నిలువ నీడ కోసం..

2 Mar, 2016 10:03 IST|Sakshi
కోర్టు వివాదంలో ఉన్న ఇంట్లో నిలువ నీడ కోసం.. ఇంటి బయట దీక్ష చేస్తున్న చక్రి తల్లి విద్యావతి

అపశ్రుతి దొర్లేటప్పుడు తెలీదు.
దొర్లాక తెలుస్తుంది!
చక్రి బతికి ఉండగా అదొక శ్రావ్యమైన కుటుంబ రాగం.
ఇప్పుడది... అపశ్రుతులు ధ్వనిస్తున్న అనురాగం!
చక్రిని ఆయన ఫ్యామిలీ ఎంతగానో ప్రేమించింది.
శ్రావణి కూడా ఆయన్ని ప్రేమించే పెళ్లి చేసుకుంది.
చివరికి ఆయన చితి కూడా...
ఆ ప్రేమజ్వాలల్లోనే భగభగమని ఆహుతి అయింది!
జగమంత కుటుంబానికి సంగీతం అందించిన చక్రి...
తన కుటుంబానికి ఏమీ ఇవ్వకుండా వెళ్లి ఉంటాడా?
ఇచ్చి ఉంటే.. వారసులెవరు?
ఆయన ప్రేమకు నామినీలెవరు?

 
‘‘నా బిడ్డ బంగారం, నా ఫోన్లో కూడా చక్రి పేరుండదు. నేను ముద్దుగా పిలుచుకునే బంగారు కొండ అనే ఫీడ్ చేసుకున్నాను. ఇంటినిండా ఎప్పుడూ జనం ఉండాలి. ఉన్నదాంట్లో నలుగురికీ పెట్టాలి. ఇదే నమ్మాడు చక్రి, కానీ ఇప్పుడు ఆ నిండు మనిషి దూరమై రోడ్డున పడ్డాం’’... అని కళ్లలోంచి నీళ్లు ఉబికి వస్తుంటే ఆవేదనగా చెప్పారు చక్రి తల్లి విద్యావతి.
 
‘జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది’ అంటూ తెలుగు ప్రేక్షకుల మదిని మీటిన మ్యూజిక్ డెరైక్టర్ చక్రి తల్లి ఇప్పుడు గడపదాటి బయటికి వచ్చి, జీవన పోరాటానికి సిద్ధమయ్యారు. తన కొడుకు పేరున ఉన్న సోమాజిగూడా ఇంట్లో తనకింత చోటు కావాలని డిమాండ్ చేస్తున్నారు. తోటబావిని అమ్మి తన భర్తా, కొడుకూ సోమాజిగూడ రాజ్‌భవన్ దగ్గరలోని వరుణ్ స్వర్గం విల్లాలో ఈ ఇల్లు కొన్నారని, ఇల్లు చక్రిపేరుమీదే ఉన్నా నామినీగా తన పేరే ఉందని విద్యావతి చెబుతున్నారు.
 
పెన్షన్ తప్ప మరో ఆధారం లేదు
‘‘ఈ ఇంటిపై  మాకు హక్కుంది. మాకు తలదాచుకునేందుకు మరో ఇల్లు లేదు. మా కోడలే నా బిడ్డ కొన్న కార్లు ఆడీ, ఎక్స్‌యువి కార్లు రెండూ ఆమ్మేసుకుంది. ఇప్పుడు అమెరికాలో హాయిగా ఉంది. కానీ నాకు నా భర్త పెన్షన్ తప్ప మరో ఆధారం లేదు. ఈ ఇంటిని అద్దెకిచ్చి అగ్రిమెంటు రాయించుకున్నది కూడా మేమే. దీనిపై నెలకి పాతిక వేల రూపాయల లోన్ బకాయి తీరుస్తోంది కూడా మేమే. కానీ ఈ ఇంటిపై వచ్చే 28 వేల రూపాయల అద్దె మాత్రం మాకు చేరడం లేదు. ఇల్లు ఇప్పటికిప్పుడు ఇచ్చేయమని మేం అడగడం లేదు. కనీసం ఇంట్లో ఉండే అవకాశమివ్వమంటున్నాం. ఆస్తి గొడవ కోర్టులో ఉంది కాబట్టి ఈ ఇల్లు మీకివ్వనంటోంది నా కోడలు శ్రావణి. మరి తిరుపతిలో ఉన్న స్థలాన్ని కేసు కోర్టులో ఉండగానే 45 లక్షలకి ఎలా అమ్ముకోగలిగింది’ అని చక్రి తల్లి ప్రశ్నిస్తోంది.
 
 అప్పుడు కూడా వెళ్లగొట్టింది
‘‘నవంబర్ 27న శ్రావణి మమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపించి వేసింది. చక్రే మళ్లీ మమ్మల్ని మా ఇంట్లో దింపేసాడు. తరువాత నవంబరు 30 న ‘‘నా కుటుంబాన్ని దూరం చేసుకోవడం నాకు సిగ్గు చేటు’’ అంటూ చక్రి వాట్సాప్‌లో పెట్టాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు నా బిడ్డకి నా కుటుంబం పట్ల ఉన్న ప్రేమని. నా కోడలు ఆస్తి కోసమే ఇదంతా చేసింది. డిసెంబర్  15, 2014 తెల్లవారి 5 గంటలకు చక్రి చనిపోయాడని శ్రావణి అందరికీ చెప్పింది. కానీ మాకు 7 గంటల వరకు సమాచారమే లేదు. ఈ రెండు గంటలు ఎందుకు చెప్పలేదో మాకిప్పుడు అనుమానంగా ఉంది.
 
నేనేం కోరుకోవడం లేదు
‘‘నా చిన్న కొడుకు మహిత్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. వాడి దగ్గరే ఉంటున్నా. మహిత్ కదల్లేడు, నిలబడలేడు. నడవలేడు. మహిత్ కూడా మ్యూజిక్ డెరైక్టర్ గా చేస్తున్నా వచ్చేది చాలా తక్కువ. యూసఫ్‌గూడలో అద్దెకు ఉంటున్నాం. నెల రోజుల్నుంచి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు ఖాళీ చేసాం. సోమాజిగూడ ఇంటి దగ్గరే దీక్ష చేస్తున్నాం. మాకు న్యాయం జరిగే వరకు మేం ఆందోళన ఆపేది లేదు’’ అంటున్నారు చక్రి తల్లి. అయితే దీనిపై యూ.ఎస్.లో ఉన్న చక్రి భార్య శ్రావణి పూర్తి భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా... ఈ పరిణామాలేవీ కోమల హృదయుడైన ఒక సంగీతకర్త ఆత్మకు శాంతిని చేకూర్చేవి కావు.
 
 - అత్తలూరి అరుణ,
ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సాక్షి
ఫొటోలు: లావణ్యకుమార్
 
శ్రావణికే పూర్తి హక్కు
భర్త ఆస్తిపై భార్యకి హక్కుంటుంది. ఇక్కడ కూడా శ్రావణికే సంపూర్ణాధికారం ఉంటుంది. అయితే తల్లికి కూడా డిపెండెంట్ షేర్ ఉంటుంది. ఈ కేసులో చక్రి తమ్ముడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కనుక మానవతా దృక్పథంతో చక్రి భార్య శ్రావణి ఆలోచించి ఏదైనా కావాలంటే ఇవ్వొచ్చు. కానీ తమ్ముడికి చక్రి ఆస్తిపై ఎటువంటి అధికారం ఉండదు.
 - కొండారెడ్డి, హైకోర్టు అడ్వకేట్
 
తల్లికీ వాటా ఉండాలి
శ్రావణి, చక్రిలది కులాం తర వివాహం. ఈ కులాల అంతరం కూడా కుటుంబ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. మానవ సంబంధాల్లో కొరవడుతోన్న ప్రేమకి కులం కూడా కారణమవుతుందని అర్థం చేసుకోవాలి. కోడలు శ్రావణితో పాటు ఏ ఆధారం లేని తల్లికి కూడా కొడుకు ఆస్తిలో వాటా ఉండాలి.
 - సజయ, సామాజిక కార్యకర్త

మరిన్ని వార్తలు