ఐ లవ్ యూ మామ్..!

8 May, 2014 23:29 IST|Sakshi
ఐ లవ్ యూ మామ్..!

అమ్మకు జేజే!
 
పొద్దున్నే లేవగానే నాకు ప్రతి ఇల్లూ ఇస్రోలా అనిపిస్తుంది. ప్రతి హోమూ ఓ శ్రీహరికోట షార్‌సెంటర్‌లా కనిపిస్తుంది.
 
పొద్దున్నే బ్యాగును వీపున పెట్టుకుని, బాస్కెట్ చేతిన పట్టుకుని వెళ్లే బుల్లిబుల్లి చిన్నారులను చూస్తుంటే పే...ద్ధ ఆస్ట్రోనాట్‌లను చూసిన అనుభూతి. వాళ్లు చదువుతున్నది ఏ ఎల్కేజీనో, యూకేజీ అయితేనేం... ఏ పెద్ద పెద్ద సైంటిస్టులనో చూసిన ఫీలింగ్! వాళ్లను స్కూళ్లకు తయారుచేసే తల్లులను చూస్తే గ్రౌండ్ కంట్రోల్ వద్ద బిజీబిజీగా పనిచేసే సైంటిస్టుల్లా కనిపిస్తుంటారు. అందుకే ఆ అమ్మలందరినీ చూస్తే చెయ్యెత్తి దండం పెట్టాలన్న ఆరాధన.
 
ఎల్కేజీకి రాగానే అమాయకపు నీలి కళ్లతో తమ భుజబలంతో అనగా... స్ట్రాంగ్ ఆర్మ్‌తో అలవోగ్గా అలా ఆ బ్యాగును వీపుపైకి తర్జుమా చేసుకునే ప్రతి పిల్లాడు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌లాగే కనిపిస్తుంటాడు. ప్రతి బంగారుకొండా బుజ్జిబుజ్జి చేతుల్తో బాస్కెట్లను సునీతా విలియమ్స్ అంత నేర్పుగా అమర్చుకుంటుంది. ఆ తర్వాత స్కూల్ అనే గెలాక్సీ చమక్కుల పయనానికి తయారవుతుంటారు. అందమైన వ్యోమలోకం కొందరికి నక్షత్రంలా మిణుక్కుమంటే మరికొందరికి కృష్ణబిలంలా గుభేలుమనిపిస్తుంది. పూర్వం ఈ అంతరిక్షానికి అంతా రిక్షాల్లో వెళ్లేవారు. కానీ ఇటీవల దూరాలు పెరగడంతో పీఎస్‌ఎల్వీ ల్లాంటి పెద్ద బస్సులను వాడుతున్నారు.
 
తరగతిగదిని కక్ష్య అని కూడా ఎందుకంటారో మొదట్లో తెలియలేదుగానీ... పిల్లల్ని క్లాసు వరకూ చేర్చడం కక్ష్యలోకి ప్రవేశపెట్టడం లాందిదే అని ఇప్పుడర్థమైంది. కిచెన్‌లో అనేక పొయ్యిలు ఉన్న స్టౌ ముందు నిల్చున్న అమ్మ... అనేక మానిటర్ల ముందు నిల్చున్న గ్రౌండు కంట్రోల్ వద్ద పెద్ద సైంటిస్టులా కనిపిస్తుంటుంది. బడివేళ కౌంట్‌డౌన్ మొదలయ్యాక తొలుత ఇంటి నుంచి బయటివరకూ, అక్కడ్నుంచి ఏ టూవీలర్ మీదనో లాంచింగ్ స్టేషన్ లాంటి బస్‌సాప్ వరకూ, మరిక ఆ తర్వాత బస్ నుంచి స్కూల్‌కూ... ఇక అప్పుడు క్లాస్‌కూ చిన్నారి చేరితే నిజంగా మన ఆస్ట్రోనాట్‌ను అంచెలంచెల మీద కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అనుభూతి పరిపూర్ణమవుతుంది.
 
ఇక తిరిగొచ్చే టైమ్‌కు వాళ్లను రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రతి తల్లికీ గగనంలో ఎగిరే యూరీగగారిన్‌లనూ, ఎదుగుతూ పోయే ఎడ్విన్ ఆల్డ్రిన్‌లనూ, సీతాకోకచిలుక రెక్కల్లా చేతులల్లాడించే తెరిష్కోవాలనూ చూసిన అద్భుత ఫీలింగ్!
 
ఇవన్నీ అనుభూతి చెందుతున్న వేళల్లో ఓ తెలతెలవారుతున్న వేకువలో, నునులేత చలిలో, అరమొగ్గల్లా వెళ్తున్న ఆ చిన్నారులను చూస్తుంటే... ఓ వైపు మనసు నిండిపోతుంటుంది. మరోవైపు కడుపు తరుక్కుపోతుంటుంది. నిజమే పొద్దున్నే మంగళయాన్‌లా అనిపించే ఆ పిల్లల ప్రయాణం నిజంగా మంగళప్రదమైన యానమే. కాకపోతే స్పేస్ సైంటిస్టులది మార్స్ మిషన్. హోమ్‌సైంటిస్టులైన పేరెంట్స్‌దీ, వాళ్ల పిల్లలదీ పరీక్షలకు తయారు చేసే ‘మార్చ్’ మిషన్!
 
అదంతా చూశాకగానీ... అర్థం కాలేదు నాకు... మార్స్ ఆర్బిట్ మిషన్‌ను ‘మామ్’ అని షార్ట్ ఫామ్‌లో ఎందుకు పిలుస్తున్నారో. అవును... ఏదో ఒక రోజు స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపడం కాదు. ప్రతిరోజూ పిల్లలను తరగతి కక్ష్యల్లోకి ప్రవేశపెడుతున్న తల్లులదే అసలైన ‘మామ్’ మిషన్. అందుకే ఐ లవ్ యూ... మామ్.
 
- యాసీన్
 

మరిన్ని వార్తలు