పంచామృత ప్రవాహం

10 Feb, 2019 02:17 IST|Sakshi

సంగీత సాహిత్యం

ఒకానొకనాడు దక్షిణ భారతదేశం అంతటా సంగీతం ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే... కేవలం రాజులమీద పాటలు చెప్పడం... ఇంకా ఎంత హీనస్థితికి దిగజారిపోయిందంటే... రాజుల ప్రియురాళ్లు, ఆ స్థానాలలో నృత్యం చేసే రాజనర్తకులైన వాళ్లమీద పాటలు కట్టి రాజులు ఇచ్చే పడుపు కూడు తిని సంతోషించే స్థాయికి సంగీతకారులు వెళ్లిపోయారు. ఇది నాదోపాసన. ఇలా భ్రష్టుపట్టకూడదన్నది దైవ చింతన కాబోలు.ఇలాభోగం స్థలాభోగం–అని ఆ తిరువాయూరు చేసుకున్న అదృష్టమేమో గానీ అక్కడ ముగ్గురు వాగ్గేయకారులు ఒకే కాలంలో ఐదేసి సంవత్సరాల వ్యవధిలో జన్మించారు. వీరిలో మొదట జన్మించినవారు శ్యామ శాస్త్రిగారు. గొప్ప శ్రీవిద్యోపాసకుడు. అమ్మవారి దగ్గరకెళ్లి ఒక్కో  కీర్తన చేస్తుంటే... ఆ తల్లి బుగ్గలు ఎరుపెక్కిపోయి కొడుకుని చూసుకుని మురిసిపోయేదట. అటువంటి శ్యామ శాస్త్రిగారి దగ్గర పాదుకాంత దీక్ష పుచ్చుకున్న వారు ముత్తుస్వామి దీక్షితులు. వీరు మూడవవారు. మధ్యలో వారు త్యాగరాజు. 

త్యాగరాజు తల్లిదండ్రులు రామబ్రహ్మం, సీతాదేవి. వారికి మొదట ఇద్దరు కుమారులు జన్మించారు. వారిద్దరూ సమాజం నుండి ప్రశంసలందుకున్నవారు కాదు. అదే ఊరి కోవెలలో వెలిసి ఉన్న పరమేశ్వరుడిని త్యాగరాజుగా అక్కడి భక్తజనులు సేవిస్తుంటారు. పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే పుత్ర సంతానాన్ని కటాక్షిస్తే ‘నీ పేరు పెట్టుకుంటాం’ అని ఆ తల్లిదండ్రులు మొక్కుకునేవారు. ఆయన అనుగ్రహం కలిగి వారికి మూడవ సంతానంగా కుమారుడు కలిగితే ‘త్యాగరాజు’ అని పేరు పెట్టుకున్నారు. త్యాగరాజు పెరిగి పెద్దవాడవుతున్నాడు. తల్లికి సంగీతంలో ప్రవేశం ఉంది. ఆమె పురంధరదాసు, అన్నమయ్య  కీర్తనలు పాడుతుండేవారు. చిన్నతనం నుండీ త్యాగరాజు అమ్మ వెనకే తిరుగుతూ తను కూడా తల్లి గొంతుతో గొంతు కలిపి పాడుతుండేవాడు. అది తప్ప మరొక ధ్యాస ఉండేది కాదు.

అలా ఉండగా ఒకనాడు ఆయన ఒక కీర్తన రాశారు. అంటే కూర్చుని రాసింది కాదు. అమ్మ పాడుతూ ఉంటే, ఆ పాట విని ప్రేరణ పొంది, ఆ సీతారాముల పాదాలను మనసులో తలచుకోవడంవల్ల కలిగిన ఆనందం లోపల ఆగలేక.. నిండిపోయిన బిందె అంచుల వెంట నీరు కారిపోయినట్టు.. వారి నోటి వెంట అలవోకగా పంచామృత ప్రవాహమై ప్రవహించి కీర్తనయింది. అదే..‘రఘురామ...స్వామీ, నీకు జయమగుగాక..’. ఇదే ఆయన మొట్టమొదటి కీర్తన. ఆశ్చర్యపోయిన తండ్రి దానిని పండితులకు చూపితే, వారు కూడా మెచ్చుకోవడంతో ఎంత బంగారపు పళ్లెమయినా గోడ చేరుపు కావాలన్నట్లు ఒక గురువుగారి దగ్గర సుశిక్షితుడైతే బాగుంటుందనిపించి శొంఠి వేంకటరమణయ్య దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి పెట్టారు. అలా ఉండగా త్యాగరాజుకు కలిగిన ఆర్తి... ఆ పరమేశ్వరుడికి వినపడింది. సాక్షాత్తూ సంగీతంలో దిట్టయిన నారద మహర్షి రామకృష్ణానంద స్వామి రూపంలో వచ్చి ఆ పిల్లవాడికి రామ మంత్రాన్ని ఉపదేశించారు. బాల త్యాగరాజు ఎంత నిష్ఠగా చేసేవాడంటే.. రోజుకు లక్షా 25వేల సార్లు రామ మంత్రాన్ని జపం చేయడంతో శరీరమంతా మంత్రపుటమైపోయింది.
 
శొంఠి వేంకటరమణయ్య దగ్గర సంగీత పాఠాలు ఎంత అభ్యసించినా కొన్ని కొన్ని సార్లు అనేకానేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతుండేవి. దీనిని తీర్చడానికా అన్నట్లు రామకృష్ణానంద స్వామివారే మరల వచ్చి స్వరార్ణవమనే గ్రంథాన్ని ఆయనకు బహూకరించారు. అలా మరే ధ్యాస లేకుండా త్యాగరాజు సంగీత సాధన సాగింది.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు