చీకటినీడలు

6 Sep, 2015 00:19 IST|Sakshi
చీకటినీడలు

ఈ ప్రపంచంలో కాంతినిచ్చేది ప్రేమ. చీకటిని తొలగించేది త్యాగం. నీడగా నిలబడేది బంధం.
కాంతి లేనప్పుడు చీకటి కనబడుతుంది. కాంతి ఉన్నప్పుడు నీడ కనబడుతుంది.  
కానీ చీకటిలో కూడా నీడ ఉంటుంది అంటే నమ్ముతారా?
కనబడదు కాబట్టి నమ్మరా?!
అజ్ఞాతం అనే నీడలో ఉన్నంత వెలుగు
కోటి దీపాల్లో కూడా ఉండదని ఈ సినిమా చెబుతుంది.
వెలుగు కిందైనా కనబడతానని నీడకు స్వార్థం ఉండొచ్చు.
కానీ చీకటి పక్కన నీడ కనపడాలని అనుకోదు.
నీడ అనే కుంచెతో త్యాగమన్న చీకటిని వెలుగులా చిత్రీకరించారు.
వెలుగుల కన్నీటితో కడిగే ఈ జీవనజ్యోతిని మళ్లీ చూడాలి.


మానసిక చికిత్సాలయం.
ఆ ఆలయంలో ఉంది వాణిశ్రీ. బిడ్డను పోగొట్టుకుని మతి స్థిమితం తప్పిన అమ్మ ఆమె. సొంత బిడ్డ కాకపోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువే. ఇరవై ఏళ్లుగా ఆ బిడ్డను మరువలేక, బిడ్డ ఇంకా బతికే ఉన్నాడన్న భ్రమలో ఉంది. దోసిళ్లలోని బొమ్మ బిడ్డను కనురెప్పల్లో పెట్టుకుని క్షణక్షణం మురిసిపోతోంది.
చిన్న చప్పుడైంది. ‘ష్... ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు..’ అంది ఆ అమ్మ.
శోభన్‌బాబు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమెకు పండ్లూ ఫలాలు ఇచ్చాడు. బొమ్మలూ ఇచ్చాడు. అవీ ఆమె కోసమే. బిడ్డ ఉన్నాడు అనుకుంటున్న భార్య కోసం ఆ బొమ్మలు తెచ్చాడు.  ఈ భార్యాభర్తలు... చెట్టంత బిడ్డలు ఉండవలసిన వయసులో ఉన్నవారు.
వాణిశ్రీ బిడ్డ కోసం బతుకుతుంటే, శోభన్‌బాబు వాణిశ్రీ కోసం బతుకుతున్నాడు.
‘అవునూ మీరెవరు? రోజూ నాకు పలహారాలు, బాబుకు బొమ్మలు తెస్తారు! నేను మీకేమౌతాను?’ అంది వాణిశ్రీ. శోభన్‌బాబు ఆవేదనగా నవ్వాడు.
‘నువ్వా? నాకా? హు... గుడికి దీపం ఏమౌతుంది? దీపానికి వెలుగు ఏమౌతుంది? అదే నువ్వూ నాకు అవుతావు’ అన్నాడు. ఆమెకేం అర్థం కాలేదు. ‘పిల్లాడి’ ధ్యాసలో పడిపోయింది.
   
అమెరికా వెళ్లేందుకు సిద్ధమౌతోంది శోభ. శోభ అంటే చిన్న వాణిశ్రీ. మతిస్థిమితం తప్పిన పెద్ద వాణిశ్రీ కూతురు ఆమె. ఆ విషయం ఆమెకు తెలీదు. తను  బాబాయి అనుకుంటున్న శోభన్‌బాబే తన తండ్రి అని కూడా ఆమె తెలీదు. పైగా ఆయనంటే అయిష్టం.  
చిన్న వాణిశ్రీకి ఓ కొడుకు. వాడంటే ఆమెకు పంచప్రాణాలు. వాణ్ణి విడిచి క్షణం కూడా ఉండలేదు.
‘అన్నట్లు అమెరికా వెళ్లే ముందు ఒకసారి వాసు (సత్యనారాయణ తమ్ముడు శోభన్‌బాబు) దగ్గరికి వెళ్లాలి మనం’ అన్నాడు సత్యనారాయణ. చి. వాణిశ్రీ చికాకు పడింది. తప్పనిసరై అమ్మ, నాన్నలతో కలిసి బిడ్డను తీసుకుని పొరుగూరిలో ఉన్న ‘బాబాయ్’ ఇంటికి వెళ్లింది.
 (సినిమాలో అమెరికా అల్లుడి మాట వినిపిస్తుంది తప్ప, మనిషి కనిపించడు. ఎందుకంటే ఇది ఒకట్రెండు రోజుల్లో ముగిసే కథ. మధ్యలోనిది అంతా  ఫ్లాష్‌బ్యాక్).
   
రాత్రి బాగా పొద్దు పోయింది.
శోభన్‌బాబు తాగుతున్నాడు.
‘లక్ష్మి ఎలా ఉంది?’ అడిగాడు సత్యనారాయణ. లక్ష్మి అంటే మానసిక చికిత్సాలయంలో ఉన్న వాణిశ్రీ.
‘కన్న కూతురు భర్త దగ్గరకు అమెరికా వెళుతుంటే మనసారా ఆశీర్వదించలేని నికృష్ణపు బతుకు బతుకుతోంది’ అన్నాడు శోభన్‌బాబు బాధగా.
అప్పుడే అటుగా వచ్చిన చి. వాణిశ్రీ ఈ మాటను వింది. పరుగున శుభ దగ్గరికి వెళ్లింది.
‘మమ్మీ మమ్మీ’
‘ఏమిటమ్మా...’
‘నేనెవరి కూతుర్ని, నిజం చెప్పు’.
‘ఏమిటా అర్థంలేని మాటలు? కలవరిస్తున్నావా? ఏంటమ్మా నీకెందుకా సందేహం వచ్చింది?’
 ‘ఎందుకా? తాగిన వాడు అబద్ధం చెప్పలేడు కనుక.
(శోభా అని తల్లి అరుస్తుంది)
‘చెప్పకపోతే నా మీద ఒట్టే. ఆ లక్ష్మి ఎవరు? నేను ఎవరి బిడ్డను. నిజం చెప్పండి. మాట్లాడరేం’ అంది చి.వాణిశ్రీ.
‘కన్నతండ్రిని ఎదురుగా పెట్టుకుని ఏమిటా పిచ్చి ప్రశ్నలు’ అన్నాడు శోభన్‌బాబు సత్యనారాయణను చూపిస్తూ.
‘‘బాబాయ్ నేనేం పసిపాపను కాదు, మాటలతో మరిపించడానికి. నిజం చెప్పండి. ఎందుకలా కంగారు పడుతున్నారు? మాట్లాడరే.. నా పుట్టుక అంత అపవిత్రమైనదా? నా తల్లి... కడుపున పుట్టిన బిడ్డను కన్న కూతురు అని చెప్పుకోలేనంత పాపిష్టిదా? పచ్చిగా బతుకుతున్న కులహీనురాలా? కులటా?’
‘శోభా’ పెద్దగా అరిచాడు శోభన్‌బాబు.
‘నీ తల్లి కులట కాదమ్మా. కుల దైవం. పతిత కాదమ్మా దేవత. నా జీవన జ్యోతి. నేనింకా బతికున్నాను అంటే అది ఆమె కోసమే. ఇంతకాలం కాలకూట విషం నా కడుపులో దాచుకుని కుమిలిపోతున్నాను అంటే నీ కోసం అమ్మా నీ కోసం. అవునమ్మా నువ్వు, నాకు లక్ష్మికి పవిత్ర మాంగల్యానుబంధానికి ఫలితంగా పుట్టిన బిడ్డవు’.
‘అవునమ్మా... వాసు నీ కన్న తండ్రి’ అన్నాడు సత్యనారాయణ.  చిన్న వాణిశ్రీ ఖిన్నురాలైంది.
‘అయితే నేను మీ దగ్గర ఎందుకు పెరిగాను’ అని అడిగింది.
‘అదంతా ఒక పెద్ద కథమ్మా. ఏ కవీ కల్పించలేని యదార్థ జీవితం’ అన్నాడు శోభన్‌బాబు.
(ఇక్కడ ఫ్లాష్ బాక్ మొదలౌతుంది).
   
అల్లు రామలింగయ్య టీచర్. సత్యనారాయణ పెద్ద కొడుకు. శోభన్‌బాబు చిన్న కొడుకు. పెద్దకొడుక్కి పెళ్లయిపోయింది. కోడలు శుభ ఉద్యోగం చేస్తోంది వాళ్లకో బిడ్డ. ఇల్లు పీకి పందిరేసే వయసు. ఆ ఇంట్లోకి రెండో కోడలుగా అడుగు పెట్టింది. వాణిశ్రీ. ఇంట్లో అందరి అభిమానాన్ని చూరగొంది. ఇంటెడు పని చేస్తుంది. బావగారి కొడుకు ఆలనా పాలనా తనే తీసుకుంది. తోడికోడలు ఉద్యోగి కదా అందుకు. శుభకు ఒకడే కొడుకు. ఆపరేషన్ కూడా అయింది. ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందుకే ఆ ఇంట్లో వాడు స్పెషల్. ఇప్పుడు వాణిశ్రీ కోడలుగా వచ్చాక వాడు ఇంకా స్పెషల్ అయ్యాడు. వాణిశ్రీ ఎప్పుడూ ఆ పిల్లాడిని వెంటేసుని తిరుగుతుంది. భర్త పనిచేసే ఆఫీసుకు కూడా అలాగే వెళుతుంది. వాడంటే అంత ఇష్టం.
   
రోజులు గడుస్తుంటాయి. శుభ కొడుకు వాణిశ్రీకి బాగా మాలిమి అవుతాడు. అమ్మా అమ్మా అంటూ తిరుగుతాడు. అసలు అమ్మను పట్టించుకోడు. పిల్లాడి విషయంలో వాణిశ్రీని తప్పు పడుతుంది శుభ ఓరోజు భర్త దగ్గర.
‘నూరేళ్లు సలక్షణంగా బతికవలసిన నా బాబు... ఆ గొడ్రాలి చేతిలో పెరిగి అల్పాయుష్కుడవడం నేను సహించలేను’ అని గట్టిగా అరిచింది శుభ. ఆ అరుపు వాణిశ్రీకి వినిపించింది. కన్నీళ్లు పెట్టుకుంది.
‘‘నేను గొడ్రాలినా’’ అని శోభన్‌ని అడిగింది.
‘పిల్లాపాపల్లేని వాళ్లు బాబుని పెంచకూడదా?’ అని అడిగింది.
శోభన్, వాణిశ్రీని అక్కున చేర్చుకున్నాడు.  
‘లక్ష్మీ... ఎండిపోయిన చెట్లైనా నీ చేత్తో నీళ్లు చిలకరిస్తే చిగురించి మూడు పావులు, ఆరుకాయలుగా రాలేదా... అలాంటి చల్లటి మనసుతో నువ్వు పెంచుతున్న బాబు అల్పాయుష్కుడు ఎలా అవుతాడు?’ అని అనునయించాడు. ఆ రాత్రి ఇద్దరూ ఒకటవుతారు.... చాలాకాలం తర్వాత. ఆ మర్నాడే బెంగుళూరు వెళ్లిపోతాడు శోభన్.
   
ఇక్కడ వాణిశ్రీకి గుడికి బయల్దేరింది. నానమ్మని అడిగి బాబు (శుభ కొడుకు) కూడా బయటికి వెళ్తాడు. గుడి దగ్గర రద్దీగా ఉంది. అమ్మను వెతుక్కుంటూ వెనకాలే వెళ్లాడు. అంతా అక్కడ రథం లాగుతున్నారు. అక్కడ వాడు వాణిశ్రీని చూసి అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. వాణిశ్రీ కూడా వాడిని చూసింది. ‘బాబూ బాబూ అక్కడే ఉండు’ అని దగ్గరకు వస్తుంటుంది. ఆలోపే వాడు రథం చక్రాల కింద పడి చచ్చిపోతాడు. సినిమాకు ఇది టర్నింగ్ పాయింట్.

వాణిశ్రీకి ఎప్పుడూ బాబే గుర్తుకు వస్తుంటాడు. ఎక్కడ చూసినా వాడే కనిపిస్తుంటాడు! ఎవ ర్ని చూసినా వాడే అనుకుంటుంది. చివరికి వాణిశ్రీ మతి స్థిమితం తప్పి ఎటో వెళ్లిపోతుంది. పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. వెతికి ఇంటికి తెస్తారు.
‘మెంటల్లీ షాక్డ్. గర్భవతి కూడా.  చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని’ చెప్తాడు డాక్టర్.
నెలలు నిండుతాయి. ఆడపిల్ల పుడుతుంది. ఆమే... చిన్న వాణిశ్రీ.
‘ఈ పరిస్థితిల్లో బిడ్డను ఆమె పెంచకూడదు. ఆ పసిపాప భారాన్ని ఎవరికైనా అప్పగించడం మంచిది. అన్నయ్యా... పోయిన మీ బిడ్డను మళ్లీ తెచ్చిచ్చే శక్తి నాకు లేదు. తల్లి ఉండీ లేని ఈ బిడ్డను మీ బిడ్డలాగే పెంచుకోగలరా’ అని అడుగుతాడు శోభన్. అలా సత్యనారాయణ, శుభ... చి.వాణిశ్రీని తమ బిడ్డలా అక్కున చేర్చుకుంటారు. అక్కడ మానసిక చికిత్సాలయంలో పెద్ద వాణిశ్రీ, ఇక్కడ అసలు తల్లిదండ్రులు కాని సత్యనారాయణ, శుభల దగ్గర చిన్న వాణిశ్రీ ఉంటారు. శోభన్ రోజూ వెళ్లి చికిత్సాలయంలో భార్యను చూసి వస్తుంటాడు.
ఇదీ ఫ్లాష్ బ్యాక్.  
   
అంతా విన్నాక... ‘నేను వెంటనే మా అమ్మను చూడాలి’ అంటుంది చి. వాణిశ్రీ.
‘నీకేమైనా పిచ్చిపట్టిందా? నీకీ విషయం తెలియకూడదనే అమ్మా మేము ఇంతకాలం తాపత్రయ పడింది’ అన్నాడు  సత్యనారాయణ.
‘చూడాలి. చూసి తీరాలి’ అంటుంది. వెళుతుంది. అమ్మను చూస్తుంది. బొమ్మ బిడ్డను  ఎత్తుకుని పాడుతుంటుంది పెద్ద వాణిశ్రీ.
అదే పాట... ముద్దుల మా బాబు...పాట.
చి. వాణిశ్రీ ఏడుస్తుంది. అమ్మ దగ్గరికి తన కొడుకును పంపుదామనుకుంటుంది. పెద్ద వాణిశ్రీలా వేషం చేసుకుని ఆ వేషానికి వాడిని అలవాటు చేస్తుంది.
   
లాస్ట్ సీన్: మెంటల్ హాస్పిటల్‌లో వాణిశ్రీని  ఏడిపిస్తుంటారు మిగతా రోగులు. చర్చిలో కూర్చొని ఏడుస్తుంటుంది. కూతురు వాణిశ్రీ వస్తుంది.
‘ఎందుకేడుస్తున్నావ్’ అని అడుగుతుంది తల్లిని.
‘నా బాబు కనిపించడం లేదు’
‘ఎలా ఉంటాడు?’
చెప్తుంది.
‘ఓహో... మీ వారు తీసుకెళ్లారన్న మాట. రోజూ వచ్చి మీకు పండ్లు పలహారాలు ఇచ్చే మీవారు తీసుకెళ్లారు.
మీకు మీ వారిని, మీ బాబుని చూపిస్తాను. మరి నేనడిగింది ఇస్తారా?’ అంటుంది చిన్న వాణిశ్రీ.
‘నా బిడ్డలాంటి దానివి ఏమడిగినా ఇస్తాను. అడుగు’ అంటుంది.
కూతురు వాణిశ్రీ ఏడుస్తుంది. ‘అమ్మా అమ్మా’ అని ఏడుస్తుంది.
 ‘మీ అమ్మ లేదా ఎందుకేడుస్తున్నావ్’ అంటుంది.
‘ఉంది నా మనసులో, నా చుట్టూ, నా ఎదురుగా ఉంది’ అంటుంది.
ఆశీర్వదించమంటుంది.
శోభన్‌బాబు, బాబు పచ్చికలో ఆడుకుంటుంటుంటే  తీసుకెళ్లి ‘అడుగోనమ్మా మీ బాబు అని తన బాబుని చూపెడుతుంది.  
పెద్ద వాణిశ్రీకి గతం గుర్తుకొస్తుంది.
‘అమ్మా’ అని పిల్లాడు ఆమె దగ్గరికి వెళతాడు.  శోభన్ కూతురివైపు ఆశ్చర్యంగా చూస్తాడు.
ఎంత త్యాగం చేశావమ్మా... అంటాడు.
‘త్యాగం కాదు.. కన్నబిడ్డగా నా రుణం తీర్చుకుంటున్నాను’ అంటుంది. తన బిడ్డను, తన తల్లి దగ్గర వదిలి చి. వాణిశ్రీ వెళ్లిపోతుంది.
ఇదీ కథ.

మళ్లీ చూడండి
రామ్
ఎడిటర్, ఫీచర్స్

మరిన్ని వార్తలు