టూకీగా ప్రపంచ చరిత్ర - 62

16 Mar, 2015 00:36 IST|Sakshi

రచన: ఎం.వి.రమణారెడ్డి
 జాతులు నుడికారాలు
ఇక, భాష విషయానికి వస్తే - భూగోళం మీద మానవుని విస్తరణ జాతిమూలాలకు కారణమైనట్టే, అదే విస్తరణ భాషాభేదాలకు గూడా కారణమయింది. పరిమితమైన పదాలు తప్ప, విస్తృతమైన భాషతో ఆదిమమానవునికి అవసరం కలిగుండదు. కొత్తతావులకు చేరుకున్నప్పుడు అక్కడ కనిపించే కొత్తరకం చెట్టూ చేమా, జంతువులూ, వేటాడే విధానంలో మార్పులూ, ఆయుధాల ఆధునీకరణా మొదలైన అంశాలనేకం క్రమక్రమంగా మాటల సంఖ్యలను పెంచుకునేందుకు దోహదం చేశాయి.

విడతవిడతకూ ఏ గుంపుకాగుంపు, పుట్టినచోటును వదిలేసి తిరిగిరాలేనంత దూరాలకు చేరుకోవడంతో, ఒక చోట పుట్టిన మాటలు మరొకచోటికి చేరుకునే అవకాశం లేక, నుడికారంలో పోల్చుకోలేనంత పెద్ద ఎత్తున వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి.
 ఉదాహరణకు - ‘జలపాతం’ అనే దృశ్యం ఎక్కడబడితే అక్కడ కనిపించేది కాదు. దాని పరిసరాలకు చేరుకున్న గుంపుకు మాత్రమే ఆ దృశ్యాన్ని తమలో తాము వ్యవహరించుకునేందుకు కొత్త మాటను సృష్టించుకోవలసిన అగత్యం ఏర్పడుతుంది.
 
పదహారవ శతాబ్దంలోనో అంతకుముందో పుట్టిన పాశ్చాత్య రచనల్లో ‘పులి’ అనే జంతువు ప్రస్తావనగానీ, ఆ మాటకు సమానార్థకమైన మరో మాటగానీ మనకు కనిపించదు. ఎందుకంటే, ఆ ప్రాంతాల్లో ఆ జంతువు లేదుగాబట్టి.  పులిని భారత ఉపఖండంలో చూసిందాకా అక్కడివాళ్ళకు దాన్ని గురించి తెలీనేతెలీదు.
 
పదహారవ శతాబ్దంలోనో అంతకుముందో పుట్టిన పాశ్చాత్య రచనల్లో ‘పులి’ అనే జంతువు ప్రస్తావనగానీ, ఆ మాటకు సమానార్థకమైన మరో మాటగానీ మనకు కనిపించదు. ఎందుకంటే, ఆ ప్రాంతాల్లో ఆ జంతువు లేదుగాబట్టి. అందుకే వాళ్ళ సాహిత్యంలో శౌర్యానికి ప్రతీకగా ‘సింహం’ కనిపిస్తుంది. పులిని భారత ఉపఖండంలో చూసిందాకా అక్కడివాళ్ళకు దాన్ని గురించి తెలీనేతెలీదు. అంతేగాదు, రుగ్వేదంలోనూ ‘పులి’ కనిపించదు. ఆర్యులు సింధూనది పరిసరాలకు చేరుకున్న తరువాత ఉద్భవించిన వాఙ్మయంలో మాత్రమే ‘వ్యాఘ్రం’ అనే పదం కనిపిస్తుంది. సాహిత్యపరంగా మనకు సింహం తెలిసుండొచ్చుగానీ, ఆ జంతువు ఈ ప్రాంతాల్లో లేదు. అందుకే తెలుగులో ఇప్పటికీ ‘పులిబిడ్డ’ అనే మాటే శౌర్యానికి ప్రతీకగా కొనసాగుతూంది. ‘కొదమసింహం’, ‘సింగపుకూన’ అనేవి అరువు తెచ్చుకున్న ప్రయోగాలు.
 
భాష సాహిత్యంగా ఎదిగి, ఆ సాహిత్యం అన్నిచోట్లకు చేరుకోవడం మొదలైన తరువాత రకరకాల దృశ్యాలూ, పలురకాల సంఘటనలూ, వాటి సంబంధించిన వర్ణనలూ మానవాళి ఆలోచనకు చేరువై, ఊహల్లో ఇమిడిపోయిన తరువాతి తరాలకు ఇంతదాకా చెప్పిందంతా చోద్యంగా కనిపించొచ్చు. ‘జలపాతం’ దృశ్యాన్ని మెదడులో ఇమిడించుకోవడం మినహా, దాన్ని కంటితో చూడని జనాలు ఈనాటికీ కోట్లల్లో మిగిలున్నారని తెలుసుకుంటే ఆ విడ్డూరం తొలగిపోతుంది. రేడియో, సెల్‌ఫోన్, టీవీ వంటి పదాలకు ఆయా వస్తువులు ఉనికిలోకి వచ్చిన తరువాత మాత్రమే భాషలో చోటు ఏర్పడింది తప్ప, అవి లేకుండా ఆ మాటలు పుట్టుకురాలేదు.
 
జాతులు పుట్టుకనూ, భాషల్లోని వ్యత్యాసాలూ పోలికలనూ చెప్పుకుంటూపోతే ఎంత దూరమైన సాగుతుందిగానీ, ఇప్పుడు మనకు అవసరమయింది చరిత్రను తెలుసుకునేందుకు చాలినంత ప్రాథమిక అవగాహనే కాబట్టి, ఈ చర్చను ప్రస్తుతానికి ఆపేద్దాం. మరింత లోతైన పరిశీలనకు ఉత్తరోత్తరా అవసరం ఏర్పడితే, తతిమ్మా వివరాలు అప్పుడు తెలుసుకుందాం.

మరిన్ని వార్తలు