పాలిస్తాం... చోటివ్వండి

16 Aug, 2019 08:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అలమటింపు

గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పల్లెజనం పట్టణాల నుంచి ఏం నేర్చుకుంటున్నారో తెలియదు కానీ చాలా విషయాల్లో గ్రామీణ ప్రజల్లోని మానవత్వం, అమాయకత్వం, ప్రేమా మన మనసుల్ని పల్లెలవైపు పరుగులు తీయిస్తుంటుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా మననుంచి దూరమైనవేవో మనసుని నొప్పిస్తుంటాయి. ఇటీవల ఆగస్టు తొలివారంలో తల్లిపాల ప్రాధాన్యతను చాటిచెప్పే వారోత్సవాలను గురించి చదివినప్పుడు గుండెల్లో అలాంటిదే ఏదో నొప్పి బయలుదేరింది. కొద్దినెలల క్రితం చదివిన ఓ విషయం గుర్తొచ్చింది. బహుశా అలాంటి నొప్పినే, అలాంటి బరువునే గుండెల్లో నింపుకొని భారంగా, బాధగా బతుకులీడుస్తోన్న లక్షలాది మంది పట్టణాల్లోని పసిబిడ్డల తల్లులు గుర్తొచ్చి నాగరికత పేరుతో, అభివృద్ధి పేరుతో కుప్పలు తెప్పలుగా నిర్మితమౌతోన్న అమానవీయ, అనాగరిక కట్టడాలపై ఏహ్యభావం ఏర్పడింది. బహుళంతస్తుల సెంట్రలైజ్డ్‌ ఏసీ భవనాల్లో ఆరోగ్యం కోసం కూడా నాలుగు మెట్లు ఎక్కే బాధే లేకుండా ఎస్కులేటర్లు చాలా సుఖవంతమైనవే. అలాంటి చాలా సౌకర్యవంతమైన ఎన్నో షాపింగ్‌ కాంప్లెక్స్‌లూ, మల్టీప్లెక్స్‌లూ నగరం నిండా జనానికి చోటే లేకుండా అవే భవనాలు. అలా సకల సౌకర్యాలతో విలసిల్లుతోన్న షాపింగ్‌ ‘పెద్ద’ బజారుల్లో ఓ తల్లి కళ్లు దేనికోసమో వెతుకుతూనే ఉన్నాయి. షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని ట్రయల్‌ రూం ముందున్న సింగిల్‌ స్టూల్‌పై కూర్చొని జీన్స్‌ పైన సౌలభ్యం కోసం వేసుకున్న లూజ్‌ టీషర్టుని ఓ వారగా గబగబా పైకి లాగి చిన్నారి నోటికి స్థనాన్ని అందించిందో చిన్నపిల్ల తల్లి. అంతే! అంతలోనే అక్కడికొచ్చిన ఓ వ్యక్తి అది పిల్లలకు పాలివ్వడం కోసం ఏర్పాటుచేసిన స్థలం కాదనీ, తక్షణమే ఖాళీ చేయాలనీ నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడు. మరి ఏడుస్తున్న బిడ్డకి పాలెక్కడివ్వాలి? ఆమె ప్రశ్నకి సమాధానంగా

ప్రతీకాత్మక చిత్రం : ‘పాలిచ్చే తల్లులకుకాస్త చోటు చూపించండి’ అంటూ ఇటీవలేఆన్‌లైన్‌ వేదికగా ఒక ఉద్యమం మొదలైంది.
‘అదిగో అక్కడుంటాయి టాయ్‌లెట్స్‌.. అందులో కూర్చొని ఇవ్వొచ్చు’ అని ఉచిత సలహా ఒకటి పారేసి వెళ్లాడు. తల్లిపాలు కల్తీ లేనివి. కల్తీ చేయలేనివి. గుండెల్నిండుగా హత్తుకుని ఇచ్చే తల్లిపాలు బిడ్డ ఆకలి మాత్రమే తీర్చవు. ప్రేమతో నిండిన పాలిండ్ల స్పర్శ బిడ్డకూ, తల్లికీ కూడా ఆరోగ్యాన్నిస్తాయి. అలాంటిది అపరిశుభ్రమైన ప్రాంతంలో, దుర్గంధంతో నిండిన విసర్జిత ప్రాంతంలో బిడ్డకు పాలివ్వమని చెప్పే పరిస్థితి ఈ పట్టణాల్లో మనం మిస్సవుతోన్నదేమిటో మనకు గుర్తు చేస్తోంది. అంతెందుకు చాలా రోజుల క్రితం రోడ్డుపక్కగా (మిగిలిన వాహనదారులకు ఏ ఆటంకం లేకుండా) కారు ఆపుకుని బిడ్డకు పాలిస్తోన్న తల్లిపై ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ చేసిన రుబాబూ, రాద్ధాంతం టీవీ చూసినవారందరికీ గుర్తుండే ఉంటుంది. రోడ్డుపైన అడ్డదిడ్డంగా కార్లు పార్కుచేసినా కిమ్మనకుండా వెళ్లిపోయే వాళ్లు కూడా పసిబిడ్డకు పాలిచ్చేప్పుడు ఆటంక పరచకూడదనే ఇంగితం లేకుండా పోయింది. అయితే ఆ ఇంగితం ఉండాల్సిందెవరికి? నిజానికి నగరాలకే. పర్యావరణాన్ని గాలికి వదిలేసి, అనుమతులకు చెల్లుచీటీ ఇచ్చేసి, కుప్పలుతెప్పలుగా కట్టేసోన్న బహుళంతస్థుల భవనాల్లో మహిళలకు కావాల్సిందేమిటో ఎవ్వరైనా ఆలోచించారా? పసిబిడ్డలకు పాలిచ్చే ఓ రెండడుగుల ప్రైవసీ స్థలం. ఓ చిన్ని కుర్చీ. ఇంత చిన్న విషయం కొన్ని వేల మంది సమస్య అయినప్పుడు ఇదెందుకు తట్టదు ఎవరికీ? అంటే అది స్త్రీల సమస్య మాత్రమే కాబట్టి. ఆడపిల్లలకి ఏరకంగానూ అక్కరకు రాని నగరాలను నాగరికంగా మార్చగలమా? – అరుణ అత్తలూరి

మరిన్ని వార్తలు