ఈద్‌ స్ఫూర్తిని కొనసాగించాలి

9 Jun, 2019 02:59 IST|Sakshi

ఇస్లాం వెలుగు

‘ఈద్‌’ ముగిసి నాలుగు రోజులు గడిచి పొయ్యాయి. నెలరోజులపాటు ఆరాధనలు, సత్కార్యాలు, సదాచారాల్లో మునిగి తేలిన ముస్లిం సమాజం, తమకంతటి పరమానందాన్ని పంచిన పవిత్ర రమజాన్‌ మాసానికి ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే ఈద్‌ ముగియడంతోనే శుభాల పర్వానికి తెరపడకూడదు. రమజాన్‌ నెల్లాళ్ళూ మస్జిదులు ఏ విధంగా కళకళలాడాయో, అలాగే రమజాన్‌ తరువాత కూడా నమాజీలతో కళకళలాడేలా చూడాలి. రమజాన్‌లో కనిపించిన సేవాభావం, దాతృస్వభావం, న్యాయబద్దత, ధర్మశీలత, వాగ్దానపాలన, ప్రేమ, సోదరభావం, సహనశీలత, పరోపకారం, క్షమ, జాలి, దయ, త్యాగభావం రమజాన్‌ అనంతరమూ ఆచరణలో ఉండాలి. అసత్యం, అబద్ధం పలకకపోవడం, అశ్లీలానికి పాల్పడక పోవడం, చెడు వినకపోవడం, చూడకపోవడం, సహించకపోవడంతోపాటు, అన్నిరకాల దుర్గుణాలకు దూరంగా ఉండే సుగుణాలు నిరంతరం కొనసాగాలి.

తొలకరి జల్లుతో బీడువారిన పుడమి పులకించినట్లు, రమజాన్‌ వసంతాగమనంతో నైతిక వర్తనంలో, ఆధ్యాత్మిక ప్రగతిలో గణనీయమైన వృద్ధీవికాసాలు జరిగాయి. అనూహ్యమైన మానవీయ పరివర్తనకు బీజం పడింది. ఇప్పుడది నిలబడాలి, నిరంతరం కొనసాగాలి ఈ వృద్ధీ వికాసాలు ఒక్క నెలకే పరిమితం కాకూడదు. మనిషిని మనీషిగా మార్చడానికే ఈ శిక్షణకు ఏర్పాటు చేసింది ఇస్లాం. నిజానికి ఇస్లాం బోధనలు చాలా సరళం, సంపూర్ణం, సమగ్రం, స్పష్టం, స్వచ్ఛం, నిర్మలం. మానవులు వీటిని ఆచరిస్తే, అనుసరిస్తే నైతిక, ఆధ్యాత్మిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాలన్నిటినీ సమన్వయ పరచగలరు. వీటిమధ్య ఒక సమతుల్యతను సాధించగలరు. ఈ రంగాలన్నింటా దైవాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా ప్రతి పనినీ ఆరాధనగా మలచుకోగలరు.

మానవుల ప్రతి పనినీ ఆరాధనా స్థాయికి చేర్చిన ధర్మం ఇస్లాం. అందుకే పవిత్ర రమజాన్‌ నెలలో వారి శిక్షణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ధర్మం. ఇక దాన్ని సద్వినియోగం చేసుకోవడమైనా, దుర్వినియోగం చేసుకోవడమైనా మన చేతుల్లోనే ఉంది. అందుకని రమజాన్‌ స్పూర్తిని కొనసాగించాలి. అప్పుడే రోజాల ఉద్దేశ్యం నెరవేరుతుంది. పండుగ ఆనందానికి పరమార్ధం చేకూరుతుంది. భావిజీవితాలు సుఖ సంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తుంది. దోపిడీ, పీడన, అణచివేత, అసమానతలు లేని చక్కని ప్రేమపూరితమైన సుందరసమాజం ఆవిష్కృతమవుతుంది.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు