అడిగితే చాలదా!

19 Jan, 2018 23:42 IST|Sakshi

చెట్టు నీడ 

ఇంటిని ఆఫీస్‌కి తెచ్చేయడంపై మగవాళ్లకేవో అభ్యంతరాలు ఉంటాయి. ఆఫీస్‌ గాంభీర్యం తగ్గుతుందని, ఆడపిల్లల సన్నటి గొంతులు విని కుర్చీలు, బల్లలు మాట వినకుండా నెత్తికెక్కి కూర్చుంటాయని! ఇది కరెక్ట్‌ కాదు. ఆడవాళ్లు అంతటా ఉండాలి. ప్రతి అనుకూలతలో, ప్రతి ప్రతికూలతలో... మగవాళ్లు ఉన్నట్లే ఆడవాళ్లూ ఉండాలి. ఉత్సాహంగా మేం చేస్తాం అని ముందుకు వచ్చినప్పుడు ‘మీరా! ఇక్కడా!!’ అంటూ  నిరుత్సాహపరచడంలో బైటపడేది మహిళల బలహీనతకాదు, ఆధిక్య భావనలలోని దౌర్బల్యం.  ఉమన్‌ రిపోర్టర్‌ల ప్రెస్‌ కాన్ఫరెన్సులు అమెరికా అధ్యక్ష భవనానికి కొత్త!  ‘‘ఇక్కడ ఇంతవరకు ఇలాంటివి జరగలేదు మిసెస్‌ రూజ్వెల్ట్‌’’ అన్నారు వైట్‌హౌస్‌ ప్రతినిధులు. ‘‘కానీ నాకు వాళ్లతో తరచు మాట్లాడవలసిన అవసరం ఉంటుంది’’ అన్నాను. న్యూయార్క్‌ వార్తాపత్రికల్లో పనిచేస్తున్న ఉమన్‌ రిపోర్టర్‌లకు ఆహ్వానాలు వెళ్లాయి. 

ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ మొదలైంది. ఎంత కాంతి ఈ అమ్మాయిల కళ్లలో! ఎంత కాన్ఫిడెన్స్‌! ఎన్ని ఆలోచనలు! చెప్పింది రాసుకోవడంలో వాళ్లకెలాంటి ఆసక్తీ లేదు. ఉన్నచోట ఉండిపోవడంలో వాళ్లకెలాంటి సంతృప్తీ లేదు. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. వైట్‌హౌస్‌ అంతా కలియతిరుగుతున్నారు. స్త్రీల సంరక్షణ  బాధ్యతల్లో ఒక అగ్రరాజ్యం ప్రపంచ దేశాలకు ఎలా ఆదర్శప్రాయంగా ఉండాలనే విషయమై వారందరికీ స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. 

‘‘వైట్‌ హౌస్‌లో మా ఫస్ట్‌ కాన్ఫరెన్స్‌ ఇంత హోమ్లీగా ఉంటుందనుకోలేదు’’ అందొక అమ్మాయి. ‘‘మేమ్, నాకైతే వెళ్లాలని లేదు. కానీ మా న్యూయార్క్‌ ఆఫీస్‌లో మీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ విశేషాలను వెంటనే రిపోర్ట్‌ చెయ్యాలి. వైట్‌ హౌస్‌ పైన ఉన్న గదుల్ని చూడాలని ఉంది నాకు’’ అంది. నవ్వొచ్చింది నాకు. ‘‘రేపు మీరంతా ఇక్కడికి లంచ్‌కి వస్తున్నారు. తక్కిన న్యూస్‌పేపర్‌ గాళ్స్‌ని కూడా మీ వెంట తీసుకురండి. అందరం కలిసే పైన ఉన్న గదులన్నీ చూద్దాం’’ అన్నాను. ‘‘కానీ మిసెస్‌ రూజ్వెల్ట్‌... అక్కడికెవ్వరినీ అధ్యక్ష భవనం అనుమతించదు’’ అన్నారు మల్వీనా «థామ్సన్‌. ఆవిడ నా కార్యదర్శి. ‘‘ఇది నా ఇల్లు కాదు మల్వీనా. ప్రజాభవనం. వారి భవనాన్ని వారు సందర్శించాలనుకుంటున్నారు. వారికా హక్కు ఉంది’’ అన్నాను. అసలు హక్కుల వరకూ ఎందుకు? ఆడపిల్లలు నోరు తెరిచి అడిగినప్పుడు ఏ అనుమతి విధానాల ఉల్లంఘనైనా చట్టబద్ధం కాకుండా పోతుందా?! (అమెరికా 32వ అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ సతీమణి ఎలినార్‌ రూజ్‌వెల్ట్‌ çస్వగతాలలోంచి చిన్న భాగం)

మరిన్ని వార్తలు