ఫాస్ట్ ట్రాక్ విధానంలో మూడుగంటల్లోనే నడవగలరు!

27 Oct, 2015 23:01 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్
 
 నాకు విపరీతమైన వెన్ను నొప్పి వస్తోంది. దీనికి హోమియోలో తగిన చికిత్స సూచించండి.
 - సుందర్, మెదక్

ఇటీవల వెన్ను సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ తరహా నొప్పి వస్తోంది. మీరు వెన్నునొప్పి అని రాశారు. కానీ అది ఏ భాగంలోనో రాయలేదు. మన వెన్నెముకలో 33 ఎముకలు ఉంటాయి. అందులో 7 మెడ భాగంలో, 12 వీపు భాగంలో, 5 నడుము భాగంలో మిగతావి అంతకంటే కిందన ఉంటాయి. ఎముకకూ, ఎముకకూ మధ్యన డిస్క్ అనే మెత్తటి పదార్థం ఉంటుంది. ఇది మన కదలికల సమయంలోగానీ, ఏదైనా పనిచేసేటప్పుడు ఎముకల మధ్య రాపిడిని నివారిస్తుంది. ఈ డిస్క్ మధ్యన మెదడు నుంచి వచ్చే నాడులు ఉంటాయి. ఉదాహరణకు నడుము దగ్గర ప్రారంభమై తొడల ద్వారా కాళ్ల వరకూ వెళ్లే అతి పెద్ద నరాన్ని ‘సయాటిక్ నర్వ్’ అంటారు. నడుము వద్ద ఉండే ఎల్4-ఎల్5 మధ్య సయాటిక్ నరం ఆరంభం అవుతుంది. ఈ నరం మీద ఒత్తిడి పెరిగి నొప్పికి దారితీయడాన్ని సయాటిక్ ఈ నరం ఒత్తిడికి గురవ్వడం వల్ల వచ్చే నొప్పిని సయాటికా అంటారు. ఇక మెడ భాగంలోని వెన్నుపూసల అరుగుదలతో పాటు మరికొన్ని కారణాల వల్ల వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. మెడ భాగంలోని రెండు వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ పక్కకు జరగడం, మెడకు తీవ్రమైన గాయం కావడం వంటి కారణాలతో ఈ సమస్య కావచ్చు. గంటల తరబడి కూర్చొని పనిచేసే వారిలోనూ, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవాళ్లలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బాధితుల్లో మెడ భాగంలో తీవ్రమైన నొప్పి, చేయి లేదా భుజాలకు నొప్పి పాకడం, చేతి వేళ్ల తిమిర్లు లేదా ఆ భాగాలు మొద్దుబారడం లక్షణాలు ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇక కొందరిలో నడము వద్ద ఉండే వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరిగిపోవడం వల్ల కూడా అక్కడ ఉండే నరాల మీద ఒత్తిడి పడి లంబార్ స్పాండిలైటిస్ అనే సమస్య రావచ్చు. ముఖ్యంగా ఎల్3, ఎల్4, ఎల్4 వంటి వెన్నుపూసలలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది.

హోమియో చికిత్స: వెన్నుకు సంబంధించిన ఏ నొప్పులకైనా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, రస్టాక్స్. కామొమిల్లా మాగ్‌ఫాస్ వంటి మందులను రోగి తత్వాన్ని, మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. నిపుణులైన హోమియో డాక్టర్లు సూచించిన కాలపరిమితి మేరకు వాటిని వాడితే, ఆపరేషన్ అవసరం లేకుండానే శాశ్వతమైన ఫలితం లభిస్తుంది. హోమియో మందులతో పాటు మంచి పౌష్టికాహారం, ఫిజియోథెరపీ వల్ల కూడా వెన్ను సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
 
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
 
నా వయసు 62 ఏళ్లు. విపరీతమైన మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నాను. వైద్యులను సంప్రదిస్తే మొదట మందులు ఇచ్చారు. అయినా నొప్పి తగ్గకపోయేసరికి మోకాలు చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకొమ్మని సూచిస్తున్నారు. ఈ వయసులో ఆపరేషన్ చేయించుకోవాలంటే భయంగా ఉంది. ఒకవేళ ఆపరేషన్ చేయించుకున్నా నెలల తరబడి మంచానికే పరిమితమైతే నాకు సేవలు చేసేవారు ఎవరూ లేరు. నా సమస్యకు ఆపరేషన్ ఒక్కటే మార్గమా? ఇతర ప్రత్యామ్నాయం చికిత్సలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
 - సత్యనారాయణ, కరీంనగర్

 మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స గురించి మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీకు రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యల వంటి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా అన్న విషయం మీరు తెలపలేదు. ప్రస్తుతం మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలో అత్యాధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ మీకు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు లేకుండా ఉంటే ఫాస్ట్‌ట్రాక్ విధానంలో మోకాలు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడానికి వీలవుతుంది. ఈ విధానంలో సర్జరీ చేస్తే ఆపరేషన్ జరిగిన మూడు గంటల్లోనే మీరు నడవగలుగుతారు. సాధ్యమైనంతవరకు సర్జరీ జరిగిన 24 గంటల్లోపే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. మీరు నెలల తరబడి మంచానికి పరిమితం కావాల్సిన అవసరం ఉండదు. దాంతో మీరు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సర్జరీ జరిగిన నాలుగురోజుల్లో మీరు పూర్తిగా కోలుకొని సాధారణ జీవితం గడపగలుగుతారు.

 సర్జరీ తర్వాత మీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఈ విధానంలో ఆపరేషన్ ముందు నుంచే నొప్పి నివారణ ప్రక్రియలు ప్రారంభిస్తారు. మీకు ఎలాంటి బాధ లేకుండా సర్జరీ చేస్తారు. ఫాస్ట్‌ట్రాక్ విధానంలో ఆపరేషన్ చేయడానికి వైద్యులు నిర్ధారణ చేస్తే, ఈ సర్జరీకి ముందు, తర్వాత చేయాల్సిన వ్యాయామాలు, ఫిజియోథెరపీ గురించి వైద్యులు క్షుణ్ణంగా తెలియజేస్తారు. మీ సందేహాలూ, అపోహలూ పూర్తిగా నివృత్తి అయిన తర్వాతనే సర్జరీకి సిద్ధం చేస్తారు. కాబట్టి మీరు అనవసరమైన భయాందోళనలూ, అపోహలను పక్కనబెట్టి వెంటనే శస్త్రచికిత్సకు సిద్ధమవండి.

గ్యాస్ట్రోఎంటరాలజీ  కౌన్సెలింగ్
 
 నాకు 8 నెలల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో రక్తపరీక్షల్లో హెపటైటిస్ ‘బి’ పాజిటివ్ అని చెప్పినారు. ఆర్నెల్ల తర్వాత మళ్లీ టెస్ట్ చేస్తే మళ్లీ హెపటైటిస్ ‘బి’ పాజిటివ్ అన్నారు. ఈ వ్యాధికి ట్రీట్‌మెంట్ ఉందా లేదా సరైన సలహా ఇవ్వగలరు.
 - లక్ష్మయ్య, వరంగల్

 మీకు 6 నెలల తర్వాత కూడా హెపటైటిస్ ‘బి’ పాజిటివ్ అన్నారు కాబట్టి మీకు క్రానిక్ హెపటైటిస్ ‘బి’ అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఉన్నవారు మొదట కొన్ని రక్త పరీక్షలు చేసుకొని వ్యాధి ఏ స్టేజిలో ఉందో తెలుసుకోవాలి. వ్యాధి చాలామందిలో సుప్తావస్థలో ఇన్‌యాక్టివ్ దశలో ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి యాక్టివేట్ స్టేజ్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నవారికి ఏ మందులు అవసరం లేదు. వీరు చేయవలసిందల్లా ప్రతి 3 నుండి 6 నెలలకు ఒకసారి గాస్ట్రో ఎంటరాలజిస్టుని సంప్రదించి ఎల్.ఎఫ్.టి. పరీక్షలు చేసుకొని మీ వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లోకి ఏమైనా వెళ్లిందా అనేది చూసుకోవాలి. యాక్టివ్ స్టేజ్‌లోకి వెళ్తే దానికి వివిధ రకాలైన మందులు లభ్యమవుతాయి. అందులో మీరు ఏ డ్రగ్ వాడాలో మీ దగ్గరలోని డాక్టర్‌ని సంప్రదించి వాడడం అవసరం.
 
 నా వయసు 55. మలద్వారం ద్వారా రక్తం పడుతోంది. డాక్టర్‌ని సంప్రదిస్తే పైల్స్ అని చెప్పి ఆపరేషన్ చేశారు. కాని రక్తం పడడం ఆగలేదు. దయచేసి నా సమస్యకు సరైన సలహా ఇవ్వగలరు.
 - రామారావు, వైజాగ్

 మలద్వారం ద్వారా రక్తం రావడానికి పైల్స్ ఒక కారణం కావచ్చు, కాని రక్తం రావడానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అందులో ముఖ్యంగా పెద్ద పేగు కాన్సర్. మీరు ఒకసారి కొలనోస్కోపి / సిగ్‌మాయిడోస్కోపి అనే పరీక్ష చేయించుకోవడం మంచిది. ఆ పరీక్షలో మీకు రక్తం ఎక్కడ నుండి వస్తుందో తెలుస్తుంది. కారణం తెలిస్తే సరైన వైద్యం చేయించుకోవచ్చు. 50 ఏళ్లు పైబడిన వాళ్ల పెద్దప్రేగు కాన్సర్ రావడానికి చాలా అవకాశం ఉంది. ఈ కాన్సర్‌ని తొలి దశలో కనుగొంటే క్యూర్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు అశ్రద్ధ చేయకుండా దగ్గరలోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి.
 

మరిన్ని వార్తలు