వెక్కి వెక్కి ఏడ్చాను.. కానీ

11 Dec, 2019 00:15 IST|Sakshi

‘శారీరక వైకల్యం శాపం అనుకుంటారు. నిజానికి.. వికలాంగులను చూసి నానా మాటలూ అనే మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం’ అంటారు అంతర్జాతీయ మోటివేషనల్‌ స్పీకర్‌ డాక్టర్‌ మాళవిక అయ్యర్‌. అంతేకాదు, అలా మాట్లాడేవాళ్లకు తన ప్రసంగాలను లేపనంగా రాస్తున్నారు! తమిళనాడుకు చెందిన మాళవిక.

పదమూడేళ్ల వయస్సులోనే అర చేతులు కోల్పోయినప్పటికీ ధైర్యంతో ముందుకు సాగి గొప్ప వక్తగా ఎదిగారు. సామాజిక శాస్త్రంలో డాక్టరేట్‌ పొంది దివ్యాంగులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇటీవల ‘వరల్డ్‌ డిజెబిలిటీ డే’ సందర్భంగా శారీరక వైకల్యం ఉన్న వారి పట్ల సమాజం అనుసరించాల్సిన తీరు గురించి సోషల్‌ మీడియాలో హృదయానికి హత్తుకునేలా ప్రసంగించారు. ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలివి.

వెక్కి వెక్కి ఏడ్చాను
‘‘ఇది పదిహేడేళ్ల క్రితం నాటి మాట. నా రెండు చేతులు రక్తపు మడుగులో మునిగిపోయినపుడు నేను అంతగా ఏడ్వలేదు. డాక్టర్లు నా చేతుల్లో ఇనుప రాడ్లు వేసినపుడు కూడా ఎక్కువ బాధ పడలేదు. కానీ ఆస్పత్రి బెడ్‌ మీద ఉన్నపుడు నా పక్కనున్న ఆడవాళ్లు మాట్లాడిన మాటలు విని వెక్కివెక్కి ఏడ్చాను. ‘జనరల్‌ వార్డులో కొత్త అమ్మాయి చేరిందట. తను నిజంగా శాపగ్రస్తురాలే. ఇక తన జీవితం ముగిసిపోయినట్లే’ అంటూ నా గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు.

అప్పుడే మొదటిసారిగా నా కళ్ల నుంచి ధారాపాతంగా కన్నీళ్లు కారాయి. గ్రెనేడ్‌ పేలుడులో అర చేతులు కోల్పోయిన నాకు భవిష్యత్తే లేదన్నట్లుగా వారు మాట్లాడారు. ఆ మాటలను అంగీకరించడానికి నా హృదయం అప్పుడు సిద్ధంగానే ఉంది. అయితే నా కుటుంబం, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం నాలో కొత్త ఉత్సాహం నింపింది. వారి చొరవతోనే నేనింత వరకు రాగలిగాను. నిజానికి దివ్యాంగుల పట్ల సమాజం స్పందించే తీరు సరిగా లేదు. ప్రతి ఒక్కరికీ అటిట్యూడ్‌ ప్రాబ్లం ఉంటుంది’’ అని మాళవిక అన్నారు.

నిరాశ పరచకూడదు
‘‘నిజానికి మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం. ఎదుటివారిని ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు కానీ నిరాశ చెందేలా మాట్లాడకూడదు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 26.8  కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరిది 2.21 శాతం. ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి వంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడే ముందు ప్రతీ ఒక్కరు దివ్యాంగుల పట్ల తాము ప్రవర్తిస్తున్న తీరు గురించి ఆలోచించుకోవాలి.

వారిని సమాజంలో మమేకం చేసి.. ఉద్యోగ భద్రత కల్పించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలి. శారీరక వైకల్యం ఉంటే ఇక జీవితం ముగిసినట్లే అనే మాటలు మానుకోవాలి. దివ్యాంగులనంతా ఒక్కచోట చేర్చడం కాదు.. వారికి ఏమేం అవసరమో గుర్తించి... వాటిని సమకూర్చాలి. అలా చేసినపుడే సమాజంతో వారు కలిసిపోగలుగుతారు. లేదంటే ఆత్మన్యూనతాభావంతో కుంగిపోతారు. అందుకే బాల్యం నుంచే ప్రతి ఒక్కరు వివక్ష లేకుండా పెరిగే వాతావరణం కల్పించాలి’’ అని మాళవిక అన్నారు.

‘చారిటీ’ వస్తువులు కారు
‘‘విద్యావిధానంలోనూ మార్పులు రావాలి. శారీరక వైకల్యం ఉన్న వారిని చారిటీ వస్తువులుగా చూపకుండా... దివ్యాంగులైనప్పటికీ సమాజంలో ఉన్నత స్థితికి చేరిన వారి గురించి పాఠ్యాంశంలో బోధించాలి. ఒకరిపై ఆధారపడకుండా.. సొంతంగా తమ పనులు తాము చేసుకునేలా తీర్చిదిద్దాలి. సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సాహం అందించాలి. సానుకూల దృక్పథం నెలకొనేలా సినిమాలు నిర్మించాలి. చేతులు, కాళ్లు లేకుంటే పెళ్లి కాదు.

ఇక జీవితమే ఉండదు అనే పిచ్చి నమ్మకాలను తొలగించాలి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న దివ్యాంగులకు సమాజం పట్ల, తమ సమస్యల పట్ల ఒక అవగాహన ఏర్పడింది. తమ హక్కులకై గళాన్ని గట్టిగా వినిపించగలుగుతున్నారు. అయితే వారికి ప్రజాప్రతినిధుల, రాజకీయ నాయకుల అవసరం ఎంతగానో ఉంది. దివ్యాంగులను సమాజం నిండు మనస్సుతో ఆలింగనం చేసుకోవాలనేదే నా కల. ఆ దిశగా వడివడిగా అడుగులు పడాలి’’ అని మాళవిక ఆకాంక్షించారు.

గ్రనేడ్‌ పేలడంతో..!
మాళవిక అయ్యర్‌ తమిళనాడులోని కుంభకోణంలో క్రిష్ణన్‌– హేమా క్రిష్ణన్‌ దంపతులకు జన్మించారు. తండ్రి వాటర్‌ వర్క్స్‌లో ఇంజనీరుగా పనిచేసిన క్రమంలో ఆమె బాల్యం రాజస్తాన్‌లోని బికనీర్‌లో గడిచింది. అక్కడ ఉన్నపుడే ఓ రోజు తమ గ్యారేజీలో ఆడుకుంటున్న సమయంలో గ్రనేడ్‌ చేతుల్లో పేలి రెండు అరచేతులు పోయాయి. ఆ తర్వాత ఆమెను చెన్నైలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్క్రైబ్‌ సహాయంతో పరీక్షలు రాస్తూ మాళవిక తన విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు(ప్రైవేటు పరీక్ష) సంపాదించి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ప్రశంసలు పొందారు.

అనంతరం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి చేరుకున్న మాళవిక... ఎకనమిక్స్‌ హానర్స్‌ చదివారు. సోషల్‌ వర్క్‌లో ï డాక్టరేట్‌ సంపాదించారు. 2013 నుంచి మోటివేషనల్‌ స్పీకర్‌గా మారి ఎంతోమందిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. వివిధ దేశాల్లో ప్రసంగాలు చేసిన మాళవిక.. సమాజ తీరు, మహిళలు, దివ్యాంగులపై వివక్ష వంటి అంశాలపై ఐరాసలోనూ తన గళాన్ని వినిపించారు. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా అత్యున్నత మహిళా పురస్కారం నారీ శక్తి పురస్కార్‌తో సత్కరించింది.

– సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌ డెస్క్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా