ఆమెకు అన్నింటికీ అనుమానమే..!

2 Nov, 2013 00:48 IST|Sakshi
ఆమెకు అన్నింటికీ అనుమానమే..!

నాదొక చిత్రమైన సమస్య. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న బిల్డర్‌ని. నా భార్య బాగా చదువుకుంది. అన్ని విషయాలను చక్కగా అర్థం చేసుకుంటుంది... ఒక్క నన్ను తప్ప! మా దూరపు బంధువు ఒకరితో నాకు వివాహేతర సంబంధం ఉందని తన అనుమానం. ఐదేళ్లక్రితం ఎలాగో మొదలైన ఈ అనుమానంతో నాకు ప్రతిరోజూ నరకం చూపిస్తోంది. తన అనుమానాన్ని బలపరిచే సాక్ష్యాధారాల కోసం నా భార్య ఈ ఐదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. నేను ఫోన్‌లో మాట్లాడుతుంటే ‘ఆమె’తోనే మాట్లాడుతున్నానని, నేను ఏదైనా ఆలోచనలో ఉంటే ఆ ఆలోచన ‘ఆమె’ గురించేనని అనుకుంటోంది. అలాగని నాతో గొడవ పడదు. తనలో తనే కుమిలిపోతుంటుంది. ఈ మధ్యయితే... మేమిద్దరం కలిసి త్వరగా తన పీడను వదిలించుకోవడం కోసం తనను చంపేందుకు కుట్రపన్నుతున్నామని భయపడుతోంది! ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వగలరు.
 - పేరు రాయలేదు, హైదరాబాద్

 
మీరు రాసిన దానిని బట్టి మీ శ్రీమతి పి.డి.డి. (పెర్సిస్టెంట్ డెల్యూషనల్ డిజార్డర్)తో బాధపడుతున్నట్లు అర్థమౌతోంది. పైకి అన్ని విధాలుగా బాగానే కనిపించడం ఈ డిజార్డర్‌లోని ప్రత్యేకత. అయితే ఇందులోని ప్రతికూల అంశం ఏమిటంటే... ఈ ప్రభావం అసలు వ్యక్తి మీద కన్నా, వారి కుటుంబ సభ్యులపైనే ఎక్కువగా పడుతుంది.

మీ శ్రీమతిలోని అనుమానం స్థాయి పరాకాష్టకు చేరుకోవడంతో మీరు తనకి నమ్మకద్రోహం చేస్తున్నట్లు ఆందోళన చెందుతున్నారు. అదే పనిగా ఆలోచిస్తూ, ఆరాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణంగా ఆమె దైనందిన జీవితంలోని ఎన్నో ముఖ్యమైన పనులు కుంటుబడిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు పి.డి.డి. తారాస్థాయికి చేరి కళ్లముందు కనిపించే ప్రతిదానికీ మనసు విపరీతార్థాలు కల్పించుకుంటుంది. కనిపించని వాటిని ఊహించుకుని నిస్పృహకు లోనవుతుంది.

ఎవరైనా ఈ ప్రస్తావన తెస్తే ఆ వ్యక్తి ఆలోచనలు, భావాలు, ప్రవర్తన ఉద్వేగభరితం అవుతాయి. ‘నీదే తప్పు’ అని ఎవరైనా అంటే కుప్పకూలిపోతారు లేదంటే విరుచుకుపడతారు. ఒక్కోసారి ఆత్మహత్యకు కూడా పాల్పడవచ్చు. ఇలాంటి పరిణామాలేవీ సంభవించకముందే మీరు మీ శ్రీమతితో కలిసి సైకియాట్రిస్ట్‌ను కలవండి. పి.డి.డి.తీవ్రతను బట్టి సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. మందులు కూడా సూచిస్తారు.
 
 డాక్టర్ కల్యాణ్
 సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్,
  సెక్రటేరియట్ రోడ్,  హైదరాబాద్

 

మరిన్ని వార్తలు