నా కూతురి కేసులో అసలు తీర్పే రాలేదు

7 Dec, 2019 02:15 IST|Sakshi
ప్రత్యూష తల్లి సరోజినీదేవి

పదిహేడేళ్లుగా ప్రత్యూష తల్లి

ప్రత్యూష ఉదంతం 2002, ఫిబ్రవరిలో జరిగింది. పదిహేడేళ్లు పూర్తయ్యాయి. న్యాయం కోసం పోరాటం సాగుతూనే ఉంది. న్యాయం ఎప్పటికి వస్తుందో తెలియదు. కేసు సుప్రీం కోర్టులో డబుల్‌ బెంచ్‌లో ఉంది. ఈ ఏడాది మేలో ఒకసారి బెంచ్‌ మీదకు వచ్చింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి తరఫు న్యాయవాది మరణించడంతో మరికొంత జాప్యం చోటు చేసుకుంది. మళ్లీ టేబుల్‌ మీదకు ఎప్పుడు వస్తుందోనని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఎదురు చూస్తున్నారు. ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ‘సాక్షి’ ఆమెను పలకరించింది.

‘‘దిశ సంఘటనలో చోటు చేసుకున్న పరిణామాలు చూసినప్పుడు కడుపుకోతకు గురైన మాలాంటి తల్లులకు మాత్రం ఇదే సరైంది... అనిపిస్తుంది. ‘దుష్ట శిక్షణ జరిగింది’ అనే భావన మహిళలకు మనోనిబ్బరాన్నిచ్చింది కూడా. కానీ శిక్ష ఎప్పుడూ న్యాయపరిధిలోనే ఉండాలి. ఇలాంటి కేసుల్లో శిక్ష ఎప్పుడూ కఠినంగానే ఉండాలి. మరొకరు నేరానికి పాల్పడేటప్పుడు శిక్ష గుర్తుకు వచ్చి భయపడేలా ఉండాలి. దిశ సంఘటన జరిగిన ఈ కొద్ది రోజుల్లోనే నిందితులు సమాధి అవుతున్నారు. ఆమె ఆత్మ శాంతించి ఉంటుంది. అలాంటి శాంతి ప్రత్యూష ఆత్మకు ఎప్పుడు కలుగుతుందో ఏమో? నిర్భయ కేసులో న్యాయస్థానం సత్వరం స్పందించి తీర్పునిచ్చింది. కానీ ఆ తీర్పును అమలు చేయడంలో జాప్యం చేస్తోంది.

ప్రత్యూష కేసులో ఇంకా తుది తీర్పు వెలువడనే లేదు. ఎప్పుడైనా సరే... ఒక ఆడపిల్ల విషయంలో... అది కూడా అత్యాచారం హత్య జరిగినప్పుడు న్యాయస్థానాలు వీలయినంత త్వరగా విచారణ పూర్తి చేసి తీర్పునివ్వాలి. ఆలస్యం జరిగే కొద్దీ కేసు తీవ్రత తగ్గిపోతుంటుంది. కేసు పలుచబడిపోతుంటుంది. అవకాశవాదుల చేతుల్లో సాక్ష్యాలు తారుమారయిపోతుంటాయి. దాంతో శిక్షలు నామమాత్రంగా మారిపోతుంటాయి. సిద్ధార్థ కేసులో కూడా ఒక కోర్టు విధించిన శిక్షను∙మరొక కోర్టు తగ్గించింది. విచారణ ఆలస్యం జరగడం కూడా ఇందుకు ఒక కారణమే. తొమ్మిది నెలల పాపాయి మీద అత్యాచారం చేసిన నిందితుడికి ఒక కోర్టు మరణ శిక్ష విధిస్తే, పై కోర్టు ఆ శిక్షను సవరించి జీవితఖైదుగా మార్చింది.

ఈ సందర్భంగా నాది మరొక విన్నపం. ఆడపిల్లలకు అన్యాయం జరిగిన కేసుల విషయంలో న్యాయవాదులు స్వీయ నియంత్రణ పాటించాలి. అమ్మాయి మీద అత్యాచారం జరిగిందనేది వాస్తవం, హత్య జరిగిందనేది వాస్తవం. నిందితుల తరఫున వాదిస్తూ రెండు వాస్తవాలను అవాస్తవాలుగా నమ్మించే ప్రయత్నం చేసే ముందు దయచేసి ఒక్కసారి ఆలోచించండి. న్యాయవాదులందరూ కలిసి మన చట్టాలను పటిష్టం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మాలాంటి బాధిత కుటుంబాలకు న్యాయపోరాటంలో ప్రభుత్వం కూడా అండగా ఉండాలి. బలవంతులతో న్యాయపోరాటం చేయాల్సి వచ్చినప్పుడు బలహీనులు అడుగడుగునా ఎదురీదాల్సి వస్తోంది. అందుకు నేనే ఉదాహరణ’’.
 

 

మరిన్ని వార్తలు