పంటశాలలు

29 Jul, 2019 08:43 IST|Sakshi
స్కూల్‌ ఆవరణలో ఆర్గానిక్‌ ఫార్మింగ్‌కోసం భూమిని తయారుచేసి, మొక్కలను నాటుతున్న స్కూలు సిబ్బంది, విద్యార్థులు

అక్కడి బడిపిల్లలు పోషకాహారలోపంతో ఎండిపోవడాన్ని చూశారు అక్కడి డిప్యూటీ కమిషనర్‌ శశాంక ఆలా ! ఆలోచించి ఆమె ఓ నిర్ణయం తీసుకున్నారు. బడిలో స్థలముందా... అదే పొలమవుతుంది. ఒకవేళ లేదా... అప్పుడు బడి కప్పే చేనవుతుంది. ఇప్పుడక్కడ ప్రతి చిన్నారికీ బలపం పలకా మాత్రమే కాదు... ప్రతి స్కూలుకూ చేనూచెలకా ఉన్నాయి. పిల్లల ఆరోగ్యాలూ బాగున్నాయి. ఇప్పుడక్కడి స్కూళ్లు పాఠశాలలే కాదు... పంటశాలలు కూడా! 
మిజోరాంలోని లాంతాలై జిల్లా..  ఏమాత్రం సౌకర్యంగా లేని రోడ్డు మార్గం గుండా పది గంటలు ప్రయాణిస్తే లాంతాలై చేరుకుంటారు.  బాగా వెనుకబడిన ప్రాంతం.  వర్షాకాలం వచ్చిందంటే చాలు, అక్కడి 170 గ్రామాల్లో  40 గ్రామాలకు మానవ సంబంధాలు తెగిపోతాయి. తిండి కూడా దొరకదు. 180 కి. మీ. దూరంలో ఉన్న అస్సాం నుంచి పండ్లూ, కూరగాయలు రావాలి. అవి ఇక్కడకు చేరేసరికి కుళ్లిపోయి తినడానికి పనికిరాకుండా అయిపోతాయి. నాణ్యత ఉన్న సరుకులను ఎక్కువ ధరలకు అమ్ముతారు.  ఉప్పు, పంచదార కూడా నాసిరకానివే దొరుకుతాయి. ఆ జిల్లాకు ఏ ఐఏఎస్‌ అధికారిని బదిలీ చేసినా.. రాష్ట్ర రాజధాని నుంచి అక్కడికి  చేరుకునే దూరాన్ని లెక్కించుకుంటారు. అలాంటి చోటికి  చార్జ్‌ తీసుకున్న ఐఏఎస్‌ .. శశాంక ఆలా.  


డిప్యూటీ కమిషనర్‌ శశాంక ఆలా

నా స్కూల్‌... నా తోట..
లాంతాలైకి  సరైన సమయంలో  పదార్థాలు చేరకపోవడం వల్ల,  స్థానికంగా ఉండే  చమ్‌కా, లాయి తెగలవారికి  తాజా కూరగాయలు  దొరికేవి కాదు. అక్కడ పండే కూరగాయలతో చేసిన సూప్, ప్రభుత్వం అందచేసే బియ్యం వాళ్ల ఆహారం. అందువల్ల ఇక్కడ ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో  22 శాతం మంది అండర్‌వెయిట్‌తో ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన  శశాంక ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించారు. ‘‘కన్‌ సికుల్‌.. కన్‌ హువాన్‌ (నా స్కూల్‌.. నా తోట)’’ పేరుతో తన ఆలోచనకు శ్రీకారం చుట్టారు.  ప్రతి పాఠశాలలోను చిన్న వంటగది ఉండేలా.. పోషకాలతో కూడిన తోటను పెంచేలా చేశారు.  ఒకవేళ ఆ పాఠశాలలో పండించడానికి కావలసిన భూమి లేకపోతే  డాబా మీద తోటను పెంచేలా ఏర్పాట్లు చేశారు . ఈ పాఠశాలలు, అంగన్‌వాడీలు.. వారికి కావలసిన పండ్లు, కూరగాయలను వారే  పండించుకోవాలి. విత్తనాలు, కంపోస్టులను జిల్లా కేంద్ర కార్యాలయం నుంచి తెచ్చుకోవాలి. సిల్చార్, ఐజ్వాల్‌ నుంచి భోజనాల ట్రక్‌ కోసం నిరీక్షించకుండా, వారు పెంచిన కూరగాయలతో వారే స్వయంగా మధ్యాహ్న భోజనం తయారుచేసుకోవాలి. దీనివల్ల పిల్లలకు కావల్సిన పోషకాహారం అంది వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సేంద్రియ సాగు వల్ల పర్యావరణాన్ని పరిరక్షించినట్లవుతుందంటారు శశాంక. 

వీరు ఉంటారు...
హార్టి కల్చర్‌ విభాగ అధికారి, వ్యవసాయ శాఖ ఉద్యోగి, స్థానిక కృషి విజ్ఞాన్‌ కేంద్ర ఉద్యోగి, జిల్లా భూ అధికారి.. ఈ నలుగురూ ఒక వ్యవస్థగా ఏర్పడి... మొక్కలు ఎలా నాటాలి, కంపోస్ట్‌ ఎలా తయారుచేసుకోవాలి, కలుపును ఏ విధంగా వేరు చేయాలి వంటి విషయాలు నేర్పిస్తున్నారు. తెలుపు రంగు బియ్యం, బంగాళ దుంపల నుంచి కార్బోహైడ్రేట్లు, ఆకుపచ్చ  ఆకుకూరలు, బీన్స్, క్యాబేజీల నుంచి విటమిన్లు, ఎరుపు రంగు శనగలు, క్యారట్‌ల నుంచి ఐరన్, విటమిన్లు అందుతాయి. ప్రతి పాఠశాలలోను కనీసం 100 చదరపు గజాల స్థలం ఉండాలి. విత్తనాలు, మొక్కలు నాటి, వాటిని పండించి, మధ్యాహ్నం భోజనం తయారుచేసుకుని తినే ప్రక్రియ వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలి. ప్రస్తుతం త్వరగా వచ్చే  పసుపు, అల్లం, టమాటో, మొక్కజొన్న, ముల్లంగి వంటివాటినీ  పండిస్తున్నారు. తక్కువ నూనెతో వంట చేసి, పోషకాహారం తీసుకోగలుగుతున్నారు. 

తొలి విడతగా  213 పాఠశాలల్లో  తోటలు పెంచడం మొదలుపెట్టారు. రెండవ విడతగా 500 పాఠశాలలు, అంగన్‌వాడీలలో ప్రారంభించాలనుకుంటున్నారు. ఆ తరు వాత కోళ్ల పెంపకం మొదలుపెట్టి ఆర్గానిక్‌ కోడిగుడ్లను ఉత్పత్తి చేసి, వాటిని కూడా అందించాలనుకుంటున్నారు. ‘‘మార్చి 2020 నాటికి ప్రతి పాఠశాలలోను, అంగన్‌వాడీ, శిశుసంరక్షణ కేంద్రాలలోను, అక్కడి పిల్లలకు సరిపడా పోషకాలను ఇచ్చే పళ్లు, కూరలను వారికి వారే పండించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అంటున్నారు  శశాంక ఆలా. 

ఇది మిజోరంకు మాత్రమే పరిమితం కాదు.. మన అధికారులకూ ఆదర్శం. ఈ ఆలోచనను తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే  పిల్లలకు రసాయనాల్లేని ఆరోగ్యకరమైన ఆహారం  అందడమే కాక  వ్యవసాయం చేయడమూ తెలుస్తుంది. హ్యాట్సాఫ్‌ టు శశాంక ఆలా!!!
– వైజయంతి 

మరిన్ని వార్తలు