పుట్టగొడుగుల సాగు భలే తేలిక!

27 Aug, 2019 08:12 IST|Sakshi

పుట్టగొడుగుల్లో పౌష్టిక విలువల గురించి తెలియని వారుండరు. కానీ, అవి అందుబాటులో లేక తినలేకపోతున్నామనే వారు మాత్రం చాలా మందే కనిపిస్తారు. గ్రామాల్లో, నగరాల్లో ఎక్కడైనా ఇదే పరిస్థితి. పుట్టగొడుగులను ఎండబెట్టుకొని కూరగా లేదా జావగా చేసుకొని తీసుకుంటే విటమిన్‌–డి లోపం కొద్ది వారాల్లోనే తీరిపోతుందని డాక్టర్‌ ఖాదర్‌ వలి చెప్తుండడంతో వీటి వాడకంపై ముఖ్యంగా నగరవాసుల్లో ఆసక్తిపెరుగుతోంది. అయితే, మనసుపెట్టి నేర్చుకుంటే ఆరు గంటల్లోనే పుట్టగొడుగులను ఇంటిపట్టునే పెంచుకునే పద్ధతులు తెలిసిపోతాయని బెంగళూరుకు చెందిన వినయ్‌ పరడె అంటున్నారు.

తన స్నేహితుడు నగేష్‌ ఆనంద్‌తో కలిసి కేవలం 6 గంటల శిక్షణతో పుట్టగొడుగుల పెంపకం ఎలాగో నగరవాసులకు నేర్పిస్తున్నారు. ‘పంటలకు అవసరమయ్యే నీటిలో 5 శాతంతోనే పుట్టగొడుగులను అతి తక్కువ పెట్టుబడితో సులభంగా ఇంట్లోనే మనం సాగు చేసుకోవచ్చు. వెలుతురు కూడా అవసరం లేదు. చీకటి గదిలో పెంచుకోవచ్చు..’అంటారు వినయ్‌. విద్యుత్‌ అవసరం లేకుండానే ఎండుగడ్డి వంటి వ్యర్థాలను శుద్ధిచేసి, వాటిపై ముత్యపు చిప్పల్లాంటి పుట్టగొడుగుల(ఆయిస్టర్‌ మష్రూమ్స్‌) పెంపకాన్ని బడికెళ్లే పిల్లలు కూడా చేయగలిగే సులువైన సేంద్రియ పద్ధతిని మేం అందరికీ నేర్పిస్తున్నాం అంటున్నారాయన.

మరిన్ని వార్తలు