ఆత్మాభిమానం షెల్టర్ ఇచ్చింది

20 Sep, 2013 00:35 IST|Sakshi
ఆత్మాభిమానం షెల్టర్ ఇచ్చింది

బస్టాప్! ఇరుగ్గా ఉంటుంది. మురిగ్గా ఉంటుంది.
 వానకు చెరువవుతుంది. ఎండకు చెమటౌతుంది. చలికి చచ్చేచావౌతుంది.
 తప్పనిసరైతే తప్ప, అక్కడెవ్వరూ... ఎక్కువసేపు ఉండాలనుకోరు.
 అలాంటిది ఏడాదిగా బస్టాప్‌లోనే ఉంటోంది అనసూయమ్మ!
 అక్కడే ఉండడం, అక్కడే తినడం.
 పిల్లల్లేరా? ఉన్నారు. ఎనిమిది మంది!
 వాళ్లకు ఇళ్లే లేవా?
 ‘ఉన్నాయ్ కానీ, నేనుండలేను’ అంటోంది ఈ వృద్ధమాత!
 ఎందుకని?
 కొడుకుల మనసుల కంటే బస్టాపే విశాలంగా అనిపించిందా?
 ఈ మాటకు నవ్వుతుంది. ఏమిటా నవ్వుకు అర్థం?
 చదవండి... ఈవారం ‘ప్రజాంశం’ !

 
 ‘అమ్మని యాదగిరి గుట్టలో వదిలివెళ్లిన కొడుకు’, ‘తల్లి దగ్గర బంగారం తీసుకుని ఇంటినుంచి వెళ్లగొట్టిన పుత్రుడు’... ఇలాంటి శీర్షికలతో రోజుకొక వార్త చదువుతుంటాం. ఒక నిమిషం.. ‘అయ్యో... ఎంత దారుణం’ అనుకుని ఒక నిట్టూర్పుతో సరిపెట్టుకుంటాం. పెద్దవాళ్లయితే ‘కలికాలం... కన్నతల్లి అని కూడా చూడకుండా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు...’ అంటూ రెండు మూడు శాపనార్థాలు పెట్టి ఊరుకుంటారు.
 
 తల్లికి బిడ్డ బరువు కాదు. ఆమాటకొస్తే... బిడ్డలెందరయినా బరువు కాదు. కాని ఇప్పుడు బిడ్డకు తల్లి బరువవుతోంది. రోడ్డుపై భిక్షాటన చేసుకునే వృద్ధ మాతృమూర్తులందరూ బిడ్డలు లేని వారు కాదు... పట్టెడన్నం పెట్టలేని నిరుపేదబిడ్డల తల్లులు అంతకంటే కాదు. అలాంటి తల్లుల్లో అనసూయ ఒకరు.  హైదరాబాద్  హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ దిగగానే చండ్రరాజేశ్వరరావు  వృద్ధాశ్రమానికి ఆనుకునే ఉన్న బస్‌స్టాప్‌లో గత ఏడాదికాలంగా ఉంటున్న ఈ వృద్ధురాలిని పలకరిస్తే.... తన పేగు పంచుకున్న ఎనిమిదిమంది కొడుకుల కబుర్లు ఓపిగ్గా చెప్పుకొచ్చింది. బిడ్డలేని తల్లి అయితే అనాథనంటూ కన్నీళ్లు పెట్టుకునేది. పదిమందిని కని పెంచిన ఆ తల్లిప్రేమ ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్వగా... ఏడ్వగా... నవ్వే మిగిలినట్లుంది!
 
 ‘ఫలానా బస్‌స్టాప్‌లో ఒక ముసలావిడ చాలా రోజుల నుంచి ఉంటోంది. సాయంత్రం అవగానే ఏవో కూనిరాగాలు తీసుకుంటూ వచ్చేపోయేవాళ్లని పలకరిస్తూ చాలా హుషారుగా కనిపిస్తుంది. చూడబోతే.. బాగా బతికినావిడలా ఉంది. ఎవరూ లేని వ్యక్తి  మాత్రం కాదనిపిస్తుంది...’ అని అటుగా వెళ్తున్నవాళ్లు అనుకోవడం విని అక్కడికి వెళ్లినపుడు... ఆమె అప్పుడే నిద్రలేచినట్టుంది. గోడకు చేరగిలబడి తనలో తాను ఏవో మాట్లాడుకుంటోంది. ‘నీ పేరేంటమ్మా...’ అని అడగ్గానే...‘అనసూయ తల్లీ... అయినా నా పేరు నీకెందుకమ్మా’ అంటూ అడిగింది. విషయం చెప్పగానే తన గురించి చక్కగా చెప్పుకొచ్చింది.
 
 మధురైలో పుట్టి...


 ‘‘నేను పుట్టింది మధురైలోని మధురమీనాక్షి గుడి దగ్గర. మా నాన్న మిలటరీలో పనిచేసేవాడు. నాకు నాలుగేళ్లప్పుడే చనిపోయాడు. మా ఇంటి దగ్గరున్న ఒక పెద్దాయన అమ్మనీ, నన్నూ వరంగల్‌లోని పరకాల దగ్గర పుత్తాలపల్లి రాజేంద్రస్వామికి అమ్మేశాడు. అతను అమ్మని తన దగ్గరపెట్టుకుని నాకు ఆరేళ్ల వయసప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఆరువందల రూపాయలకు నన్ను అమ్మేశాడు. నాకు పదకొండేళ్లు వచ్చాక అతను తన కొడుకు మొగులయ్యకి ఇచ్చి పెళ్లి చేశాడు’’ అంటూ గతం గుర్తుచేసుకుంటున్నప్పుడు అనసూయ పదహారేళ్ల అమ్మాయిలా మారిపోయి తన పెళ్లినాటి కబుర్లు చెప్పుకొచ్చింది. మొగులయ్య చాలా మంచివాడు. అనసూయని కళ్లలో పెట్టుకుని చూసుకున్నాడు. వీరిద్దరి ప్రేమకు సాక్ష్యాలుగా పదిమంది పిల్లలు కళ్లముందు కదలాడుతుంటే  చూసుకుని మురిసిపోయారు.
 
 కిరాణాకొట్టు... పెరుగు కుండ


 మొగులయ్య కిరాణాకొట్టు నడుపుతూ... అనసూయ పెరుగు అమ్ముతూ ఎనిమిదిమంది మగపిల్లల్ని, ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి పెద్దచేశారు. ‘‘నా అదృష్టం బాగలేక ఇద్దరు మగపిల్లలు చిన్నప్పుడే రోగమొచ్చి సచ్చిపోయిండ్రు. మిగతావాళ్లని చేతనైనకాడికి చదివించినం. సత్యనారాయణ, వేణుగోపాల్, శంకర్‌లింగం, సదానందం, జయరాములు, సాంబమూర్తి, రాజేంద్రస్వామి, లక్ష్మీనారాయణస్వామి....’’ అంటూ బిడ్డల పేర్లు తలుచుకుంటుంటే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘‘మిగిలిన పిల్లలంతా ఆ దేవుని దయవల్ల క్షేమంగానే ఉన్నారు’’ అంటూ ఆ కన్నీళ్లని ఆనందబాష్పాలుగా మార్చుకుంది. నాలుగేళ ్లక్రితం చనిపోయిన తన భర్తని గుర్తు చేసుకుంటూ  ‘‘ఇంకా చానాకాలం బతికేటోడే.... ఏం చేస్తడు... మంచంబట్టి కొడుకులకు బరువైండు. సమయానికి నేను కూడా లేను, అన్యాయంగా సచ్చిపోయిండు మారాజు’’. ఈసారి కన్నీళ్లు ఆగలేదు. కాసేపు భర్తని తలుచుకుంటూ, తన పరిస్థితికి బాధపడుతూ ఏడ్చింది.
 
 పాతబస్తీలో వదిలేశాడు


 పిల్లలు పెద్దవాళ్లయ్యాక అందరికీ పెళ్లిళ్లు చేశారు. అంతా బాగుందనుకున్న సమయంలో అనసూయకు మతిస్థిమితం తప్పి ఎక్కడికో వెళ్లిపోయింది. ‘‘అవునమ్మా... ఎక్కడికో వెళ్లిపోయాను. పాపం నా భర్త నాకోసం చాలా వెతికిండంట. నాకు జబ్బు నయమై పిల్లలు, భర్త గుర్తొచ్చి ఇంటికి చేరేసరికి నా భర్త చనిపోయిండు. పిల్లలు కొన్నిరోజులు ఒకదగ్గర, కొన్ని రోజులు ఒకదగ్గర అంటూ నన్ను పంచుకున్నారు. రెండు మూడేళ్లయినంక ఎవ్వరూ చూడమన్నరు. ఒకనాడు నా పెద్దకొడుకు డాక్టరు దగ్గరికి తీసుకపోతా అని చెప్పి... ఆటోల ఎక్కించుకుని పాతబస్తీ దర్గ దగ్గర వదిలిపెట్టి వచ్చేసిండు. పిచ్చోడు... నాకు హైదారాబాద్ మొత్తం తెలుసునన్న సంగతి వాడికి తెల్వదు. నాకు చాలా కోపం వచ్చింది. అందుకే వాడు ఇక్కడ్నే ఈ ఆశ్రమంలో పని చేస్తున్నడని తెలిసి ఇక్కడే వాడి కళ్లెదురుగా ఉండాలనే పట్టుదలతో ఈ బస్టాపులో ఉంటున్న’’ అంటున్నప్పుడు అనసూయ కోపం మాటల్లోనే కాదు కళ్లలో కూడా కనిపించింది.
 
 ఆ పూజలెందుకు...


 బస్‌స్టాప్ పక్కనే తోపుడు బండిలో కొబ్బరిబోండాలమ్మే లక్ష్మి మాట్లాడుతూ... ‘‘నేను బండి పెట్టేటప్పటికే ఈమె ఇక్కడుంది.  ఆమె కొడుకుల్లో ఒకరు గుళ్లో పూజారిగా, ఇంకో కొడుకు కొండాపూర్‌లోని ఒక వెల్డింగ్‌షాప్‌లోనూ పనిచేస్తున్నాడు. మిగతా కొడుకులు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ బాగానే ఉన్నారు. అయినా, తల్లిని చూడని కొడుకులు ఎంతమంది ఉంటే మాత్రం ఏం లాభం?అలాంటి వాళ్లు ఉంటే ఎంత... లేకుంటే ఎంత’’ అని నిట్టూర్పు విడిచింది.  
 
 చిన్నప్పుడు అమ్మ ధైర్యంగా ఉండి అన్ని పనులూ చక్కబెడితే మా అమ్మ చాలా స్ట్రాంగ్ అని గర్వంగా చెప్పుకుంటాం. అదే అరవైఏళ్లు దాటిన అమ్మ సలహా ఇస్తే ‘నీకెందుకు... కృష్ణా..రామా  అని పడి ఉండక’ అంటాం. అలా అనే అనసూయకు బస్‌స్టాప్‌ని  ఇల్లు చేశారు. ‘‘ఈ బస్టాపు నా బిడ్డల ఇల్లు కంటే విశాలంగా ఉంది. మనుషులు కనిపిస్తారు. కొందరు బిడ్డల్లా ప్రేమగా పలకరిస్తారు. ఇంకొందరు ఇంత తిండి పెడుతున్నారు. నాకు ఇంతకంటే ఏం కావాలి’’అంటూ కళ్లొత్తుకుందా పెద్దామె.
 
 ప్రతి తల్లికి బిడ్డల చిన్నప్పుడు పచ్చని జీవితం ఉంటుంది. పండుటాకై రాలి కిందపడే లోపు బిడ్డల చేతిలో నరకం చూస్తున్న అనసూయవంటి దురదృష్టవంతులైన తల్లులూ ఉంటారు. ఈమె కథ తల్లిని నిర్లక్ష్యం చేసే కొడుకులకు కనువిప్పు అయితే చాలు!
                                    
 - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 

మరిన్ని వార్తలు