నా వయసు 32 ఏళ్లు పీరియడ్స్ సక్రమంగా ...

19 Jul, 2016 22:47 IST|Sakshi
నా వయసు 32 ఏళ్లు పీరియడ్స్ సక్రమంగా ...

హోమియో కౌన్సెలింగ్
 
నా వయసు 32 ఏళ్లు. నేను ఈ మధ్య బరువు పెరుగుతున్నాను. నా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్‌హెచ్ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో మందులు ఉన్నాయా? - సునీత, హైదరాబాద్
మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్ అనేది మానవ శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో  బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. హైపోథైరాయిడిజమ్ ఏ వయసులోని వారికైనా రావచ్చు. స్త్రీలలో, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. శిశువుల్లో క్రెటినిజం అనే ఒక రకమైన హైపోథైరాయిడిజమ్ వస్తుంది.
 థైరాయిడిజమ్ నుంచి తగినంత మోతాదులో హార్మోన్ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. అయోడిన్ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్ సమస్య వస్తుంది.

లక్షణాలు:  బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం  జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం, మలబద్దకం  గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి   కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి  రుచి, వాసన, స్పర్శ తగ్గడం  సంతానలేమి, నీరసం, డిప్రెషన్.
 
నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్.
 
చికిత్స: హైపోథైరాయిడిజమ్ సమస్యను అదుపు చేసే ఔషధాలు హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు.
 
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి  ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి హైదరాబాద్
 

ఇప్పటికే రెండుసార్లు హార్ట్ ఎటాక్...
కార్డియాలజీ కౌన్సెలింగ్

మా నాన్నగారి వయసు 54 ఏళ్లు. ఆర్నెల్ల క్రితం హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పుడు యాంజియోగ్రామ్ చేయించి, రెండు స్టెంట్స్ వేయించి, మందులు వాడుతున్నాం. కొద్దిరోజుల క్రితమే మళ్లీ తీవ్రమైన గుండెపోటు వచ్చింది. మరోసారి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మా నాన్న గుండెకు సంబంధించిన మూడు ప్రధాన రక్తనాళాలు పూర్తిగా బ్లాక్ అయ్యాయని, అలాగే ప్రధానమైన ‘లెఫ్ట్ వెంట్రికిల్’ కూడా చాలావరకు దెబ్బతిని బ్లాక్ అయ్యిందని తెలిపారు. దాంతో మేము ఆందోళనకు గురవుతున్నాం. సాధారణంగా మూడోసారి హార్ట్ ఎటాక్ వచ్చిందంటే మనిషి మీద ఆశ వదులుకోవాల్సిందేనని అంటుంటారు. మా నాన్నగారికి ఇప్పటికే రెండుసార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది కాబట్టి మాకు తగిన సలహా ఇవ్వగలరు.  - రవికుమార్, నిజామాబాద్
మూడోసారి హార్ట్ ఎటాక్ వస్తే ప్రాణాలకే ముప్పు అనే అపోహే చాలామందిలోనూ ఉంటుంది. కానీ వాస్తవం ఏమిటంటే గుండె స్వతహాగా పనిచేసే స్థితిలో ఉందంటే దాన్ని కాపాడుకునే అత్యాధునిక వైద్యవిధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక విషయం వివరించాలి. ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత మరోసారి గుండెపోటు అనేది సాధారణంగా రాదు. ఒకవేళ స్టెంట్ వేసిన తర్వాత మరోసారి గుండెపోటు రావడం సాధారణంగా జరగదు. ఒకవేళ పేషెంట్ పొగతాగడం లేదా మద్యం తీసుకోవడం వంటి దురలవాట్లను కొనసాగిస్తున్నా లేదా ఆహారపు అలవాటు జాగ్రత్తల విషయంలో వైద్యుల సూచనల మేరకు నడుచుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించినా ఇలాంటి విపరీతమైన పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. మీ నాన్నకు రెండుసార్లు హార్ట్ ఎటాక్... అది కూడా చాలా తక్కువ సమయంలో రావడంతో గుండె పనిచేయలేని స్థితికి చేరుకుందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ‘హార్ట్ ఫెయిల్యూర్’ అంటారు. హార్ట్ ఎటాక్ తర్వాత గుండెకు సంబంధించిన మూడు ప్రధాన రక్తనాళాలు పూర్తిగా దెబ్బతినడంతో ఆ బ్లాక్ అలాగే వృద్ధి చెంది స్కార్‌లా ఏర్పడి... మీ నాన్నగారికి ‘హార్ట్ ఫెయిల్యూర్’ స్థితి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి కేసుల్లో ఒక్కొక్కసారి గుండె దాదాపుగా ఆగిపోయే స్థితిని కూడా ఎదుర్కోవచ్చు. అలాంటిప్పుడు పరిస్థితి మరింత చేయిదాటిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ మీ నాన్నగారి లాంటి వాళ్ల గుండె, ఊపిరితిత్తులను మొదట స్టెబిలైజ్ చేయాల్సి  ఉంటుంది.

ఆ తర్వాత గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సకు సిద్ధం చేయాలి. పేషెంట్ బతికేందుకు తక్కువ అవకాశాలే ఉన్నప్పటికీ వైద్యశాస్త్రంలోని అత్యాధునిక చికిత్స ప్రక్రియలలో ‘ఎంటార్ట్ ఇరెక్టోమీ’ విత్ ‘లెఫ్ట్ వెంట్రిక్యులార్ రిపేర్’ వంటి అత్యాధునికమైన శస్త్రచికిత్స విధాలను అవలంబించి హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కొన ఊపిరితో ఉన్నవారిని సైతం దక్కించుకునే అవకాశాలు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. వాటితో పేషెంట్ గుండెలోని ప్రధాన రక్తనాళాల్లో పూడికనూ తొలగించవచ్చు. దాంతో వారం పది రోజుల్లోనే గుండె సాధారణ స్థితికి వచ్చి మామూలుగా పనిచేయడం మొదలవుతుంది. కాబట్టి మీరు భయాందోళనలు పెట్టుకోకుండా నిపుణులైన కార్డియోథొరాసిక్ సర్జన్ ఉన్న ఆసుప త్రిలో మీ నాన్నగారికి చికిత్స అందిస్తూ, నిపుణుల సూచనలను తప్పక పాటించండి.
 
డాక్టర్  పి.వి. నరేశ్ కుమార్
సీనియర్ హార్ట్‌ట్రాన్స్‌ప్లాంట్ అండ్ కార్డియో థొరాసిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్
 
 

మరిన్ని వార్తలు