తిట్టిన వారికీ దీవెనలే!

12 Dec, 2016 14:26 IST|Sakshi
తిట్టిన వారికీ దీవెనలే!

వలస వచ్చిన విశ్వాసుల్లో అబూ తాలిబ్‌ తనయుడు హజ్రత్‌ జాఫర్‌ రజీ, చక్రవర్తి ప్రశ్నలకు సమాధానాలిస్తూ, ‘మహారాజా! మేము పూర్వం చాలా అజ్ఞానంగా ఉండేవాళ్ళం. విగ్రహారాధన చేసేవాళ్ళం. సారాయి, జూదం, అశ్లీలతల రొచ్చులో కూరుకు పోయి ఉండేవాళ్ళం. చచ్చిన జంతువులను తినేవాళ్ళం. పగలు, ప్రతీకారాలతో రగిలిపోతూ ఒకళ్ళనొకరు చంపుకునేవాళ్ళం. కక్షలు, కార్పణ్యాల పరంపర తరతరాలుగా కొనసాగేది. ఇలాంటి పరిస్థితిలో దేవుడు మాపై దయ దలిచాడు. మాలోనే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆయనది ఎంతో గౌరవప్రదమైన వంశం. ఆయనగారి నీతి నిజాయితీ, సత్యసంధత మాకు మొదటి నుండీ తెలుసు. ఆయన మమ్మల్ని సత్యం వైపు, ధర్మం వైపు పిలిచాడు. దేవుని సందేశం మాకు బోధించాడు.

సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యమే పలకాలనీ, జాలి, దయ, పరోపకారం లాంటి సుగుణాలు కలిగి ఉండాలనీ, సాటి మానవుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలనీ, బంధువుల హక్కులు నెరవేర్చాలనీ, అనాధలను ఆదరించాలనీ, వారిసొమ్ము కబళించకూడదనీ, శీలవతులపై అపనిందలు మోపకూడదనీ, దానధర్మాలు చేస్తూ ఉండాలనీ ఆయన మాకు బోధించాడు. మేమాయన మాటలు విని, ఆయనను అనుసరిస్తున్న కారణంగా మా వాళ్ళు మమ్మల్ని హింసించడం ప్రారంభించారు. వారి దౌర్జన్యాలు భరించలేక, ఇక్కడైనా కాస్త ప్రశాంతంగా బ్రతకవచ్చని మీ దేశంలో తలదాచుకున్నాం. ఇదే మేము చేసిన నేరం’ అన్నారు.


తరువాత జాఫర్‌ ద్వారా కొన్ని ఖురాన్‌ వాక్యాలు కూడా చదివించుకొని విన్నాడు – నీగస్‌ చక్రవర్తి. ఈసా ప్రవక్తకు సంబంధించి ఖురాన్‌ చెప్పిన విషయాలను ధ్రువీకరించాడు. అంటే, ముహమ్మద్‌ ప్రవక్త(స) వారి సందేశం మహోన్నతమైన నైతిక, మానవీయ ప్రమాణాలతో నిండి ఉందని మనకు అర్థమవుతోంది. జీవితంలోని ప్రతి రంగంలో నీతిని పాటించాలనీ, ఇంట్లోనైనా, వీధిలోనైనా, కార్యాలయాల్లోనైనా, న్యాయస్థానాల్లోనైనా, అధికార పీఠంపైనా ప్రతిచోటా నిజాయితీ, సౌశీల్యం తొణికిసలాడాలనీ, జీవితంలోని ఏ రంగమూ నీతి రహితంగా ఉండకూడదనీ ప్రవక్త అభిలషించారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకూ, మానవీయ సంబంధాల పెంపుదలకూ ఎంతటి ప్రాముఖ్యమిచ్చారో ప్రవక్త జీవితం ద్వారా మనకు తెలుస్తోంది.


ప్రవక్త(స) తన సందేశ కార్యక్రమంలో భాగంగా ‘తాఝెఫ్‌’ అనే ఊరికి వెళ్ళారు. గ్రామ పెద్దలను కలుసుకొని తన సందేశం వినిపించారు. కానీ వారు చాలా అమర్యాదగా, అమానవీయంగా ప్రవర్తించారు. మంచిని బోధించినందుకు నానా మాటలన్నారు. రౌడీ మూకను ఆయనపైకి ఉసిగొలిపి రక్తసిక్తమయ్యేలా కొట్టించారు. అయినా ప్రవక్త పల్లెత్తుమాట అనలేదు. పర్వతాలపై అదుపు కలిగిన దైవదూతలు ప్రత్యక్షమై, తమరు అనుమతిస్తే రెండు కొండల మధ్య ఉన్న ఈ ఊరిని విసుర్రాయిలో పప్పులు నలిపినట్లు నలిపి పిండి చేస్తామన్నా, ఆ మానవతామూర్తి ససేమిరా ఒప్పుకోలేదు. చెడుకు చెడు సమాధానం కాదని ఉపదేశించారు. తనను హింసించిన వారిని దీవించి, వారికి సద్బుద్ధిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్థించారు.     (మిగతాది వచ్చేవారం)

మరిన్ని వార్తలు