తరచూ మోషన్స్, కడుపునొప్పి... తగ్గేదెలా?

25 Jul, 2013 05:11 IST|Sakshi
 మా పాపకు 11 ఏళ్లు. ఆమెకు ఇటీవల తరచూ కడుపునొప్పితో పాటు రోజుకు రెండు, మూడు సార్లు విరేచనాలు కూడా అవుతున్నాయి. ఈ మధ్యకాలంలోనే 4, 5 సందర్భాల్లో ఇది మాటిమాటికీ పునరావృతం అవుతున్నట్లుగా అనిపించింది. ఇక కొన్ని సందర్భాల్లో ఏదైనా తిన్న తర్వాత వెంటనే మోషన్‌కు వెళ్తోంది. అలా వెళ్లాక అంతా బాగా ఉంటుందని చెబుతోంది. ఇది మినహా ఆమెకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలేమీ ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. డాక్టరుకు చూపించాం. మందులు వాడిన కొద్దిరోజులు ఏమీ కనిపించడం లేదు. కానీ ఇలా ప్రతిసారీ కడుపులోనొప్పి ఎందుకు వస్తోంది? ఇది ఏమైనా పెద్ద సమస్యలకు సూచనా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి.
 - ప్రసన్న, తుని
 
 మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ అమ్మాయికి రికరెంట్ డయేరియా (మాటిమాటికీ తిరగబెడుతున్న విరేచనాలు)గా అనిపిస్తోంది. కానీ ఇది మినహా మీరు ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నట్లుగా చెప్పడం లేదు. కాబట్టి కనిపిస్తున్న లక్షణాలను బట్టి చూస్తుంటే ఇది ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ కావడానికి అవకాశాలు ఎక్కువ అని  ఆలోచించాల్సి ఉంటుంది. 
 
 ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే ఈ డిసార్డర్ ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండానే వస్తూ, తరచూ దానితో పాటు కడుపునొప్పి, మారిపోతూ ఉండే విసర్జక సమయాలు, విసర్జక అలవాట్లతో కనిపిస్తుంటుంది. ఇలాంటి లక్షణాలు వరసగా రెండు మూడు రోజుల పాటు కనిపిస్తూ... అవి కనీసం 3, 4 నెలల్లో తిరగబెడుతూ ఉంటాయి. ఐబీఎస్ అనే ఈ కండిషన్ మన జనాభాలో 10% నుంచి 20% మందిలో ఉండేదే. ప్రధానంగా అమ్మాయిల్లో కాస్త ఎక్కువ. మీరు చెప్పినట్లుగానే ఒకసారి విరేచనానికి వెళ్లి వచ్చాక అంతా చక్కబడ్డట్లుగా ఉంటుంది. ఇది ఒక ఫంక్షనల్ బవెల్ డిజార్డర్. అంటే మన విసర్జక విధుల్లో మార్పులు కనిపించేలా చేసే రుగ్మత అన్నమాట. ముఖ్యంగా బాగా ఒత్తిడిగా ఫీలవుతున్నప్పుడు, ఉద్వేగాలకు లోనైనప్పుడు, కొన్ని సందర్భాల్లో కడుపునకు సంబంధించిన ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా సమస్యకు మందులు తీసుకుని అది తగ్గిపోయాక కడుపునొప్పి, మల విసర్జన వేళలు మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. 
 
 మీరు చెబుతున్న లక్షణాలు కనిపించినప్పుడు ఇతర కారణాలు... అంటే తిన్న ఆహారం సరిగా ఒంటికి పట్టకపోవడం (మాల్ అబ్‌సార్‌ప్షన్), ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాధినిరోధక (ఇమ్యూనలాజికల్) సమస్యలు, ఎండోక్రైన్ వ్యవస్థలో ఏవైనా సమస్యలు, ప్యాంక్రియాటిక్, కడుపునకు సంబంధించిన అనటామికల్ సమస్యలు, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిజార్డర్ వంటివి ఏవైనా ఉన్నాయా లేక  యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య వచ్చి ఉంటుందా అన్న కోణం నుంచి కూడా పరీక్షించి, అవేవీ కారణం కాదని నిర్ధారణ (రూల్ అవుట్) చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. 
 
 కొన్నిసార్లు పిల్లల్లో కొన్ని ఏకకణపరాన్నజీవుల (ప్రోటోజోవా) ఇన్ఫెక్షన్స్ వల్ల, విటమిన్ లోపాలు (ప్రధానంగా విటమిన్ బి12), కొన్ని మినరల్‌లోపాలు (జింక్) వంటి వాటి వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.  మీ పాప విషయంలో జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్స్ వంటి సూచనలు ఏమీ లేవు కాబట్టి ఇదమిత్థంగా ఇదే సమస్య అని నిర్ధారణ చేయడానికి కొన్ని బేసిక్ రక్త పరీక్షలు, విపులమైన మల పరీక్ష (డీటెయిల్‌డ్ స్టూల్ ఇవాల్యుయేషన్)తో పాటు అవసరాన్ని బట్టి సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షల ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. 
 
 ఇక వైద్యచికిత్స విషయానికి వస్తే ఐబీఎస్ అన్నది కొద్దిమేర మానసిక సమస్యతోనూ ముడిపడి ఉంటుంది కాబట్టి నొప్పి తగ్గడానికి వీలుగా నొప్పినివారణ మందులు, యాంటీ స్పాస్మోడిక్, యాంటీమొటిలిటీ మందులతో పాటు కొన్నిసార్లు యాంటీ డిప్రెసెంట్ మందులు కూడా వాడాల్సి ఉంటుంది. దాంతోపాటు బిహేవియరల్ థెరపీ వల్ల తప్పక ఉపయోగం ఉంటుంది. అలాగే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, కొద్దిమేర కొవ్వు పదార్థాలు తగ్గించడం, వీలైనంతగా కాఫీ, టీలను తీసుకోకపోవడం  అవసరం. మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడితో పాటు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. 
 
Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు