తెలివైనవాడే కానీ జ్ఞాపకశక్తి తక్కువ..?

5 Oct, 2013 00:12 IST|Sakshi
తెలివైనవాడే కానీ జ్ఞాపకశక్తి తక్కువ..?

మా బాబుకు ఏడేళ్లు. సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. వాడు బుద్ధిమంతుడే కానీ, స్కూల్‌లో ప్రతి చిన్న విషయం మర్చిపోతుంటాడని, చిన్న చిన్న పదాలకు కూడా ఎన్నిసార్లు చెప్పినా స్పెల్లింగ్స్ సరిగా రాయడని, బోర్డ్ మీద రాసిన వాటిని నోట్ చేసుకోమంటే నోట్ చేసుకోడని పేరెంట్స్ మీటింగ్స్‌లో టీచర్స్ కంప్లైంట్ చేస్తుంటారు. వాడు తెలివైనవాడే, వీడియో గేమ్స్ బాగా ఆడతాడు. అన్ని విషయాల్లోనూ యాక్టివ్‌గానే ఉంటాడు. మరి ఇలా ఎందుకు జరుగుతోందో మాకు అర్థం కావడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
 - బిందుమాధవి, హైదరాబాద్


మీ అబ్బాయిది  నిజానికి అసలు పెద్ద సమస్య కానే కాదు. దీనిని ఒక స్పెషల్ కేస్ కింద పరిగణించవలసి ఉంటుంది. ఇతరత్రా ఏవైనా మానసిక సమస్యలుంటే తప్ప సాధారణంగా ఈ వయసు పిల్లలలో మతిమరపు తలెత్తే అవకాశమే లేదు. మీరు చెబుతున్న దానిని బట్టి మీ బాబులో ఐక్యూకి సంబంధించి కానీ, తెలివితేటలకు సంబంధించి కానీ ఎటువంటి సమస్యలూ లేవు. ఉన్నదల్లా ఎడిడి అంటే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్. చెప్పే సమయంలో సరిగా వినకపోవటం, వారి మాటల మీద ఆసక్తి చూపించకపోవటం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి.

ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేక తల్లిదండ్రులు వారిని ‘మొద్దబ్బాయి’ అని పిలవడం, దండించడం వంటివి చేస్తుంటారు. దానివల్ల నిజంగానే వారు తమను తాము మందకొడివారిగా, తెలివి తక్కువ వారిగా భావించుకుని, ఒక్క చదువు విషయంలోనే కాకుండా మిగతా అన్ని విషయాల్లోనూ వెనకడుగు వేస్తూ, స్తబ్దుగా ఉండిపోతారు. దాంతో భవిష్యత్తులో అది ఎన్నో రకాల ఇతర సమస్యలకు దారితీస్తుంది.
 
మీరు మీ బాబు విషయంలో ఆందోళన చెందనవసరం లేదు. వైద్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత దశలో అన్ని విధాలైన సమస్యలకూ మంచి వైద్యవిధానాలు, చికిత్సా విధానాలు ఉన్నాయి. మీరు వెంటనే మీ బాబును అనుభవజ్ఞుడైన చైల్డ్ సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లి, ఐక్యూ, మెమరీ, కాన్‌సన్‌ట్రేషన్ టెస్ట్ చేయించండి. ఆ రిపోర్ట్‌ల ఆధారంగా మానసిక వైద్యుడు బాబుకు తగిన కౌన్సెలింగ్, శిక్షణ ఇస్తారు.
 
 డాక్టర్ కల్యాణ్
 సైకియాట్రిస్ట్,
 మెడిసిటీ హాస్పిటల్స్,
  సెక్రటేరియట్ రోడ్,  హైదరాబాద్

 

మరిన్ని వార్తలు