అమ్మా... అమ్మా... నీ పసివాణ్ణమ్మా...

10 May, 2015 10:25 IST|Sakshi
అమ్మా... అమ్మా... నీ పసివాణ్ణమ్మా...

లిరిక్ మేజిక్ మదర్స్ డే స్పెషల్ 

గుమ్మానికి బొట్టు ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. దండెం మీద నాన్న తువ్వాలు శుభ్రంగా ఆరి గాలికి  మెల్లగా ఊగుతూ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. పెరట్లో రాలిన బాదం ఆకులన్నీ కువ్వగా మూల చేరి, నీడన నులక మంచం, దాని పైన దిండు, ఆ పక్కనే డెబ్బై రెండు పేజీల తాజా తెలుగు వారపత్రిక రెపరెపలాడుతూ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. నూరే రాయి మీద తేమ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. ఆరే వడియాల వాసన సోకుతూ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్టు. క్యారియర్ డబ్బాల హడావిడి బోర్లగింత, తెర్లే పులుసు మీద ఉప్పు జారింత, వంటింటి పొగగొట్టం నల్లటి నిట్టూర్పులు, గడ్డ కట్టిన నెయ్యి సెగ తగిలినంతలోనే పులుముకునే ఎరుపు... ఇవి ఉంటే గనక ఇంట్లో కచ్చితంగా అమ్మ ఉన్నట్టు.

రాత్రిళ్లు లేటుగా వస్తే తలుపు తీసే వాచ్‌మెన్, తప్పు చేస్తూ దొరికిపోతే వెనకేసుకొచ్చే క్లోజ్‌ఫ్రెండ్, ఏ సందర్భంలోనైనా వాదించడానికి సిద్ధంగా ఉండే ప్లీడర్... వీళ్లంతా ఒకరుగా ఉంటే డౌట్ లేదు ఇంట్లో అమ్మ ఉన్నట్టు. ఇంకా చెప్పాలా? ఇంట్లో సంస్కారం ఉంటే అమ్మ ఉన్నట్టు. కళ ఉంటే అమ్మ ఉన్నట్టు. ముసురు ముంచుకొచ్చే వేళ తెల్లటి దీపం వెలిగితే అమ్మ ఉన్నట్టు. అమ్మ ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నట్టుగా తెలియదు. అమ్మ లేనప్పుడే ఇవన్నీ పోయినట్టుగా తెలుస్తుంది. చెట్టంత కొడుకే కావచ్చు... వయసు తిరోగమనం పట్టి పసివాడైపోతాడు. గుప్పిళ్లలో అమ్మ చూపుడువేలి కోసం వెర్రెత్తి పోతాడు.

అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా...

ఉద్యోగం లేదు. అయితే ఏంటట? అమ్మ ఉందిగా. నాన్న తిడతాడు. అయితే ఏమవుతుందట? అమ్మ రహస్యంగా ఒక ముద్ద పెడుతుందిగా. ఖర్చులకు డబ్బుల్లేవు. అమ్మే ఏటీఎం. గర్ల్‌ఫ్రెండ్ దగ్గర దర్జా. అమ్మే బ్రాండ్ అంబాసిడర్. ఏ అమ్మయినా ఏదైనా చదువుతుందో లేదో కాని తన కడుపున పుట్టిన పిల్లలను మాత్రం క్షుణ్ణంగా చదువుతుంది. వాళ్లకేం కావాలో అమ్మకు తెలుసు. వాళ్లకు నొప్పి పుట్టే క్షణాన తన పేగు కదలడం తెలుసు. ఏం కావాలి అమ్మకు? మణులా మాణిక్యాలా? తన పిల్లలు నోటికింత తిని, ఒంటికింత కట్టి సంతోషంగా ఉండటం. అంతే కదా! అందుకే తను వేయి దేవుళ్లకు మొక్కుతుంది. అందుకే తను వేయి కళ్లతో వాళ్లను కాపాడుకుంటుంది. అంతెందుకు... వాళ్ల కోసమే తాను యముడితో పోరాడైనా ఆయుష్షు దక్కించుకుంటుంది.

కాని ఓడిపోతే? బహుశా సంతానానికి ఆయువు పోయడానికే తన ఆయువును త్యాగం చేసిందేమో. అమ్మెందుకు నాన్నా చనిపోయింది? అనడిగితే సరిగ్గా చెప్పవలసిన జవాబు అదే- నీకు ఆయువు పోయడానికే నాన్నా. అందుకే అమ్మ లేదంటే నొప్పిగా ఉంటుంది. గుండె మండినట్టుగా ఉంటుంది. గొంతు చేదుగా మారుతుంది. పగలే దిగులైన నడిరేయి ముసిరింది  కలవరపెడుతోంది పెనుచీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్లిపోయింది

బ్రతికి సుఖమేమిటి...

అంతా అయ్యాక మేల్కొని లాభం లేదు. ముందే అమ్మను చూసుకుని ఉంటే బాగుండేది... ముందే అమ్మను డాక్టర్‌కు చూపించి ఉంటే బాగుండేది... ముందే తనకో మంచి చీర కొనిచ్చి ఉంటే బాగుండేది... ముందే తనతో రెండ్రోజులు గడిపి ఉంటే బాగుండేది.... అనుకొని ఏం ప్రయోజనం! అమ్మ చేజారిపోయాక మణులూ మాణిక్యాలను గుప్పిళ్లతో పట్టుకుని ఏం లాభం! అమ్మ కోరే బ్లాంక్ చెక్ ఏమిటి? ఫోన్ చేసి- అమ్మా... ఎలా ఉన్నావ్ అన్న చిన్న పలకరింపు. అదీ ఇవ్వలేకపోయావా? తను కాల్ చేస్తే ఎత్తలేనంత బతుకు బాదరబందీలో కూరుకుపోయావా?

అయ్యో వెళ్లిపోయావే  నన్నొదిలేసి ఎటు పోయావే....

కాని అమ్మ ఎక్కడకు పోగలదు? కనపడకుండా పోయినా సరే కన్నబిడ్డలను కనిపెట్టుకునే ఉండగలదు. ఏ లోకాన ఉన్నా ఆమె ఆత్మ పరితపించేది వారి కోసమే. పిల్లల కోసం. తనను అమ్మా.. అమ్మా... అని పిలిచిన సంతానం కోసం. తను లేకపోయినా పిలిస్తే పలుకుతుంది. కాకుంటే మనకు వినిపించదు అంతే.విడలేక నిన్ను విడిపోయి ఉన్నా  కలిసే లేనా నీ శ్వాసలోన  మరణాన్ని మరచి జీవించి ఉన్నా

 ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన...

అమ్మ ఉండలేదు. తన పిల్లలను వదిలి ఉండలేదు. వారికి దూరమయ్యి దూరలోకాల్లో అయినా సరే మనలేదు. అందుకే పరిగెత్తుకుని వచ్చేస్తుంది. తను కన్న సంతానం కడుపులో తిరిగి అమ్మైపుడుతుంది. అమ్మ రుణం తీర్చుకోగలిగాము అనేది పిచ్చిమాట. అమ్మ రుణం తీరదు. దోసిళ్లలోని మట్టితో నది నీరు ఎండదు.కలతను రానీకు కన్నంచున  కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన
 
చిగురై నిను చేరనా ...
 
అమ్మ పాటలు చాలా వచ్చాయి. కాని అమ్మ కోసం కొడుకు, కొడుకు కోసం అమ్మ తమ పాశాన్ని వ్యక్తం చేసిన ఇటీవలి పాట ఇది. తెలుగువారు ఇటువంటి సెంటిమెంట్లకు నవ్విపోయే స్థితిలో ఉన్నారు. తమిళలు ఇంకా తమ సున్నితత్వాన్ని కోల్పోకుండా ఉన్నారు. అందుకు అమ్మ మోములాంటి ఈ అందమైన పాటే తార్కాణం.
 
 చిత్రం: రఘువరన్  (2015); రచన: రామజోగయ్యశాస్త్రి
 సంగీతం: అనిరుధ్ రవిచందర్; గానం: ఎస్.జానకి, దీపు
 

మరిన్ని వార్తలు