చిన్నపిల్లల్లోనూ మూత్రపిండాలలో రాళ్లు..?

20 Nov, 2013 23:38 IST|Sakshi
చిన్నపిల్లల్లోనూ మూత్రపిండాలలో రాళ్లు..?

మీరు చెప్పిన లక్షణాలను, సమాచారాన్ని బట్టి మీ అబ్బాయికి కిడ్నీలో రాళ్లు (నెఫ్రోలిథియాసిస్) ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్దవాళ్లతో పోలిస్తే ఈ కండిషన్ చిన్నపిల్లల్లో అంత సాధారణం కానప్పటికీ, ఇది అరుదైన విషయం మాత్రం కాదు. పిల్లల కిడ్నీల్లో రాళ్లు తయారుకావడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా కొన్ని జన్యుపరమైన అంశాలు ఇందుకు దోహదపడుతుంటాయి. పిల్లలు తీసుకునే ఆహారం, వాతావరణం, ఆర్థిక-సామాజిక పరిస్థితులు, ఎండోక్రైనల్ సమస్యల వంటివి కూడా ఇందుకు కారణాలే. ఇక పదహారేళ్లలోపు పిల్లల్లో 5 నుంచి 6 శాతం మందిలో కిడ్నీలో రాళ్లు కనిపిస్తుంటాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక పిల్లల్లో తరచూ మూత్రసంబంధ (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్స్ వస్తున్న సందర్భాల్లో... మూత్రపిండాల్లో రాళ్లకు అది ఒక ప్రధాన కారణమవుతుంది.
 
 పిల్లల కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు కడుపునొప్పి, మూత్రంలో రక్తం, కొన్నిసార్లు జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.
 
 ఈ రాళ్లలోనూ క్యాల్షియం కార్బొనేట్, ఆక్సలేట్స్, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్, స్ట్రువైట్ స్టోన్, సిస్టీన్ వంటి అనేక రకాలుంటాయి.
 
 పిల్లల కిడ్నీలో రాళ్లు కనిపించినప్పుడు వారిలో ఏవైనా జీవక్రియలకు సంబంధించిన లోపాల (మెటబాలిక్ డిజార్డర్స్) వంటివి ఉన్నాయా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
 
 ఈ కండిషన్‌ను నిర్ధారణ చేయడానికి రొటీన్ మూత్రపరీక్షలు, రీనల్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ స్కాన్‌తో పాటు కొన్ని మెటబాలిక్ పరీక్షలు చేయించడం అవసరం.
 
 రీనల్ స్కాన్, మెటబాలిక్ పరీక్షల ద్వారా రాయి తాలూకు రసాయన స్వభావం తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే దానిపైనే ఆ తదుపరి చికిత్స ఆధారపడి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ రాయి పరిమాణం చిన్నదిగా ఉంటే దానంతట అదే మూత్రంతో పాటు పడిపోతుంది. ఇలాంటి పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగడం, పొటాషియం పాళ్లు ఎక్కువగా ఉండే ద్రవాహారాలు తీసుకోవడం, కొవ్వులు ఎక్కువగా, పిండిపదార్థాలు తక్కువగా ఉంటే కీటోజెనిక్ ఆహారానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒకవేళ వారిలో మూత్రసంబంధమైన (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే చికిత్స చేయించడం, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరిమితం గా తీసుకోవడం, ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించడం వంటి జాగ్రత్తలను పాటించాలి. ఇక ఉప్పు తక్కువగా తీసుకోవడం అవసరం. అలాగే ఉప్పు పాళ్లు ఎక్కువగా ఉండే చిప్స్, పచ్చళ్లు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే పాల ఉత్పాదనలు, మాంసాహారం, చీజ్ వంటి ఆహారాలను బాగా తగ్గించాలి.
 
 మీ అబ్బాయి విషయానికి వస్తే... అది ఎలాంటి రాయి అన్నది మనకు తెలియదు కాబట్టి దాని రసాయన స్వభావాన్ని తెలుసుకోవడం కోసం అవసరమైన పరీక్ష చేయించాలి. అలాగే ఎవరిలోనైనా రాయి పరిమాణం పెద్దదిగా ఉండి, అది దేనికైనా అడ్డుపడటం వల్ల కనిపించే లక్షణాలను కనబరుస్తుంటే దాన్ని శస్త్రచికిత్స లేదా షార్ట్‌వేవ్ లిథోట్రిప్సీ ప్రక్రియ ద్వారా తొలగింపజేసుకోవాలి.
 
 మీరు పైన పేర్కొన్న వివరాలను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మూత్రపిండాల్లో రాళ్లు మళ్లీ మళ్లీ కనిపిస్తుంటే మాత్రం తప్పనిసరిగా దాని రసాయన స్వభావాన్ని అధ్యయనం చేయించి, అలాంటి రాయి పెరుగుదలను ప్రేరేపించే ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
 
 మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ నెఫ్రాలజిస్ట్‌ను గాని యూరాలజిస్ట్‌ను గాని సంప్రదించండి.  


 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
 స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు