నదియాను చూసి నేర్చుకోండి!

9 Apr, 2014 00:26 IST|Sakshi
నదియాను చూసి నేర్చుకోండి!

ఉద్యోగం చేస్తూనే ప్రయివేటుగా ఇంజనీరింగ్ చదువుని పూర్తిచేసిన నదియా తోటి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచింది.  జీవితంలో గెలవడానికి తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోలేదు.
 
 ఒంటిరితనం మనిషిని గట్టిపరుస్తుంది. ఎదురీదడం నేర్పుతుంది. తోడులేని జీవితాలకు ధైర్యం, పట్టుదలలే నిజమైన అండ అని గుర్తించిన ప్రతి ఒక్క మహిళా జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. నదియా అలాంటి మహిళే. ఇరాక్‌లోని బాగ్దాద్ ప్రాంతానికి చెందిన నదియా పెళ్లయిన ఐదేళ్లకే భర్తను పోగొట్టుకుంది. ఇద్దరు పిల్లల్ని వెంటబెట్టుకుని పుట్టింట్లో దిగిన నదియా మరొకరిపై ఆధారపడానికి ఇష్టపడలేదు. సంప్రదాయ పొరలను చీల్చుకుంటూ ఒంటరిగా బతుకుతూనే, తనలాంటి పదిమంది మహిళలకు అండగా నిలబడింది.

 తల్లితండ్రీ, ఇద్దరు అన్నలు, వదినలు, వారి పిల్లలు...ఇరుకింట్లో ఒకరికొకరు ఎలాగో సర్దుకుంటున్నారు. నదియా అడుగుపెట్టాక మరింత ఇరుకైంది. ‘నేను ఏదో ఒక పని చేసుకుని పిల్లల్ని పెంచుకుంటానమ్మా’ అంటూ తల్లిని అడగ్గానే ఇంట్లోవాళ్లంతా ససేమిరా అన్నారు. ‘మాతోపాటే నువ్వూ...మాకున్నదానిలో నీకు, నీ పిల్లలకు పెడతాం. భర్తని పోగొట్టుకున్న ఆడది వీధిలో కాలు పెట్టడం ఎంతటి తప్పో నీకు తెలియదా!’ అన్నారు. దాంతో, ఇంట్లో ఉంటూనే ఆమె రకరకాల వ్యాపారాలు చేసి నాలుగు డబ్బులు సంపాదించింది. ఇంతలో ‘ఇంటర్నేషనల్ మెడికల్ కోర్ వాళ్లు మహిళలకు విద్య, ఉద్యోగ, స్వయం ఉపాధి వంటి కార్యక్రమాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని తెలిసి అక్కడ చేరింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో చదువుకున్న నదియాకు అక్కడ శిక్షకురాలిగా ఉద్యోగం వచ్చింది.

ఒక పక్క శిక్షణ ఇస్తూనే మరోపక్క లింగవివక్ష, స్వయం ఉపాధి, ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి ఉచితంగా మహిళలకు కౌన్సెలింగ్‌లు చేయసాగింది. ఉద్యోగం చేస్తూనే ప్రయివేటుగా ఇంజనీరింగ్ చదువుని పూర్తిచేసిన నదియా తోటి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచింది. నదియా జీవితంలో గెలవడానికి తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదు. ‘ఇంటర్నేషనల్ మెడికల్ కోర్’వాళ్లు నదియాను ఒక ఉద్యోగినిగానే కాదు ఒంటరి మహిళలకు స్ఫూర్తిగా పరిచయం చేస్తున్నారు.    
 
 

మరిన్ని వార్తలు