మాకు మీరు మీకు మేము

28 Aug, 2019 07:00 IST|Sakshi
(ప్రతీకాత్మక చిత్రం)

రెక్కలు వచ్చి అనుబంధాలు ఎగిరిపోయాయి.

రెక్కలు కట్టుకుని ‘మైత్రి’బంధాలు వచ్చి వాలాయి.

మన పక్కనే ఉన్న మనిషిని మనకు దగ్గరగా ఉంచలేకపోతోందని టెక్నాలజీని నిందిస్తూ ఉంటాం. ఓ వీడియో కాల్‌ ఎక్కడో విదేశాల్లో ఉన్న మనవాళ్లను దగ్గర చేసినప్పుడు కూడా సంబరపడిపోతాం తప్ప, దాని వెనక ఉన్నదీ టెక్నాలజీనే అని గుర్తు చేసుకోం! మనం ఎంత నిందించినా,మనకు ఎంత గుర్తుకు రాకపోయినా..టెక్నాలజీ అనేది పాత అనుబంధాలను,కొత్త బంధాలనూ కలుపుతూనే ఉంటుంది. అలా వృద్ధాశ్రమాలను, అనాథాశ్రమాలను కలుపుతున్న ఓ కొత్త టెక్‌–బంధం ఢిల్లీలోని వయోవృద్ధుల జీవితాలలోవసంతాలను చిగురింపజేస్తోంది.

పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత... తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కారణంగా ఎవరు ఏ దేశంలో స్థిరపడతారో ఊహించలేం. దేశాల ఎల్లలు దాటిన పిల్లలతో పాటు పెట్టేబేడా సర్దుకుని వెళ్లడానికి పెద్దవాళ్లు ఇష్టపడకపోవచ్చు. అలాంటి వాళ్ల కోసం వెలుస్తున్న సౌకర్యవంతమైన వృద్ధాశ్రమాల సంఖ్య కూడా ఏడాదికేడాదీ పెరుగుతూనే ఉంది. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న పిల్లలు, అమ్మానాన్నలకు ఏ లోటూ రాకుండా డబ్బు పంపిస్తుంటారు. ఇక్కడ వీళ్లకూ వృద్ధాశ్రమాల్లో విశాలమైన, అధునాతన సౌకర్యాలున్న గదులుంటున్నాయి. గోడలకు మంచి పెయింటింగ్‌లు కూడా ఉంటున్నాయి. కానీ ఆ గోడలతో బంధాలు బలపరచుకోలేక సతమతమవుతోంది వార్ధక్యం. ఓల్డేజ్‌ హోమ్‌లో భార్యాభర్త ఇద్దరూ ఉన్నంత కాలం వాళ్లు కొంతలో కొంత హాయిగానే గడుపుతున్నారు. కానీ ఈ ఇద్దరిలో ఒకరే మిగిలిన క్షణం నుంచి మొదలవుతుంది ఒంటరితనం అనే ప్రత్యక్ష నరకం. ఆ నరకాన్ని భరించలేని ఓ పెద్ద ప్రాణం భార్య పోయిన కొన్నాళ్లకే లోకాన్ని వదిలేసింది. ఆ విషాదం నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే.. ‘మైత్రీయాప్‌’. ఈ యాప్‌ను రూపొందించినది అనన్య. ఆ వృద్ధ దంపతుల మనుమరాలు. ‘‘బాల్యానికి– వార్ధక్యానికి మధ్య వెలిసిన మెత్రీబంధమే ఈ మైత్రీయాప్‌’’ అంటున్నారు అనన్య. ఈ యాప్‌ ద్వారా... ఓల్డేజ్‌ హోమ్‌లలో నివసిస్తున్న వృద్ధులకు, అదే నగరంలో అనాథాశ్రమంలో పెరుగుతున్న పిల్లలకు మధ్య ఓ బంధం ఏర్పడుతోంది. పెద్దలకు ఒంటరితనాన్ని, పిల్లలకు ఏకాకితనాన్ని పోగొట్టేందుకు మైత్రీ యాప్‌ను సృష్టించడంలో అనన్యకు ఆమె స్నేహితులు కూడా సహకరించారు.

ఐదుగురు అమ్మాయిలు
న్యూఢిల్లీలోని అమిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థినులు అనన్య గ్రోవర్, అనుష్క శర్మ, అరీఫా, వంశిక యాదవ్, వసుధా సుధీందర్‌... ఈ ఐదుగురమ్మాయిల కృషి ఫలితంగా మైత్రీ యాప్‌ అనే ఈ కమ్యూనికేషన్‌ చానెల్‌ ఆవిర్భవించింది. వీరి లక్ష్యం... ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లు జీవిస్తున్న అనేక మంది మధ్య బంధాలను కలపడం. ఒకరితో ఒకరిని అనుసంధానం చేసి అనుబంధాల వింజామరలను వీచడం. అనన్య బృందం స్వయంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కలిపి మొత్తం 140 హోమ్స్‌ను సందర్శించింది. ఈ ఏడాది మార్చిలో మొదలైన వీరి ప్రయత్నం జూన్‌ చివరికి ఫలించింది. ఈ యువ టెక్‌ ప్రెన్యూర్స్‌లు మైత్రి యాప్‌ను జూలైలో అధికారికంగా లాంచ్‌ చేశారు. ఇప్పుడిది దేశంలో స్థిరంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వెయ్యి మందికి పైగా ఈ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. ఇలా న్యూఢిల్లీలోని ఓల్డేజ్‌ హోమ్‌లో ఉంటున్న పెద్దవాళ్లు... పదిహేను అనాథాశ్రమాలతో అనుసంధానం అయ్యారు.

పెద్దవాళ్లకు మిగిలిన చిన్న కోరిక
మా నానమ్మ, తాతయ్యలతో నాకు మంచి అనుబంధం ఉండేది. వాళ్ల నుంచి అంతులేని ప్రేమను అందుకున్నాను.  ఒకటి కాదు, రెండు కాదు... ఎన్నెన్నో జ్ఞాపకాలు. చదువులు, ఉద్యోగాలతో ఒక్కొక్కరు ఒక్కో చోట ఉండేవాళ్లం. సెలవుల్లో అందరం కలిసేవాళ్లం. ఇలా ఉండగా క్యాన్సర్‌ వ్యాధి మా నానమ్మను తీసుకెళ్లి పోయింది. ఆమె పోయిన ఏడాదిలోపే తాతయ్య కూడా వెళ్లి పోయారు. ఆయనకు ఎటువంటి అనారోగ్యమూ లేదు. కేవలం నానమ్మ పోయిన తర్వాత ఆ ఒంటరితనాన్ని భరించలేక జీవితాన్ని చాలించారు. పెద్దవాళ్లకు ఆ వయసులో ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం. మా తాతయ్యలాగ ఎందరో ఉన్నారు. మా టీమ్‌ ఓల్డేజ్‌ హోమ్‌లకు వెళ్లినప్పుడు.. అక్కడ ఉండే వృద్ధులు చాలా మంది మమ్మల్ని తమ మనుమరాళ్లలా అభిమానించారు. ‘మీకు వీలయినప్పుడు మళ్లీ మళ్లీ వచ్చి కనిపిస్తూ ఉండండి తల్లీ. మా మనుమరాళ్లను చూసుకున్నట్లే సంతోషంగా ఉంది’ అనేవాళ్లు. మా మైత్రి యాప్‌ ఆ వృద్ధుల చిన్న కోరికను తీర్చగలుగుతుంది. ఈ యాప్‌ ద్వారా మేము అనాథాశ్రమాల్లో పెరుగుతున్న పిల్లలకు గ్రాండ్‌ పేరెంట్స్‌ని ఇవ్వగలిగాం. తాతయ్యకు ఎదురైన చేదు అనుభవం నుంచి... నేను ఎంతోమంది పెద్దవాళ్లకు ఒక ఆలంబనను అందివ్వగలిగాను.– అనన్య గ్రోవర్, టెక్‌ప్రెన్యూర్‌

అవ్వాతాత దొరికారు
మైత్రి యాప్‌ ద్వారా అనాథాశ్రమాల్లో పెరుగుతున్న పిల్లలకు అవ్వాతాతలు దొరికినట్లయింది. ఈ యాప్‌ ద్వారా అనుసంధానమైన ఓల్డేజ్‌ హోమ్‌ నిర్వహకులు, అనాథాశ్రమ నిర్వహకులు.. వృద్ధులను – చిన్నారులను కలవడానికి వీలుగా గెట్‌ టు గెదర్‌లు ఏర్పాటు చేస్తారు. ఇలా ఓల్డేజ్‌హోమ్‌లో వృద్ధులను కలిసిన తర్వాత స్కూలుకెళ్లిన పిల్లలు ‘నిన్న మా నానమ్మ, తాతయ్యల ఇంటికి వెళ్లాం. వచ్చే ఆదివారం కూడా వెళ్తాం’ అని స్నేహితులతో సంతోషంగా చెప్పుకుంటున్నారు. ఇక పెద్దవాళ్ల విషయానికి వస్తే... వాళ్ల మనుమలు మనుమరాళ్లు దూరంగా ఉండి ఏ ఏడాదికో ఒకసారి కనిపిస్తుంటారు. ఏడాదంతా తమ మనుమల కోసం మనుమరాళ్ల కోసం ఎదురు చూస్తూ, తీరా సెలవులప్పుడు వాళ్లు రాలేకపోతే, రాలేదని నిరాశ చెందడం కంటే... ప్రతి వారాంతం తమను వెతుక్కుంటూ వచ్చే అనాథ పిల్లల చేత ‘అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య’ అని పిలిపించుకోవడంతో సంతోషాన్ని పొందుతున్నారు. తమకు ఎవరూ లేరనుకునే నిరాశలో ఉన్న చిన్నారి పిల్లలకు తమకోసం ఎదురు చూసే అవ్వా, తాతలున్నారంటే చెప్పలేని సంతోషం కలుగుతోంది. అనన్య చేసిన ఈ ప్రయోగం.. ప్రేమను పంచడానికి పేగుబంధం అక్కరలేదని చెబుతోంది. – మంజీర

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా