సూర్యవంశం అంజలి

22 May, 2019 04:23 IST|Sakshi

‘మనల్ని మనం నిరూపించుకోవాలంటే నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి. మొదట్లో అవకాశాల కోసం చాలా తపన పడ్డాను. విలన్‌ రోల్స్‌నీ వదులుకోలేదు. తర్వాత నే కోరుకున్న పాజిటివ్‌ రోల్స్‌ వరించాయి’ అంటూ తన గురించి చెప్పడం మొదలుపెట్టిన అంజలి అసలు పేరు మైథిలీ. తెలుగింటి అమ్మాయి మైథిలీ బుల్లితెరపైన రాణించడానికి పడిన తపనను ఈ విధంగా వివరించింది.

‘తెలుగింట పుట్టి తెలుగువారికి టీవీ ద్వారా చేరువకావడం నా అదృష్టంగా భావిస్తుంటాను. నా మొట్టమొదటి సీరియల్‌ ‘ఆడదే ఆధారం’, ఆ తర్వాత మూడుముళ్ల బంధం. దాదాపు మొదట్లో నాకు వచ్చిన పాత్రలన్నీ విలన్‌ క్యారెక్టర్లే. దీంతో కొంచెం భయమేసేది అన్నీ నెగిటివ్‌ క్యారెక్టర్లేనా అని. అష్టాచెమ్మా సీరియల్‌ తర్వాత మరో అవకాశం కోసం ఎదురుచూస్తూనే డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాను.

నెగిటివ్‌ నుంచి పాజిటివ్‌
ఏడాదిన్నర క్రితం జీ తెలుగులో వచ్చే ‘సూర్యవంశం’ సీరియల్‌లో ‘అంజలి’ పాత్ర నన్ను వరించింది. ఇలాంటి పాత్రకోసం చాలాకాలంగా ఎదురు చూశాను. ఇప్పుడు అంజలిగా చాలా మందికి చేరువయ్యాను. ఇందులో అంజలి చాలా జోవియల్‌గా, కొంచెం సెన్సిటివ్‌గా ఉంటుంది. అంజలి – కార్తీక్‌లది మంచి జంట. వీరిద్దరి మధ్య ఉండే బంధం చాలా అందంగా ఉంటుంది. ఈ సీరియల్‌ నుంచి ఇప్పుడు తమిళ్‌లో మరో అవకాశం వచ్చింది. ఆ పాత్ర డ్యాన్స్‌ కమ్‌ పాజిటివ్‌ రోల్‌. ‘అష్టాచెమ్మా’ లో మధుర పాత్ర నెగిటివ్‌ రోల్‌ అయినా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సూర్యవంశంలో అంజలి రోల్‌ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ రెండు రోల్స్‌ అంటే నాకు చాలా చాలా ఇష్టం.

కూచిపూడి డ్యాన్సర్‌
కూచిపూడిలో నాకు సర్టిఫికెట్‌ కూడా ఉంది. ఆర్టిస్టు అవకాశాలు రాకపోతే కూచిపూడి డ్యాన్సర్‌గా స్థిరపడేదాన్ని. స్కూల్‌ డేస్‌లో నందనవనం, ధన, పాండురంగడు.. మొదలైన సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేశాను. ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్‌ ఉన్నా నా ఫొటోలు పంపేదాన్ని. ‘అందమైన భామలు’ టీవీ ప్రోగ్రామ్‌లో టాప్‌ ఫైవ్‌ లిస్ట్‌లో ఉన్నాను. అయితే, పోటీలో గెలవలేదు. దీంతో చాలా ఏడ్చాను. చాలా సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. అమ్మ నన్ను చాలా మార్చింది. సినిమాల్లో చేయాలని ఉండేది. కానీ, అవకాశాలు ఎలా వస్తాయో తెలియదు. సినిమా ఆఫీస్‌లకు వెళ్లి నా ప్రొఫైల్, ఫొటోలు ఇచ్చి వచ్చేదాన్ని. ఆ తర్వాత ఫోన్‌ వస్తుందని చాలా ఎదురుచూసేదాన్ని. రాకపోవడంతో డీల్‌ పడేదాన్ని. సీరియల్స్‌లో అవకాశాలు రావడంతో హ్యాపీగా ఉన్నాను. నటిస్తూనే డిగ్రీ పూర్తిచేశాను.

అమ్మ బెస్ట్‌ ఫ్రెండ్‌
మాది గుంటూరు. అమ్మానాన్నలకు నేను , అన్నయ్య సంతానం. అన్నయ్య ఇంజనీరింగ్‌ పూర్తి చేసి జాబ్‌ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అన్నయ్య నాకు చాలా సపోర్ట్‌. నేను డ్యాన్సర్‌గా రాణించడం కోసం చదువులో వెనకబడకూడదని అన్నయ్య క్లాస్‌లోనే నన్నూ జాయిన్‌ చేశారు. నేను మిస్‌ అయిన క్లాసులు అన్నయ్య చెప్పేవాడు. నాకు నోట్స్‌ రాసిపెట్టేవాడు. మా నాన్నగారు మల్లికార్జునరావు స్కూల్‌ హెడ్‌మాస్టర్‌. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో తరచూ ట్రాన్స్‌ఫర్లు ఉండేవి. మా అమ్మ లలిత నా విషయంలో ఎక్కువ కేర్‌ తీసుకుంది. తను క్లాసికల్‌ డ్యాన్సర్‌. కానీ, తన కలను నెరవేర్చుకోలేకపోయానని నాకు కళ పట్ల ఆసక్తి కలిగేలా చేసింది.

అమ్మ వల్ల నేను కూచిపూడి డ్యాన్సర్‌ని అయ్యాను. అంతేకాదు, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్‌.. ప్రతీ ఆర్ట్‌లోనూ ప్రవేశం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది అమ్మ. నాన్నగారు మా బాధ్యత అమ్మకే అప్పజెప్పేవారు. ‘పిల్లలు వాళ్లనుకున్న ఫీల్డ్‌లో ఎదిగేలా జాగ్రత్తలు తీసుకో. నా సపోర్ట్‌ ఎప్పుడూ ఉంటుంది’ అనేవారు. మేం కూడా అవకాశాలను వదులుకోలేదు. ఇప్పటికీ నా ప్రొఫెషన్‌లో అమ్మ సపోర్ట్‌ ఉంటుంది. నాకు ఫ్రెండ్స్‌ సర్కిల్‌ చాలా చాలా తక్కువ. మా అమ్మనే నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. నాకు బాధనిపించినా, సంతోషమేసినా అమ్మతోనే షేర్‌ చేసుకుంటాను.
– నిర్మలారెడ్డి

బిజీ బిజీగా ఉండటం ఇష్టం
నన్ను ‘సూర్యవంశం’ అంజలిగా చాలా మంది గుర్తుపడతారు. నా పాత్రను, నటనను మెచ్చుకుంటుంటారు. వచ్చిన అవకాశానికి, చేస్తున్న కృషికి చాలా ఆనందపడుతుంటాను. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండటం నాకు ఇష్టం. నెలలో రెండు మూడు సీరియల్స్‌లో యాక్ట్‌ చేసేలా ప్లాన్‌ చేసుకుంటాను. సీరియల్స్‌ షెడ్యూల్‌ లేని టైమ్‌లో డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లు ప్లాన్‌ చేసుకుంటాను. నెలలో కనీసం 2–3 డ్యాన్స్‌ షోలైనా ఉంటాయి. పెద్ద పెద్ద ఆలోచనలైతే లేవు.  క్లాసికల్‌ డ్యాన్సర్‌ని కాబట్టి డ్యాన్స్‌ ఇన్‌స్ట్యూట్‌ పెట్టాలి. ఇలా యాక్టింగ్‌లోనే కొనసాగాలి.
ప్రేక్షకుల నుంచి మంచి పేరు తెచ్చుకోవాలి.’

మరిన్ని వార్తలు