కింగ్‌ వడా పావ్‌

6 Jul, 2019 12:02 IST|Sakshi

మెక్‌ డొనాల్డ్, డోమినోస్‌...అమెరికా టు ఇండియా...అబ్బో... అంటూ లొట్టలేస్తున్నశబ్దాలు వినిపించాయి.ఆ శబ్దాలు ధీరజ్‌కి కూడావినిపించాయి.తను కూడా లొట్టలువేయించాలనుకున్నాడు...తన మెదడుకు పదును పెట్టాడు.ముంబైలోని వడాపావ్‌పరిమాణం పెంచాడు.జంబో కింగ్‌ను ప్రారంభించాడు.అందరినీ ఆకట్టుకున్నాడు.ముంబైకి చెందిన ధీరజ్‌ గుప్తా...అతడు తన విజయం కోసం వేసినఅడుగులే ఈ నాటి ఫుడ్‌ ప్రింట్స్‌...

రెండు దశాబ్దాల క్రితం అంటే 1998లో ముంబైలో ఎంబిఏ పూర్తి చేసిన ధీరజ్‌ గుప్తా సొంతంగా ఒక వ్యాపార సంస్థను స్థాపించాలనుకున్నాడు. ముందుగా స్వీట్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ పెట్టాలనుకున్నాడు. అందుకోసం చాలా కృషి చేశాడు. శ్రమకు తగ్గ ఫలితం లభించలేదు. రెండు సంవత్సరాల కాలంలో గుప్తా సుమారు 50 లక్షల సొమ్ము పోగొట్టుకున్నాడు. దురదృష్టమేమిటంటే, చేబదులు అడిగి తీసుకుని పెట్టుబడిగా పెట్టిన సొమ్ము ఇది. స్వీట్స్‌ వ్యాపారం గుప్తా జీవితంలో తీపి జ్ఞాపకాలను కాదు, పచ్చి వగరు చేదులను కలగలిపిన అనుభవాలను మిగిల్చింది.

కొత్త రుచులు...
ప్రతి పరాజయం విజయానికి మెట్టు కావాలనుకున్నాడు. ఈ రెండు సంవత్సరాల కాలం  తన దృష్టిని మెక్‌డొనాల్డ్, డొమినోస్‌ సంస్థలు అమ్మే పిజ్జాలు, బర్గర్‌ల మీద కేంద్రీకరించాడు. ఇప్పుడు అందరికీ కొత్త రుచుల మీద మనసు మళ్లిందని అర్థం చేసుకున్నాడు. తన స్వీట్స్‌ బిజినెస్‌కు స్వస్తి పలికి, కొత్త రుచుల బాటలో అడుగులు ప్రారంభించాడు. విదేశాల నుంచి దిగుమతైన బర్గర్‌లు, పిజ్జాలకు బదులుగా స్థానిక వడాపావ్‌ను పాపులర్‌ చేయాలనుకున్నాడు. అప్పటికే మహారాష్ట్ర వీధులలో బాగా పాపులర్‌ అయిన వడాపావ్‌ను వీధినుంచి స్టార్‌ స్థాయికి తీసుకురావాలనుకున్నాడు. తన ఖరీదైన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి రెండు లక్షల రూపాయలు అప్పు చేసి, తన వడాపావ్‌కు ‘జంబో కింగ్‌’ అని పేరు పెట్టాడు. ఆ పేరున రిటైల్‌ చైన్‌ మార్కెట్‌ ప్రారంభించాడు.

లాభాలతో ప్రారంభం...
ముంబై మలాడ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో 200 చదరపు అడుగుల స్థలంలో 2001, ఆగస్టు 23న మొట్టమొదటి జంబో కింగ్‌ ఔట్‌లెట్‌ ప్రారంభమైంది. వడపావ్‌ సైజును 20 శాతం పెంచి, కంటికి ఇంపుగా కనిపించేలా తయారుచేసి, అమ్మకానికి సిద్ధం చేశాడు. ధీరజ్‌ గుప్తా ఆలోచన, శ్రమలకు ఫలితంగా మొట్టమొదటి రోజునే ఐదు వేల రూపాయల సరుకు అమ్మగలిగాడు. ఆ సంవత్సరం 40 లక్షల లాభం సంపాదించినా, మరో ఔట్‌లెట్‌ ప్రారంభించడానికి రెండు సంవత్సరాలు పట్టింది. 2003లో మరో ఔట్‌లెట్‌ ప్రారంభమై, 2005 నాటికి ఐదు ఔట్‌లెట్‌ల స్థాయికి ఎదిగింది. మరింత ఎదగాలనుకున్నాడు. పరిశుభ్రత, ప్యాకింగ్‌ విషయాలలో జాగ్రత్త వహించాడు. జంబో కింగ్‌కు వచ్చి వడాపావ్‌ తిన్న వారంతా వాహ్‌! క్యా టేస్ట్‌ హై!! అంటూ ఇరుగుపొరుగువారిని కూడా రుచి చూసేలా చేశారు.  పైసా ఖర్చు లేకుండా జంబో కింగ్‌కి ప్రచారం వచ్చేసింది.

వారిని చూసి...
2006 నాటికి 100 మెక్‌డొనాల్డ్‌ స్టోర్లు దేశవ్యాప్తంగా విస్తరించడం చూసిన ధీరజ్‌ గుప్తా తాను కూడా ముంబై నుంచి బయటకు అడుగులు వేయాలనుకున్నాడు. తన కల సాకారం కావడానికి చాలా కాలం పట్టింది. 2007 నాటికి తన కల ఫలించింది. ఒక మల్టీ నేషనల్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ జంబో కింగ్‌ను మార్కెటింగ్‌ చేయడానికి అంగీకరించింది. దాంతో గుప్తాకు బాలారిష్టాలన్నీ తొలగినట్లయింది. అన్ని నగరాలకు జంబో కింగ్‌ ఫ్రాంచైజ్‌ ఇచ్చేశారు గుప్తా.

ఇప్పుడు జంబో కింగ్‌ 12 మహానగరాలకు వ్యాపించింది. వంద స్టోర్లు తెరుచుకున్నాయి. మరిన్ని నగరాలకు విస్తరించడానికి సన్నద్ధమవుతున్నారు గుప్తా. వడ పావ్‌ స్టాల్స్‌ని ఏటిఎంలలాగ దేశమంతా అందుబాటులోకి తీసుకు రావడమే గుప్తా కోరిక. ప్రతి ఫ్రాంచైన్‌ ఓనర్‌ ఒక పెద్ద వ్యాపారవేత్త అవుతున్నాడు. ప్రతి స్టోర్‌ విజయవంతంగా నడుస్తోంది. అందువల్ల జంబో కింగ్‌ కూడా వృద్ధిలోకి వస్తోంది. లాభాలతో ప్రయాణిస్తున్న జంబో కింగ్‌ ఇప్పుడు ఏడాదికి 35 శాతం నికర లాభంతో నడుస్తోంది. సైజులో మార్పు తెచ్చాడు. తన జీవితాన్నే మార్చేసుకున్నాడు ధీరజ్‌ గుప్తా.

నాణ్యతప్రమాణాలు పాటిçస్తున్నారా లేదా, వినియోగదారులు తృప్తిగా ఉన్నారా లేదా అనే అంశం మీద ఆడిట్‌ చేస్తుంటాను. ఇందుకోసం కొందరు యువకులను నియోగించాను. వారు ఒక సాధారణ కస్టమర్‌లాగ స్టాల్‌కి వెళ్లి, పరీక్షిస్తుంటారు. ఇలా చేయడానికి ఒక్కో స్టోర్‌కి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. ఏ స్టోర్‌కి సంబంధించి నెగిటివ్‌ రిపోర్టు వచ్చినా, ఆ స్టోర్‌ మీద తగు చర్యలు తీసుకుంటాను. 100వ ఔట్‌లెట్‌ ప్రారంభించేనాటికి మా టర్నోవర్‌ 50 కోట్లకు ఎదగాలని కోరుకుంటున్నాను.– ధీరజ్‌ గుప్తా, జంబో కింగ్, ముంబై

మరిన్ని వార్తలు