పాఠ్యపుస్తకంలో పోలీస్‌

18 Jun, 2018 00:41 IST|Sakshi

ముంబై రైల్వే పోలీసు శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్నారు రేఖా మిశ్రా. ఆమె వయసు 32. పోలీసు శాఖలో మహిళలు ఉండటం తెలిసిందే! అయితే రేఖా మిశ్రా గురించి చెప్పుకోడానికి ప్రత్యేక కారణం ఉంది. ఈ ఏడాది నుంచి మరాఠా విద్యార్థులు రేఖ గురించి తమ పుస్తకాలలో చదవబోతున్నారు. అవును. టెన్త్‌ టెక్స్‌›్టబుక్‌లో రేఖా మిశ్రాపై స్ఫూర్తిదాయకమైన ఒక పాఠం ఉంది. పిల్లలు ఆమె గురించి తెలుసుకోవాల్సిన తప్పనిసరి అంశాలను అందులో చేర్చారు. పిల్లలకే కాదు, పెద్దలకూ ఈ మిశ్రా కథ ఆదర్శమే.

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఆర్మీ అధికారుల కుటుంబం రేఖామిశ్రాది. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌లో 2014లో ఆర్‌íపీఎఫ్‌(రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)లో చేరారు. గడిచిన నాలుగేళ్లలో మిశ్రా తన నెట్‌వర్క్‌ ద్వారా వివిధ రైల్వే స్టేషన్‌లలో తప్పిపోయిన వందలాది మంది చిన్నారులను కాపాడి, వాళ్ల తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు. కిడ్నాప్‌ అయిన చిన్నారులను కాపాడి వారికి రక్షణ కల్పించారు. కిడ్నాపింగ్‌ ముఠాలతో నేరుగా తలపడటంలో ఆమె చూపిన ధైర్యసాహసాలు ఎంత చెప్పినా తక్కువే.

మైనర్‌ బాలికలే ఎక్కువ
మిశ్రా అప్రమత్తం చేసిన బృందాలు గత నాలుగేళ్లలో ఇప్పటి వరకు 953 అమాయక బాలలను కాపాడాయి. అందులో మైనరు బాలికలు ఎక్కువగా ఉన్నారు. కొంతమంది చెవిటి, మూగ బాలురు కూడా ఉన్నారు. 2016లో మిశ్రా 434 మందిని, 2017లో 500 మందికి పైగా బాలల్ని  వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు.

వీరిలో ఎక్కువ మంది పిల్లలు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ల నుంచి తప్పిపోయి వచ్చినవారు కాగా, మిగతా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వేసవికాల సెలవుల్లోనూ, ముంబైలో షూటింగ్స్‌ జరిగే సందర్భాలలోనూ ముంబై వచ్చి దిక్కుతెలియక చిక్కుకుపోయిన వారు కూడా ఉన్నారు.

కాపాడ్డం సామాజిక బాధ్యత
మిశ్రా చూపిన ధైర్యసాహసాలకు ప్రభుత్వం ఇచ్చిన సముచితస్థానం ఆ శాఖనే అన్నింటా ఉన్నతంగా నిలబెట్టింది. సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ డి.కె.శర్మ నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కిందటి సోమవారం మిశ్రాను ఘనంగా సత్కరించారు. ‘మిశ్రా ఉద్యోగ విధులను అద్భుతంగా నిర్వర్తిస్తూనే, అదే సమయంలో సామాజిక సంరక్షణలో చొరవ చూపిస్తున్నారు. పాఠ్యపుస్తకంలో భాగమైన ఆమె వృత్తి నిబద్ధత ముందుతరాలకి గొప్ప స్ఫూర్తి’ అని శర్మ ఈ సందర్భంగా ప్రశంసించారు.
 

తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకోవాలి
‘‘చాలామంది పిల్లలు తమ ఇంట్లో వారితో గొడవలు పడో, ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌కి ఆకర్షితులయ్యో, తమ అభిమాన సినిమా తారలను కలుసుకోవడానికో.. రకరకాల కారణాలతో ముంబై వస్తుంటారు. కొన్ని  కిడ్నాప్‌ కేసులు కూడా ఉంటాయి’ అని వివరిస్తూ.. ‘ముఖ్యంగా టీనేజ్‌లోని  పిల్లలు ఇంటి నుంచి దూరమై దుర్మార్గుల చేతుల్లో పడి కష్టాలు ఎదుర్కొంటున్నారు’’ అని రేఖా మిశ్రా తనకు జరిగిన సన్మాన సభలో ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు పిల్లల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల దగ్గరకు పిల్లలను చేర్చగా, మిగిలిన వారిని బాలల సంరక్షణ కేంద్రాలలో ఉంచుతున్నారు రేఖా మిశ్రా.

– ఎన్‌.ఆర్‌.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా