ఉక్కపోత

5 Jun, 2017 00:14 IST|Sakshi
ఉక్కపోత

సమ్‌సారం
సంసారంలో సినిమా


కొత్త క్యాలెండర్‌ వచ్చిన మూడో నెలలో ఉగాది పండగొచ్చింది, పిల్లలకు పరీక్షలూ వచ్చాయి. నాలుగో నెలలో శ్రీరామనవమి వచ్చింది, పానకంతోపాటు ఎండలొచ్చాయి. వేసవి సెలవులూ వచ్చేశాయి. ‘‘చింటూ! ఇంకా బ్రష్‌ చేయలేదా? త్వరగా బ్రష్‌ చేసి పాలు తాగు’’ అంటూ పాలగ్లాసు టేబుల్‌ మీద పెట్టింది గాయత్రి. క్యాలెండర్‌లో హాలిడేస్‌ మొదలైన రోజును మార్క్‌ చేశాడు చింటూ. వెంటనే మరో రెండు పేజీలు తిప్పి... జూన్‌లో స్కూల్‌ రీ ఓపెన్‌ అయ్యే రోజును మార్క్‌ చేశాడు.‘‘నాన్నా! ఈ రోజులన్నీ సన్‌డేలేనా... స్కూల్‌కి వెళ్లడమే ఉండదా నిజంగా’’ క్యాలెండర్‌లో ఏప్రిల్, మే నెల పేజీలను చూపిస్తూ సందేహంగా అడిగాడు.

మా వాడి భాషలో సన్‌డే అంటే సెలవు. వాడి యుకెజి బుర్రకు స్కూలుకెళ్లని రోజులన్నీ ఆదివారాలే. ‘‘అన్నీ సన్‌డేలు కాదు. కానీ హాలిడేసే కన్నా’’ అని ఇంకా వివరించబోయా.ఇంక చాల్లే అన్నట్లు అడ్డుపడి ‘‘హాలిడేస్‌కు ఎక్కడికెళ్దాం నాన్నా’’హాలిడే – పదాన్ని చటుక్కున క్యాచ్‌ చేశాడు మా హీరో... ఎంత షార్పో... నేనింకా మురిపెంలోనే ఉన్నా. చింటూ నా వీపు మీదెక్కి... చేతులు మెడలో వేసి ఊగుతూ ‘‘హాలిడేస్‌ ఎక్కడికెళ్దాం’’ అని గదిమాడు. ఈ సారి నాన్నా అనే సంబోధన మిస్సింగ్‌.‘ఊటీకెళ్దామా’’ అని ఊరించాను... నా డ్రామా అంతా చింటూ దగ్గర వేస్తున్నాను కానీ అసలు స్కెచ్‌ కిచెన్‌లో ఉన్న గాయత్రి కోసమే.‘‘చింటూ! పాలు తాగనే లేదా? మీరు వాడి చేత బ్రష్‌ చేయించకుండా ఆటలాడుతున్నారా?’’ ఫ్రిజ్‌లో కూరగాయలు తీసుకోవడానికి వచ్చిన గాయత్రి కరిచినట్లు అరిచింది. ఏకకాలంలో ఇద్దరికీ డోస్‌.‘ఊటీ’ ఊరింపు తను విన్నదా లేదా? రిపీట్‌ చేయాలా వద్దా?

‘‘బ్రష్‌ చేద్దువురా’’ చింటూ ఎత్తుకుని సింక్‌ దగ్గర స్టూల్‌ మీద నిలబెట్టాను. వాడు బ్రష్‌ మీద పేస్టును పిండబోతుంటే లాక్కుని కొద్దిగా వేసిచ్చి ట్యూబ్‌ను వాడికందకుండా పైన పెట్టాను.‘‘ఊటీకి ట్రైన్‌లో వెళ్దామా, ఫ్లయిట్‌లో వెళ్దామా నాన్నా’’ ఊటీలో విహరిస్తున్నాడు చింటూ. ‘‘ఊటీకి ఫ్లయిటెళ్లదు. రైల్లో పోదాం’’ హమ్మయ్య జాగ్రత్తగానే మాట్లాడాను. ఫ్లయిట్‌లో చాలా డబ్బులవుతాయని నాలుక దాకా వచ్చిన మాటను లౌక్యంగా మార్చేశాను. నా భుజాన్ని నేనే తట్టుకున్నాను గాయత్రి కంటపడకుండా.‘‘ఫ్లయిట్‌ వెళ్లే ఊర్లకేమైనా ఫ్లయిట్‌లో తీసుకెళ్లారా? ట్రైన్‌లో స్లీపర్‌ తప్ప. అయినా ఎప్పుడెళ్తాం? మనకు టూర్‌ ఊటీ అయితే... మండపేటలో ఉన్న మీ కజిన్‌కి, పిల్లలకు మనూరే టూరిస్ట్‌ ప్లేస్‌ కదా’’ పెనం మీద దోశె పోస్తూ అంది గాయత్రి. మధ్యలో వినిపించిన చిటపటలు దోశెపెనానివా? గాయత్రివా? అంతా ఫాలో అవుతూనే ఉందన్నమాట. తెలివిగా టాపిక్‌ మార్చాలి.
∙ ∙  
సాయంత్రం ఆఫీస్‌ నుంచి వచ్చాను. పిన్ని కూతురు పద్మ, బావ, వాళ్ల పిల్లలు నిన్ననే వచ్చారు. బహుశా వాళ్లు బయటికెళ్లారేమో! ఇంట్లో సందడి తక్కువగా ఉంది, రిఫ్రెష్‌ అయ్యి టీవీ ముందు కూర్చున్నాను. యానిమల్‌ ప్లానెట్‌ నుంచి బయటకు వచ్చి మనుషుల ముఖాలు చూద్దామని రిమోట్‌ అందుకున్నాను. ఎంతకీ చానల్‌ మారట్లేదు. బ్యాటరీ వీక్‌ అయిందేమోనని రిమోట్‌ని టీవీ ముఖం మీద పెట్టి నొక్కాను. సెట్‌టాప్‌ బాక్స్‌ ఎదురుగా వెళ్లి నొక్కాను. ఉహూ... చానల్‌ మారట్లేదు.  పద్మ పిల్లలే ఏదో చేసి ఉంటారు. చానల్‌ మార్చడానికి కుదరని టెక్నాలజీ మా టీవీలో ఉన్నట్లు నాకే తెలీదు. ఈ పిడుగులకెలా తెలిసిందో. రిమోట్‌తో లాభం లేదనుకుని టీవీ దగ్గరకెళ్లాను. ఆల్రెడీ చైల్డ్‌లాక్‌లో ఉంది. ఏ బటన్‌ నొక్కినా టీవీ స్పందించడం లేదు.

ఇక నాకు రిమోటే గతి. ఫ్లాష్‌లాంటి ఐడియా... ఎన్నిసార్లు టార్చ్‌లైట్‌లో బ్యాటరీలను నేలకేసి రుద్ది వెలిగించలేదు. టీవీని పలికించలేనా... నా తెలివికి నాకే ముచ్చటేసింది. నా టాలెంట్‌ గుర్తించి ఎవరూ దేశానికి ఆర్థిక మంత్రిని చేయడం లేదు. కానీ లేకపోతేనా... అమెరికాకి అప్పిచ్చే స్థాయికి తీసుకురానూ... నాలో ఉన్న నా మనిషి నన్ను మెచ్చుకుంటూ ఉంటే... నేను పెదవుల మీద చిరునవ్వును ధైర్యంగా ప్రకటిస్తూ రిమోట్‌ ఓపెన్‌ చేశాను. మైగాడ్‌... బ్యాటరీలే లేవు.నా రాక గమనించి శ్రీమతి టీ తెచ్చి టీపాయ్‌ మీద ఠంగున పెట్టింది. ‘‘బ్యాటరీల్లేవేంటి గాయత్రీ...’’ నా మాట పెదవి దాటే లోపు గాయత్రి వచ్చినంత వేగంగా కిచెన్‌లోకి వెళ్లిపోయింది. బంధువులు వచ్చి పని ఎక్కువైందేమో కోపంగా ఉన్నట్లుంది. మంచివాడిని కాబట్టి ఆ ‘ఠంగు’కు నేనే ఓ భాష్యం చెప్పుకున్నా.

చింటూ పరుగెత్తుకొచ్చాడు. ఏదైనా మ్యాటర్‌ రాబట్టాలంటే వాడిని ఒళ్లో కూర్చోబెట్టుకోవాలి. వాడు చెప్పే కబుర్లు వినాలి. మాటల్లో మాటగా అడగాలి, తప్ప నేరుగా అడిగితే సూటిగా చెప్పడు.‘‘బిట్టూ, బన్నీలతో బాగా ఆడుకున్నావా?’’‘‘స్నేక్స్‌ అండ్‌ లాడర్స్‌ ఆడుకున్నాం. ఈవెనింగ్‌ అత్త, మామయ్య, బిట్టూ, బన్నీ శిల్పారామానికెళ్లారు నాన్నా. నేను ఆల్రెడీ చూసేశాగా. రేపు వాళ్లతో లుంబినీ పార్క్‌కెళ్తా’’ అన్నాడు సెల్‌ఫోన్‌ కోసం నా జేబులో చెయ్యి పెడుతూ. ‘‘రిమోట్‌లో బ్యాటరీలు ఏమయ్యాయి నాన్నా’’ అన్నాను ముద్దుముద్దుగా.‘‘మరి... ఏసీ రిమోట్‌లో బ్యాటరీలు పోయాయి. అందుకే అమ్మ టీవీ రిమోట్‌ బ్యాటరీలు వేసింది’’ అప్పటికే ఫోన్‌ లాక్కుని యాంగ్రీబర్డ్‌ గేమ్‌ స్టార్ట్‌ చేశాడు చింటూ.గాయత్రి టీ కప్పు టీ పాయ్‌ మీద పెట్టేటప్పుడు అంతగా ‘ఠంగు’మనడం ఎందుకో ఇప్పుడర్థమైంది.
∙ ∙  
‘‘బావా! మీరున్న వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. మళ్లీ ఎప్పుడొస్తారు హైదరాబాద్‌కి’’ ముందుగదిలో ఉన్న వాళ్ల సామాను కారిడార్‌లో పెడుతూ అప్యాయంగా అన్నాను.‘‘ఇక ఇప్పట్లో హైదరాబాద్‌ రావాల్సిన పనేమీ లేదులే అన్నయ్యా... అన్నీ చూసేశాంగా’’ అన్నది పద్మ మా ఆవిడ బొట్టు పెట్టి ఇచ్చిన చీరను బ్యాగ్‌లో పెట్టుకుంటూ.‘‘వదినా! చింటూకి సెలవులిచ్చినప్పుడు మా ఊరికి రండి. అన్నయ్యకు ఆఫీసు సెలవు కుదరకపోతే నువ్వు రైలెక్కి ఫోన్‌ చెయ్యి మేము రిసీవ్‌ చేసుకుంటాం’’ భారీ ఆఫర్‌ ఇచ్చేసింది. కానీ... ఎక్కడో ఏదో కొడుతోంది. పద్మ  కొన్ని పదాలు ఒత్తి పలుకుతోంది. మాటల్లో శ్లేష ఉందా?బావ వైపు వెర్రి నవ్వుతో చూసి వెంటనే గాయత్రిని చూశాను. వాళ్ల అమ్మానాన్న తనకు గాయత్రి అనే పవర్‌ఫుల్‌ పేరు ఎందుకు పెట్టారో గానీ ఆ చూపులకు శక్తి ఉంటే నేను మాడిపోయేవాడిని.

చింటూ నిద్రలేవగానే వచ్చి ఒళ్లో కూర్చున్నాడు. నా చేతిలో ఉన్న పేపర్‌లో ట్రావెల్‌ యాడ్‌ దగ్గర వాడి కళ్లు ఆగిపోయాయి. ‘‘నాన్నా ఊటీకెళ్దామన్నావ్‌గా... ఎప్పుడెళ్దాం?’’‘‘చింటూ! బ్రష్‌ చేసిరా’’ గాయత్రి గొంతులో తల్లి ప్రేమ వినిపించలేదు.ఆ సంగతి చింటూకీ అర్థమైంది. కామ్‌గా వెళ్లి బ్రష్‌ అందుకున్నాడు. వాడి బ్రష్‌ మీద పేస్టు వేస్తూ ‘నెక్ట్స్‌ మంత్‌ వెళ్దాంలే’’ అన్నాను.‘‘పోనీ... పెద్దనాన్న వాళ్లను రమ్మను నాన్నా. అక్క, అన్నయ్యతో ఆడుకోవచ్చు’’ అన్నాడు. పాపం ఒక్కడికీ బోర్‌ కొడుతున్నట్లుంది.గాయత్రి ఎప్పుడు వచ్చిందో తెలియదు.చింటూ చేతిలో బ్రష్‌ తీసుకుని తానే వాడి పళ్లు తోముతూ ‘‘కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఇంటికి వచ్చిన చెల్లెలు, బావ, పిల్లలు ఏసీ వేసుకుంటే కరెంటు బిల్లు పెరుగుతుందని లెక్కలేసే వాళ్లకు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఎందుకు? ఈ దరిద్రపు తెలివితేటలు ప్రొఫెషన్‌లో చూపిస్తే ఎన్ని ప్రమోషన్‌లు వచ్చేవో’’ అంటూ ‘‘చింటూ! సరిగ్గా పుక్కిలించు’’ అని విసవిసా వాడి నోట్లో నీళ్లు పోసింది. గాయత్రి బాడీ లాంగ్వేజ్‌లో ఎక్కడో తేడా. ఏసీ రిమోట్‌లో బ్యాటరీలు దాచేశానని కన్‌ఫర్మ్‌ చేసుకున్నట్లుంది. ఇంట్లో ఈ ఉక్కపోత తగ్గేదెప్పటికో?!.

పండ్ల బుట్ట ఇక్కడే ఉంచు!
లక్ష్మీపతి ( )కి వెంకట్రావు (సుత్తి వీరభద్రరావు) బావమరిది. లక్ష్మీపతి పరమ పిసినారి. అక్క, బావలను చూద్దామని వస్తూ పండ్లు తెస్తాడు వెంకట్రావు. లక్ష్మీపతి ‘ఈ పండ్లన్నీ మాకే... నీ చాదస్తం... మీ ఇల్లూ మా ఇల్లూ ఒక్కటి కాదేమిటి... అంటూ బుట్ట లాగేసుకుంటాడు లక్ష్మీపతి. లక్ష్మీపతి భార్య కాఫీ తీసుకొస్తానంటూ ఇంట్లోకి వెళ్లబోతుంటే.. ‘ఎండలు మండిపోతుంటే కాఫీ అంటావేంటే? చల్లటి మంచి నీళ్లు తీసుకురా’ అంటాడు.అందరూ మాటల్లో ఉండగా... ‘అరగంట్లో వడ్డించేస్తాను’ అంటుంది లక్ష్మీపతి భార్య తమ్ముడితో. ‘ఇదిగో! తీరిగ్గా విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తూ ఉంటే అవతల బస్సులు మన కోసం కూర్చోవ్‌. ఐదు నిమిషాలకు ఆఖరి బస్సుంది’ అని, ఏదో చెప్పబోతున్న భార్య నోరు మూసేస్తాడు లక్ష్మీపతి. ‘‘ఇందిగో వెంకట్రావ్‌. తర్వాత స్టాపులో చంద్రభవన్‌ అని హోటల్‌ ఉంది. అక్కడ నా పేరు చెప్పి స్పెషల్‌ భోజనం చేసి, ఏడో ఎనిమిదో  ఇచ్చేయ్‌. టైమవుతోంది బయలుదేరు’’ అంటూ సూట్‌కేసు తీసి వెంకట్రావుకిస్తాడు లక్ష్మీపతి ‘అహనా పెళ్లంట’ చిత్రంలో.

పండ్ల బుట్ట ఇక్కడే ఉంచు!
లక్ష్మీపతి (కోట శ్రీనివాసరావు)కి వెంకట్రావు (సుత్తి వీరభద్రరావు) బావమరిది. లక్ష్మీపతి పరమ పిసినారి. అక్క, బావలను చూద్దామని వస్తూ పండ్లు తెస్తాడు వెంకట్రావు. లక్ష్మీపతి ‘ఈ పండ్లన్నీ మాకే... నీ చాదస్తం... మీ ఇల్లూ మా ఇల్లూ ఒక్కటి కాదేమిటి... అంటూ బుట్ట లాగేసుకుంటాడు లక్ష్మీపతి. లక్ష్మీపతి భార్య కాఫీ తీసుకొస్తానంటూ ఇంట్లోకి వెళ్లబోతుంటే.. ‘ఎండలు మండిపోతుంటే కాఫీ అంటావేంటే? చల్లటి మంచి నీళ్లు తీసుకురా’ అంటాడు.అందరూ మాటల్లో ఉండగా... ‘అరగంట్లో వడ్డించేస్తాను’ అంటుంది లక్ష్మీపతి భార్య తమ్ముడితో. ‘ఇదిగో! తీరిగ్గా విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తూ ఉంటే అవతల బస్సులు మన కోసం కూర్చోవ్‌. ఐదు నిమిషాలకు ఆఖరి బస్సుంది’ అని, ఏదో చెప్పబోతున్న భార్య నోరు మూసేస్తాడు లక్ష్మీపతి. ‘‘ఇందిగో వెంకట్రావ్‌. తర్వాత స్టాపులో చంద్రభవన్‌ అని హోటల్‌ ఉంది. అక్కడ నా పేరు చెప్పి స్పెషల్‌ భోజనం చేసి, ఏడో ఎనిమిదో  ఇచ్చేయ్‌. టైమవుతోంది బయలుదేరు’’ అంటూ సూట్‌కేసు తీసి వెంకట్రావుకిస్తాడు లక్ష్మీపతి ‘అహనా పెళ్లంట’ చిత్రంలో.
– మంజీర

మరిన్ని వార్తలు