ఆమె ఒక ఆధ్యాత్మిక గీతం

6 Sep, 2016 23:57 IST|Sakshi
మదర్ థెరిసాతో ఉషా ఉత్సప్

సందర్భం

ఉషా ఉతుప్ ఆనందానికి ఇప్పుడు అవధులు లేవు. పాడడం ఈ సుప్రసిద్ధ గాయనికి కొత్త కాదు కానీ, తాజాగా పాడిన పాట, ఆ అనుభవం మాత్రం మునుపెన్నడూ ఇవ్వనంత ఆనందం ఆమెకు ఇచ్చాయి. మొన్న ఆదివారం వాటికన్ సిటీలో జరిగిన ఉత్సవంలో మదర్ థెరిసాను  ‘పునీతురాలు’గా ప్రకటించే కార్యక్రమంలో పాల్గొని, పాట పాడిన ఉషా ఉతుప్ ఆ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోల్‌కతాకు చెందిన ఆమెకు పవిత్ర సేవామూర్తి మదర్ థెరెసాతో దాదాపు అయిదు దశాబ్దాల అనుబంధం. మాటల కోసం వెతుక్కుంటున్న వేళ ఉషా ఉతుప్ గొంతు పెగుల్చుకొని, ఆ మాతృమూర్తితో తన అనుబంధం గురించి చెప్పిన జ్ఞాపకాలు...

 

 ‘‘ఇప్పటికీ ఇదంతా నేను నమ్మలేకపోతున్నా. నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నిజంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. మదర్ థెరెసాతో నాది 47 ఏళ్ళ అనుబంధం. నేను తరచూ మాట్లాడిన వ్యక్తి, కలసి నడిచిన వ్యక్తి, కలసి పనిచేసిన మనిషి, అనుబంధమున్న వ్యక్తికి ఇవాళ ప్రపంచం మొత్తం ముందు ‘మహిమాన్వితురాలు’ హోదా (సెయింట్‌హుడ్) ప్రకటించడం ఆనందంగా ఉంది. అదీ కాకుండా, ఈ ఉత్సవంలో ‘పూరెస్ట్ ఆఫ్ ది పూర్’ అనే పాట పాడడం గాయనిగా నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం. ఆ పాట కూడా నా రచనే! ఇలాంటి రోజు  నాకు మళ్ళీ రాదేమో!

 
తొలిసారి... హోమియో క్లినిక్‌లో..!

మురికివాడల్లోని అభాగ్యులకు నిస్వార్థంగా సేవలందించిన ‘అమ్మ’ థెరెసాతో నేను గడిపిన క్షణాలు నాకు ఇప్పటికీ జ్ఞాపకమే! మొట్టమొదటిసారి నేను ఆమెను కలసినప్పటికి ఆమె ఒక సాధారణమైన నన్. అప్పట్లో నేను ఒక హోమియోపతి క్లినిక్‌కి వెళ్ళేదాన్ని. క్రైస్తవ సన్యాసిని అయిన థెరెసా కూడా అక్కడికి తరచూ వస్తుండేవారు. అక్కడే మా తొలి పరిచయం జరిగింది. అలా జరిగిన మా పరిచయం ఏళ్ళు గడిచేకొద్దీ గాఢమైన స్నేహంగా మారింది. నేను ఆమె ప్రేమను పొందాను. ఆమెతో కలసి నడుస్తూ, నవ్వుతూ, తిరుగుతూ క్షణాలెన్నో!

 
ఆ షరతు పెట్టారు! దాంతో కష్టమైంది!
అప్పట్లో ఆమె నాకు కొన్ని నిర్ణీతమైన పనులు చెప్పేవారు. బీదవారి కోసం ఆహారం, దుస్తులు సేకరించడం నా ప్రధాన బాధ్యత. అయితే, మదర్ ఒక షరతు పెట్టారు. అది ఏమిటంటే, ‘మనం చేస్తున్నది ఏమిటో, ఎవరి కోసం చేస్తున్నామో ఎవరికీ చెప్పకూడదు. ఆర్భాటపు ప్రచారం చేయకూడదు.’ అమ్మ చెప్పినట్లే చేశాను. ఇలా చేయడం వల్ల వాలంటీర్లు చేస్తున్న పనిలోని అసలు సిసలు లక్ష్యం ఏమిటో అర్థం చేసుకుంటారు. మాకు తెలిసినవాళ్ళ దగ్గరి నుంచి, కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సామాన్లు సేకరించాం. ఇలా పాత దుస్తులు, మిగిలిపోయిన ఆహారం సేకరించడం నా గౌరవానికి భంగమని నేనెప్పుడూ అనుకోలేదు. ఆర్తుల కోసం ఇలాంటి పనులెన్నో చేసిన మదర్ ఎప్పుడూ వాటి గురించి గొప్పగా చెప్పుకొనేవారు కాదు. అది నాకు అబ్బురం అనిపించేది.

 
ఒకసారి మాత్రం ‘అమ్మ’ చెప్పిన పని నాకు కష్టమైంది. పెళ్ళి విందుల్లో మిగిలిపోయిన ఆహారం సేకరించి, తెమ్మని చెప్పారు. అయితే, ఎప్పటిలానే - ఎందుకు, ఏమిటన్నది ఎవరికీ చెప్పకూడదు. కొద్దిగా కష్టమనిపించింది. కానీ, ‘బాహాటంగా ప్రకటించి చేసే సేవ ఎప్పటికీ సేవ కానే కాదు’ అని మదర్ అన్న మాటలు నా చెవుల్లో రింగుమన్నాయి. అంతే! ఆ పని చేసేశా!

 
ఆ రెంటి ఖరీదూ ఎక్కువ!
ఒక రోజున ఆమె కలకత్తాలోని నా స్టూడియోకు వస్తున్నారు. దోవలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. అంతే! ఆమె ఉన్నట్టుండి కారు ఆపేసి, కిందకు దిగారు. ఆ మనిషి తాగి ఉన్నాడా, మరొకటా అని కూడా చూసుకోలేదు. ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆ ఘటన కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను.

 
ఆ విశ్వజనని ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు... ‘నాకు డబ్బులు అక్కర్లేదు. ఆర్తుల సేవ కోసం కృతనిశ్చయంతో నిలిచి, సమయం వెచ్చించేవారు కావాలి’. డబ్బులు ఎవరి దగ్గర నుంచైనా సంపాదించవచ్చు. కానీ, సేవా నిబద్ధత, సమయం వెచ్చించే సహృదయం - అంత సులభంగా దొరకవనీ, వాటి ఖరీదు చాలా ఎక్కువనీ ఆమెకు తెలుసు. నా దగ్గర నుంచి ఆమె కోరుకున్నవి కూడా - ఆ నిబద్ధత, సమయమే!

 
అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం అంటే, గతంలో పండిట్ రవిశంకర్, జాకీర్ హుస్సేన్, అమ్జద్ అలీ ఖాన్ లాంటి ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత కళాకారులు పాల్గొన్నారు. సాధారణంగా మన సంస్కృతీ వారసత్వం అంటే భరతనాట్యం, కథకళి లాంటివే గుర్తుకొస్తాయి. కానీ, మన సంస్కృతి అక్కడికే పరిమితం కాదనీ, విశ్వజనీనమైన ప్రేమకు ప్రతిరూపమనీ, ప్రియతమ మదర్‌కు నివాళి ఇచ్చే నా పాట, ఆర్కెస్ట్రా ద్వారా చెప్పేందుకు ప్రయత్నించాను. నిజానికి, భౌతికంగా మన ముందున్న రోజుల్లోనే మదర్ థెరెసా పరమ పావని, మహాత్మురాలు. మూర్తీభవించిన ఆ మానవతా మూర్తికి ఇప్పుడు ఇలా ‘మహిమాన్వితురాలు’ అనే అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వడం కేవలం ఒక లాంఛనం. పవిత్ర చరిత్ర కలిగిన ఆ అమ్మతో నా అనుబంధం నా జీవితాంతం మరపురానిది. ఒక్క మాటలో చెప్పాలంటే, గడచిన శతాబ్దంలో ఆమె లాంటి అత్యంత గొప్ప మనిషినీ, కొన్ని కోట్ల మందిని స్పృశించి, వారి జీవితాలపై ముద్ర వేసిన వ్యక్తినీ మరొకరిని నేను చూడలేదు. ఆమెను చూసినవారెవరైనా సరే నా మాటలతో ఏకీభవిస్తారు. కోల్‌కతాలో మా ఇంటి నుంచి బయట కాలు పెట్టినప్పుడు కొన్నిసార్లు ఆ మాతృమూర్తి నడిచిన దారిలోనే నేనూ నడుస్తున్నాను, ఆమె పీల్చిన గాలే పీలుస్తున్నాను అని గుర్తుకొస్తుంది. అంతే! ఈ జీవితానికి అంతకు మించిన సంతృప్తి ఇంకేం కావాలి!’’

 

చిరిగిన స్వెట్టర్ చెప్పిన సంగతి!
నన్ను కదిలించిన మరో సంఘటన చెప్పి తీరాలి. చాలా ఏళ్ళ క్రితం ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో ‘మదర్’ను కలిశా. ఆమె వేసుకున్న స్వెట్టర్ చిరిగిపోయి, రకరకాల మాసికలు వేసి ఉండడం గమనించాను. నాకెంతో బాధ అనిపించింది. ఆగలేకపోయా. ‘మదర్! కొత్త స్వెట్టర్ వేసుకోవచ్చుగా?’ అని అడిగేశా. దానికి, ఆమె ఇచ్చిన జవాబు ఒకటే - ‘ఉషా! ప్రపంచంలోని బీదలలో కెల్లా కడు బీదవారితో కలసి నేను జీవిస్తున్నా. కొత్తవి వేసుకొని తిరుగుతూ, బీదవారి కోసం జీవితం గడుపుతున్నా అని చెప్పుకుంటే ఎలా?’ అన్నారు. అంతే! నా నోట మాట లేదు. అందరికీ చెప్పడమే కాదు... చెప్పిందే ఆచరణలోనూ చేసే మనిషి మదర్ థెరెసా అని నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది.

మరిన్ని వార్తలు