మటన్‌ ఫ్రై...మటన్‌ కుర్మా

7 Sep, 2019 08:21 IST|Sakshi

నాన్‌ వెజ్‌ వంటకాలు

మటన్‌ ఫ్రై
కావలసినవి:
మటన్‌ – 500 గ్రా.; కొబ్బరిపొడి – 150 గ్రా.; ఉల్లిపాయలు – 10 (చిన్నముక్కలుగా తరగాలి);పచ్చిమిర్చి– 5 (సన్నగా తరగాలి); లవంగాలు – 4,; దాల్చినచెక్క – చిన్న ముక్క; ఏలకులు – 4,;బిర్యానీ ఆకులు – 2; మిరప్పొడి – 4 టీ స్పూన్లు; దనియాల పొడి – నాలుగు టీ స్పూన్లు;పసుపు – టీ స్పూను; పచ్చిమిర్చి – రెండు (నిలువుగా చీరాలి గార్నిష్‌ కోసం); సన్నగా తరిగిన కొత్తిమీర – కప్పు; మెంతి ఆకు – 50 గ్రా.; నూనె – మూడు టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత;

తయారి: మటన్‌ను శుభ్రం చేయాలి. పాత్రలో నూనె వేడిచేసి గరం మసాలా దినుసులన్నీ వేసి వేగిన తరవాత ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నమంట మీద మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరవాత పచ్చిమిర్చి ముక్కలు,మెంతి ఆకులు, మిరప్పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పువేసి బాగా కలపాలి. ఇప్పుడు మటన్‌ వేసి కలిపి సన్నమంట మీద ఉడకనివ్వాలి. మధ్యలో రెండు నిమిషాలకొకసారి కలియబెట్టి మూత పెడుతుండాలి. మాంసం ముక్క మెత్తబడిన తరవాత కొబ్బరిపొడి వేసి పది నిమిషాల పాటు దమ్‌ మీదఉడికించాలి. చివరగా కొత్తిమీర, పచ్చిమిర్చితో గార్నిష్‌ చేసి వడ్డించాలి.

మటన్‌ కుర్మా
కావలసినవి:మటన్‌ ముక్కలు – కేజీ; ఉల్లిపాయలు – 4 (సన్నగా తరగాలి); పెరుగు – 3 కప్పులు; కారం – 2 టేబుల్‌ స్పూన్లు; ధనియాల పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; పసుపు – టీ స్పూన్‌; జీలకర్ర పొడి – పావు టీ స్పూన్‌; లవంగాలు – 5; ఏలకులు (పచ్చవి) – 6; దాల్చినచెక్క – అంగుళం; కుంకుమపువ్వు – కొన్నిరేకలు; ఉప్పు – తగినంత; అల్లం పేస్ట్‌ – టీ స్పూన్‌; వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌; నూనె – కప్పు నెయ్యి – అర కప్పు; ఫ్రెష్‌ క్రీమ్‌ – 2 టేబుల్‌ స్పూన్లు;

తయారి: పాన్‌లో నూనె వేసి, ఉల్లిపాయలను గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి. బాగా వేగిన ఉల్లిపాయ ముక్కలను కిచెన్‌ పేపర్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఉల్లిపాయముక్కలు క్రిస్పీగా తయారయ్యాక వాటిని మిక్సర్‌లో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. అదే పాన్‌లో మరికొంచెం నూనె వేసి మటన్‌ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ కలిపి, ఆరు నిమిషాలు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. దీంట్లో కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు,నల్లమిరియాల పొడి, ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్రపొడి, పెరుగు, రెండుకప్పుల నీళ్లు కలిపి అరగంట సేపు సన్ననిమంట మీద ఉడికించాలి. ఉల్లిపాయ పొడి వేసి కలపాలి. ముక్క ఉడికి, నూనె పైకి తేలుతునప్పుడు కుంకుమపువ్వు, ఫ్రెష్‌ క్రీమ్, నెయ్యి కలిపి మూత పెట్టి మరో పదిహేను నిముషాలు ఉడికించాలి. దించేముందు కొత్తిమీర చల్లుకోవాలి. నోరూరించే మటన్‌ కుర్మాను వేడి వేడిగా నాన్‌లేదా చపాతీలోకి వడ్డించాలి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా