అమ్మా! నీకు వందనం!!

13 May, 2017 00:19 IST|Sakshi
అమ్మా! నీకు వందనం!!

ఆత్మీయం

ఏ బిడ్డకయినా తొలి గురువు తల్లే. అమ్మ ఒడే మొదటి బడి. తల్లే జ్ఞాన తొలి జ్ఞానప్రదాత. అందుకే ఢిల్లీకి రాజయినా తల్లికి కొడుకే అన్నారు. శాస్త్రాలు, పురాణాలూ కూడా తల్లి ఔన్నత్యం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి. అమ్మకి ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణం, పదివేల మార్లు కాశీయాత్ర చేసిన పుణ్యఫలం దక్కుతుందంటుంది శాస్త్రం. ఎన్ని యజ్ఞాలుచేసినా, యాగాలు చేసినా, హోమాలు చేసినా, దేవాలయాలు కట్టిచ్చినా, అన్నదానాలు చేసినా తల్లికి నమస్కారం చేస్తే వచ్చిన ఫలితంతో సమానమా.. అంటే చెప్పడం కష్టం. అమ్మ–త్రిమూర్త్యాత్మక స్వరూపమై తనంతట తానుగా అంత పుణ్యాన్ని ఇవ్వగలదు. అందుకే అమ్మ దేవత. అమ్మ పరబ్రహ్మం. అమ్మ వాక్కు బ్రహ్మ వాక్కు.

అందుకే మాతృదేవోభవ. అయితే కేవలం అమ్మకు నమస్కారం పెట్టి ఊరుకుంటే ఆయా ఫలితాలు రావు. అమ్మకు అన్నం పెట్టాలి. అమ్మను ఆదరించాలి. గౌరవించాలి. అమ్మ చెప్పిన బాటలో నడుచుకోవాలి. ఎందుకంటే ముందుగా తాను నడిచి ఆ బాటలో రాళ్లూ ముళ్లూ లేవని తెలుసుకున్న తర్వాతే తన బిడ్డను ఆ దారిలో నడవమని చెబుతుంది అమ్మ. మానవులందరూ అమ్మ మాట విన్న తర్వాతే మహాత్ములయ్యారు. గాంధీజీ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒకానొకనాడు ఓడలో విదేశాలకు బయల్దేరబోతున్నారు. పరస్త్రీ సంగమం ఎన్నటికీ చేయనని తనకు మాటివ్వమని తల్లి పుత్లీబాయ్‌ అడిగి ప్రమాణం చేయించుకుంది. కొన్నేళ్ళ తరువాత ఒకసారి ఆయన చెయ్యకూడని పొరబాటు చేయడానికి వెళ్ళి అంగుళం దూరంలో ఉన్నప్పుడు అమ్మకిచ్చిన మాట గుర్తొచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయానని ఆయన తన జీవిత చరిత్రలో నిజాయితీగా రాసుకున్నారు.

మరిన్ని వార్తలు