నా స్నేహితుల జాబితా చాలానే ఉంది - ‘అల్లరి’ నరేష్

4 Aug, 2013 02:18 IST|Sakshi
నా స్నేహితుల జాబితా చాలానే ఉంది - ‘అల్లరి’ నరేష్

కుల మతాలకు అతీతంగా స్నేహం చేయాలనేది నా ఫీలింగ్. నా అదృష్టమో ఏమో కానీ నా స్నేహితుల జాబితా చాలానే ఉంది. శ్రీకాంత్, నాని, తరుణ్, శర్వానంద్, కళ్యాణ్‌రామ్, ఉదయ్‌కిరణ్, నితిన్, నిఖిల్, ఖయ్యుమ్, రింకు కుర్‌కురేజా, చైతన్య.. ఇలా బోల్డంత మంది. అయితే సుదీర్ఘ స్నేహం మాత్రం ఖయ్యూమ్, ముద్దుకృష్ణ, రింకుతోనే అని చెప్పాలి. స్నేహం అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది ముద్దుకృష్ణే. నిర్మాత జయకృష్ణగారబ్బాయి తను. చెన్నయ్‌లో మేమిద్దరం టెన్త్ వరకు కలిసి చదువుకున్నాం.

మేం హైదరాబాద్ షిఫ్ట్ అయిన కొన్నాళ్లకు వాళ్లు కూడా ఇక్కడికొచ్చేశారు. గోల్డెన్‌స్పూన్‌తో పుట్టాడు ముద్దుకృష్ణ. అయితే తను పుట్టిన తర్వాత తన తండ్రికి కలిసి రాలేదని ఎప్పుడూ బాధపడుతుండేవాడు. రోజులెప్పుడూ ఒకేలా ఉండవని నచ్చజెబుతుండేవాణ్ణి. కానీ, దానిగురించే ఎప్పుడూ బాధపడేవాడు. ఆ బాధ ప్రాణం తీసుకునే స్థాయిలో ఉంటుందని మాత్రం ఊహించలేదు. ఆ రోజు ‘బ్లేడ్ బాబ్జీ’ షూటింగ్‌లో ఉన్నాను. అర్జంట్‌గా కలవాలన్నాడు. పదింటికి షూటింగ్ అవుతుంది, వస్తానని మెసేజ్ పెట్టాను. కానీ షూటింగ్ పూర్తవ్వడానికి రాత్రి రెండయ్యింది. దాంతో ఇంటికెళ్లిపోయాను. మర్నాడు పదకొండు గంటలకి ముద్దుకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని విని, షాకయ్యాను.

సూసైడ్ నోట్‌లో ‘‘నేనెవరికీ ఏమీ చెప్పను. కానీ, అన్ని విషయాలూ షేర్ చేసుకునే నరేష్‌తో ఈ నిర్ణయం గురించి చెప్పలేకపోయినందుకు ‘సారీ’ చెబుతున్నా’’ అని రాశాడు. తను లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. ఇక నా మరో స్నేహితుడు ఖయ్యూమ్ (అలీ సోదరుడు)  గురించి చెప్పాలంటే... చెన్నయ్‌లో మా ఇల్లు, అలీగారిది పక్క పక్కనే. ‘అప్పుల అప్పారావు’    అప్పుడు ఖయ్యూమ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. అది మంచి స్నేహంగా మారింది. మేమిద్దరం కలిసి ‘ఏవండీ ఆవిడొచ్చింది’ సినిమాలో చేశాం. నేనే నిర్ణయం తీసుకోవాలన్నా పదిసార్లు ఆలోచిస్తా.

అన్నింటికీ టెన్షన్ పడిపోతుంటాను. కానీ ఖయ్యూమ్ మెంటల్‌గా చాలా స్ట్రాంగ్. జీవితం ఎలా మలుపు తిరిగితే అలా వెళ్లిపోవాలని తనని చూసి నేర్చుకున్నాను. గతం గతః, ఇవాళ ఏంటి? అని ఖయ్యూమ్ ఆలోచించే విధానం నాకెంతో నచ్చుతుంది. అలాగే రింకూ గురించి చెప్పాలి. రింకూ పూర్తి పేరు రింకు కజ్రేకర్. సర్దారీలన్నమాట. చెన్నయ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత సినిమా నేపథ్యంలేని వ్యక్తుల్లో మొదటగా పరిచయం అయ్యింది రింకూతోనే. వాళ్లది ఉమ్మడి కుటుంబం. ఎప్పుడైనా ఇంటికెళితే ఫుడ్ పెట్టి చంపేస్తారు (నవ్వుతూ). కడుపులో ఖాళీలేదన్నా ఊరుకోరు. అంత ప్రేమగా ఉంటారు.

ఉమ్మడి కుటుంబం ఎంత బాగుటుందో రింకువాళ్ల ఫ్యామిలీని చూసినప్పుడు తెలిసింది. వారానికి మూడుసార్లయినా మేమిద్దరం కలుస్తాం. చైతన్య విషయానికొస్తే.. తనతో నా స్నేహం ఎనిమిదో తరగతి నుంచి సాగుతోంది. చైతూవాళ్లది కూడా చెన్నయే. ఇప్పుడు హైదరాబాద్‌లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో జాబ్ చేస్తున్నాడు తను. నేను బాగా నమ్మదగ్గ స్నేహితుల్లో తనొకడు. ఇక శ్రీకాంత్, నాని, తరుణ్, శర్వానంద్, కళ్యాణ్‌రామ్, ఉదయ్‌కిరణ్, నితిన్, నిఖిల్ గురించి చెప్పలేదనుకోవద్దు. వాళ్లు కూడా నా బెస్ట్‌ఫ్రెండ్సే. ఎనీ టైమ్ ఎనీ ప్లేస్.. నాకు తగినంత సపోర్ట్ ఇచ్చేంత మంచి స్నేహితులు వీళ్లు. అయితే ఖయ్యుమ్, ముద్దుకృష్ణ, రింకు, చైతూతో సుదీర్ఘ స్నేహం ఉంది కాబట్టి వాళ్ల గురించి చెప్పా. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఎంత  ధనవంతుడికైనా ఒక్క స్నేహితుడు కూడా లేకపోతే ఆ జీవితం కచ్చితంగా వెలితిగానే ఉంటుంది.
 

మరిన్ని వార్తలు