వన్యప్రాణుల నడుమ...వనయాత్ర చేద్దామా

5 Jun, 2014 22:13 IST|Sakshi
వన్యప్రాణుల నడుమ...వనయాత్ర చేద్దామా

మన దగ్గరే...
 
కాలుష్యపు పొగలు, వేసవి సెగల మధ్య ఉరుకులు పరుగులూ పెడుతూ... ఏమిటో ఈ జీవితం అని నిట్టూరుస్తూ గడపడం ప్రస్తుతం తప్పనిసరే అయినా... అప్పుడప్పుడూ తప్పించుకోవడం అవసరం. కాంక్రీట్ జంగిల్ అంటూ తిట్టుకున్నంత మాత్రాన వచ్చేదీ లేదు... నిజమైన జంగిల్‌లో కాసేపు గడిపినా ప్రాణం బోలెడు రీఛార్జ్ అవకుండా పోదు. వారమంతా విరామమెరుగని ‘వార్’ సాగించేకంటే... ఒక్కరోజైనా ఆ జంఝాటం నుంచి తప్పించుకోవాలని ఆశించే ఆనందాన్వేషకులకు మరో చక్కని గమ్యం ఆదిలాబాద్‌లోని జన్నారం.    
 
హైదరాబాద్ నుంచి దాదాపు 280 కి.మీ దూరంలో ఉంది ఆదిలాబాద్ జిల్లా. ఈ జిల్లా వేదికగానే దట్టమైన అడవుల అందాన్ని సురక్షితమైన, భద్రమెన రీతిలో తిలకించి ఆనందించే మరో మంచి అవకాశం ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి వచ్చింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్ల పుణ్యమా అని ఆదిలాబాద్‌లోని అడవుల్లో సాహసికులు అభిలషించే సాహసయాత్ర కల సాకారం కానుంది.
 
జన్నారం ప్రాంతంలోని కవ్వాల్ అభయారణ్యంలో ఎకోట్రాక్‌లు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. పులుల సంచార ప్రాంతంగా గుర్తించడంతో ఇక్కడ ఎకోట్రాక్‌లు అందుబాటులోకి రానున్నాయి.
 
బస ఏర్పాట్లు

కవాల్ టైగర్ శాంచ్యురీకి దగ్గర్లో ఎపిటిడిసి కాటేజ్‌లు నిర్మించింది. ప్రకృతి సిద్ధ అందాలను ఆస్వాదిస్తూ, ఇక్కడ ఉన్న అధునాతన వసతుల్ని ఆనందించేలా వీటిని రూపుదిద్దారు. 9 ఎసి కాటేజ్‌లు, 2 నాన్ ఎసి కాటేజ్‌లు ఇక్కడున్నాయి. ఒక డార్మెటరీ కాటేజ్‌ను కూడా నిర్మించారు. దాదాపు 50 సీట్లున్న రెస్టారెంట్ నెలకొల్పారు.‘‘ఇక్కడ ట్రెక్కింగ్ తదితర సాహసయాత్రలు, జీప్ సఫారీ పరిచయం చేయనున్నాం. ఎకో ట్రాక్ మీద టూర్లు నిర్వహించేందుకు ఇప్పటికే ఒక స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యువి)ని అందుబాటులోకి తెచ్చా’’మని అధికారులు తెలిపారు.
 
వన్యప్రాణుల సందడి

జింకలు, అడవి కుక్కలు, విచిత్రమైన కొండముచ్చులతో పాటు... ఇక్కడ 10 చిరుత పులులు, 48 ఎలుగుబంట్లు, 20 నక్కలను గుర్తించినట్టు స్థానిక అటవీ అధికారి చెప్పారు.  మొత్తం 893 కి.మీల విస్తీర్ణంలో ఉందీ  వన్యప్రాణి రక్షితప్రాంతం. స్థానికంగా నివసించే వాటి కన్నా చండీగఢ్ వంటి ప్రాంతాల్లోని అడవుల నుంచి రాకపోకలు సాగించే పులులే ఇక్కడ అధికమని అటవీ అధికారులు వివరిస్తున్నారు.
 
జల విహారం


కవాల్ అభయారణ్యానికి కేవలం 30కి.మీ దూరంలో ఉంది కడెమ్ రిజర్వాయర్. జలజలపారే నీళ్లు, మధ్యలో చిన్న దీవి వగైరాలతో పర్యాటకులకు వినూత్న అనుభూతుల్ని అందిస్తోంది. ఇక్కడ బోటింగ్ సదుపాయముంది. సాయంత్రవేళల్లో జల విహారం మధురానుభూతి.
 
సిద్ధమవుతున్న టూర్ ప్యాకేజి

హైదరాబాద్-బాసర-అలీసాగర్-హైదరాబాద్‌లతో 3 రోజుల టూర్, అలాగే హైదరాబాద్-బాసర-జన్నారం-అలీసాగర్-హైదరాబాద్‌లతో 5 రోజుల టూర్‌కు పర్యాటకశాఖ సన్నాహాలు చేస్తోంది.   

 - ఎస్. సత్యబాబు
 

మరిన్ని వార్తలు