే తిరిగేదాన్ని, చిన్నోడైతే.. నన్ను చూడందే పొద్దున్నే నిద్ర నుంచి కళ్లు కూడా తెరిశేటోడు కాదు. నీ ముఖం చూస్తే అ రోజంతా బాగుంటదే అనేటోడు. ఆఫీసుకెళ్లినా ఫోన్ చేసి, ‘తిన్నవానే!’ అని పలకరించేటోడు. ఆఫీసు నుంచి రాగానే పక్కన కూర్చొని గా ముచ్చట్లు జెప్పేటోడు. వాడు ఆఫీసుకు పోయేటప్పుడు పొరపాట్న నేను కూరగాయలకు బోయి ఇంకా రాకపోయినా వచ్చేదాకా కూసోని అప్పుడు ఎల్లేటోడు. వాడకట్టున చూసేవాళ్లంతా సరోజనమ్మ పిల్లలే పిల్లలు. అంత బాగా పెంచింది అనేవారు.

 నాలుగు నెలలుగా మాటల్లేవు
 ఓ రోజు ‘నా భార్యను సరిగా చూస్త లేవు. నేనంటే నీకు ఇష్టం లేదు. నీకు అన్నా, వదిన అంటేనే ఇష్టం’ అన్నాడు చిన్నోడు. ‘అదేందిరా, మీరిద్దరూ నాకు రెండు కండ్లు. ఏ కన్ను ఇష్టం అంటే, ఎట్లా చెబుతా,’ అని సముదాయించినా! అయినా అట్టనే ఉన్నడు. వాడి మనసు మారింది. ఎప్పుడు ఆఫీసుకు పోయేటోడో, ఎప్పుడొచ్చేటోడో తెలిసేది కాదు. నాకు ఆరోగ్యం బాగుండదు. ఒకసారి గుండెపోటు కూడా వచ్చింది. మా ఆయన చూస్తే ఓ మాటా పలుకు లేకుండా ఉంటడు. మమ్మల్ని చూసుకోవాల్సిన కొడుకు ఇట్టా ఏ మాత్రం పట్టనట్టుగా ఉంటే ఏమనుకోను? నా ముఖం సూడకపోతే ఆ రోజు బాగుండదు అని చెప్పినోడు. ఇయ్యాల నా ముఖం చూడటానికే రావడం లేదు. కుమిలి కుమిలి ఏడ్సిన. తర్వాత అసలు విషయం బయటపడింది. ఆస్తిలో వాటా గురించి!

కంటి నిండా కునుకు లేదు
‘ఆస్తి పంచిస్తే అది అమ్ముకొని, వేరే దగ్గర ఇల్లు కొనుక్కుంటాం’అన్నారు. ‘ఇప్పుడే ఆస్తి ఎట్లా పంచిస్తా!, మేమా ముసలితనంలో ఉన్నాం. అన్నకు లాగ నీకు ఓ బిడ్డ పుట్టాక ఇస్తా’ అని సముదాయించిన. కానీ, ఇన లేదు.  పంచాయితీని నలుగురు పెద్ద మనుషులల్ల పెట్టిండ్రు. వాళ్లు కూడా ‘ఎప్పుడైనా కొడుకులకు ఇచ్చేదే కదా! ఇచ్చెయ్’ అన్నరు. అప్పటికి ఏమీ జెప్పలే. కానీ, ఇంటికొచ్చి ఆలోచన చేశిన. ఆస్తి పంచిస్తే కొడుకు అమ్ముకొని ఏరే వెళ్లిపోతడు. నా కండ్లముందుండడు. ఇప్పుడే ఇట్లున్నడు. రేపు దూరమైనంక మళ్లా ‘అమ్మా!’ అని పిలుస్తడన్న నమ్మకం లేదు. ఎప్పుడూ గిదే మనాది. పెండ్లి కాకముందు ఎట్ల చూసుకునేటోళ్లు... అని యాదికొస్తే దుఃఖం ఆగలేదు.
 
సాధించినఈ ఆస్తి కొట్లాట ఎటు తిరిగి ఎటొస్తదో తెల్వదు. ఎవరికి ఏమైనా కష్టమే. రెండు దినాలు బాగా ఆలోశించిన. సదువుకున్నదాన్ని కాదు. ఎవరిని అడగాల్నో తెలియదు. పోలీసులైతే న్యాయం చేస్తారనిపించి, సక్కగ ఆడికేబోయిన. వాళ్లు నా ఇద్దరు కొడుకులను, కోడండ్లను పిలిచి మాట్లాడిండ్రు. ‘ఏం కావాలి’ అని వాళ్లు నన్ను అడిగితే- నన్ను మునుపటిలా చూసుకోవాలె అని చెప్పిన. ‘నెల రోజులు పెద్ద కొడుకు, ఇంకో నెల రోజులు చిన్న కొడుకు ఇట్లా ఎప్పటికీ.. వాళ్లు తినేదాంట్లో నాకూ, మా ఆయనకు ఇంత పెట్టాల’ని చెప్పిన. ఇప్పుడు చిన్న కొడుకు వంతు. కొడుకు-కోడలు పొద్దున, రాత్రి భోజనం తెచ్చి పెట్టి మాట్లాడించి పోతుండ్రు. ముందు పట్టించుకోనట్లు ఉన్న నా కొడుకు, ఇప్పుడు మంచిగ చూసుకుంటుండు, మునుపటిలా మాట్లాడుతుండు. అది సాలు నాకు’ అని కన్నీళ్లు తుడుచుకుంది సరోజనమ్మ.

పిల్లలే ఆస్తులుగా, వారితోటే ప్రపంచంగా బతికే      తల్లిదండ్రులున్న సమాజం మనది. ముదిమిలో తమ పిల్లలతో -వారి పిల్లలతో ఆనందంగా జీవించడం కోసం కలలు కంటారు. కానీ, ఆ కలలన్నీ కల్లలయ్యే సంఘటనలు ఎన్నో మన సమాజంలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ తీరు మారాలి. కని పెంచిన వారి రుణం... వారి వృద్ధాప్యంలో తప్పక తీర్చుకోవాలి. ఇది పిల్లల బాధ్యత. కనీస మానవత్వం.
 - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 అంతా  సాక్షి చలవే...
నాకు 80 ఏళ్లు. ఇద్దరు కొడుకులు, నలుగురు బిడ్డలు. నేనూ, మా ఆయన పిల్లలను రెక్కల కష్టమ్మీద సాకినం. మా ఆయన చనిపోయి శానకాలమైంది. కొన్నాళ్లు ఒక కొడుకు ఇంట్లో, ఇంకొన్నాళ్లు ఇంకో కొడుకింట్లో ఉండేదాన్ని. ఏడాది క్రితం.. కొడుకులు, బిడ్డలు ఎవరూ పట్టించుకోకపోవడంతో మా ఊళ్లో కమ్యూనిటీ హాల్ ముందు పడుకునేదాన్ని. ఎవరైనా దయతలచి ఇంత తిండి పెట్టేవారు. లేదంటే, అదీ ఉండేది కాదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అక్కడే పడి ఉండేదాన్ని. సాక్షి టీవీల నా గురించి ఇవ్వడంతో ఊరి పెద్దలు మా కొడుకులను పిలిచి మంచిగ చూసుకోమని చెప్పారు. అప్పటి నుంచి మంచిగ చూసుకుంటున్నరు.
                                                                    - అడిదెల్ల మైసమ్మ, చివ్వెంల, నల్లగొండ
 
 కౌన్సెలింగ్ ఇస్తాం
 పిల్లల ప్రేమ కావాలంటూ పెద్దలు అడుగుతుంటే బాధేస్తుంది. కన్నవాళ్లను సరిగా చూడకున్నా, ప్రేమపంచకున్నా, అన్నం పెట్టుకున్నా ఆ పిల్లలపై సీనియర్ సిటిజన్స్ యాక్ట్‌ప్రకారం కేసులు నమోదు చేయవచ్చు. ముందుగా వారి పిల్లలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. ఒక వేళ వినకపోతే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం.
 - డి. ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏసీపీ. బంజారాహిల్స్
 
 కేసు పెట్టొచ్చు
 2001లో 7.5 శాతం ఉన్న వృద్ధుల జనాభా 2026 నాటికి 12.4 శాతానికి పెరుగుతందని ఒక అంచనా. ఎన్నాళ్లుగానో ఎంతోమంది వృద్ధులు పిల్లలు పట్టించుకోని కారణంగా బాధపడుతున్నారు. ఇది గమనించి భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం 2007లో ఒక చట్టం తెచ్చింది. పెద్దలను చూసుకోవాల్సింది పిల్లలేనని ఈ యాక్ట్ చెబుతోంది. వృద్ధులను, వారి ఆస్తులను రక్షించడానికి పిల్లలు లేకపోతే ఈ బాధ్యత వారి బంధువులు తీసుకోవాల్సి ఉంటుంది. వృద్ధులకు ఆదాయం లేనప్పుడు మెయింటెనెన్స్ కోసం వారి పిల్లలు, మనవలు, మనవరాళ్లు, బంధువులు.. మీద కూడా కేసు ఫైల్ చేయవచ్చు.     - నిశ్చల సిద్ధారెడ్డి, హైకోర్ట్ అడిషనల్ ప్లీడర్
 
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా