కరోనాపై కొన్ని అపోహలూ... వాస్తవాలు

19 Mar, 2020 10:27 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. 8,092మంది మరణించారు. ఇక మరణాల సంఖ్యలో ఆసియాను యూరోప్‌ అధిగమించింది. ఈ వైరస్‌తో ఇప్పటివరకూ ఆసియాలో 3,384, యూరప్‌లో 3,422మంది మరణించారు. అన్ని దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై సమాజంలో నెలకొని ఉన్నకొన్నిఅపోహలూ...వాస్తవాలివి...

అపోహ
కరోనా కేవలం వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మాత్రమే సోకుతుంది.
కరోనా వైరస్‌ చిన్నపిల్లలు, వృద్ధుల మీదే అత్యధికంగా ప్రభావం చూపుతుంది.
అల్లం, ఉల్లి, వెల్లుల్లి, విటమిన్‌–సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లతో ఇది తగ్గిపోతుంది.

వాస్తవం
కరోనా వైరస్‌ అందరికీ సోకుతుంది. అన్ని వైరస్‌లకు లాగే వ్యాధి నిరోధక శక్తి ఉన్నవారికి ఇది తన ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ తర్వాత కొద్దిసేపు ఉండి, ఆ తర్వాత నిర్వీర్యమవుతుంది. అయితే వ్యాధి నిరోధక శక్తి లేనివారిలో అది శ్వాసకోశ వ్యవస్థ పైభాగానికే (అప్పర్‌ రెస్పిరేటరీ ట్రాక్ట్‌కే) పరిమితం కాకుండా ఊపిరితిత్తుల కణాలపై దాడి చేసి ధ్వంసం చేస్తుంది. అదే అసలు సిసలు ముప్పు. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాధినిరోధ శక్తి పెంపొందేలా మంచి సమతులహారం తీసుకోవడం, పెరుగు వంటి ప్రోబయాటిక్‌ తీసుకోవడం, మంచినీళ్లు తాగడం, వ్యాయామం చేయడం, కంటికి నిండుగా నిద్రపోవడం అవసరం∙ ఇది వయోభేదం లేకుండా అందరికీ సోకుతుందనే విషయం తెలిసిందే.

అయితే మరీ చిన్నపిల్లలు, వృద్ధుల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువ కాబట్టి వారు దీని బారిన పడే ప్రమాదం ఎక్కువ. అయితే చిత్రంగా అది చిన్నపిల్లల కంటే వృద్ధులు... అందునా 80 పైబడి, డయాబెటిస్, గుండెజబ్బులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది∙ నిర్దిష్టంగా వాటి వల్ల ఇది తగ్గిపోతుందని ఎక్కడా స్పష్టమైన అధ్యయనాల దాఖలాలు లేవు. అయితే అల్లం, ఉల్లి, వెల్లుల్లి వంటివి జలుబు జాతి వైరస్‌ల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలప్పుడు కొంత ఉపశమనం కలిగిస్తాయన్న విషయం అనుభవంలో ఉన్నదే. డాక్టర్‌ విశ్వేశ్వరన్‌ బాలసుబ్రమణియన్‌సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మొనాలజిస్ట్‌ అండ్‌ స్లీప్‌ మెడిసిన్‌స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు