-

నాన్న నేను నవ్వు

28 Aug, 2015 23:34 IST|Sakshi
నాన్న నేను నవ్వు

నాన్నగారు మరో అందమైన ప్రపంచానికి వెళ్లిన తర్వాత  నాగ్‌కిది రెండవ పుట్టిన రోజు. పిల్లలు తల్లిదండ్రుల నీడ దాటి వెళుతున్న మోడ్రన్ టైమ్స్ ఇవి. నాగ్ మాత్రం ఇంకా నాన్నతో... నవ్వుల తోటలో నడుస్తున్నాడు. నాన్నను తలచుకుంటున్నాడు. నాన్న నవ్వుతో పరిమళిస్తున్నాడు. మనసు అందమైనది అయితే ప్రపంచం అందంగా కనబడుతుందని అనడానికి నాగ్ ఒక ఉదాహరణ. అందుకేమో నాగ్ అందం వయసుతో పెరుగుతోంది. మీ వయసు ఎంత అని అడిగితే... ‘నాకింకా ఇరవై ఒకటే’ అని నవ్వేశాడు.ఏఎన్నార్ మనందరికీ పంచిన పూలతో బొకే తయారుచేసి ‘నాగింకా 21’ అని బర్త్‌డే విషెస్ చెబుతున్నాం.
 
 
మిమ్మల్ని చూస్తోంటే వయసు పెరుగుతోందా.. తరుగుతోందా అనిపిస్తోంది. శారీరక వయసుని పక్కనపెడితే మీ మనసు వయసు తెలుసుకోవాలని ఉంది?
మనసు వయసా (నవ్వుతూ). 21ఏళ్లు ఉంటాయేమో. ఐ ఫీల్ యంగ్ ఆల్ ది టైమ్. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో ఎవరితో ఉన్నా నేను యంగ్‌గా ఉన్నట్లే అనిపిస్తుంటుంది. నా ప్రవర్తన కూడా అలానే ఉంటుంది.
     
అలా యంగ్‌గా ఉండటం వెనక సీక్రెట్ ఏంటి?

ఆలోచనలు యంగ్‌గా ఉండడమే. మీరు కనుక మనసులో ‘నాకు ఏజ్ అయిపోయింది’ అనుకుంటే మీరెంత యంగ్ అయినా ఓల్డ్‌లానే ఫీలవుతారు. అదే, 70, 80 ఏళ్ల వయసులోనూ ‘నేను టీనేజ్’ అనుకుంటే.. ఆలోచనలు అలానే ఉంటాయి.

మీ మనసు యంగ్‌గా ఉండటంతో పాటు.. మీ ఫిట్‌నెస్ మీ వయసుని తెలియనివ్వదు. అసలేం చేస్తారు?
లైఫ్ స్టయిల్ బాగుంటే అన్నీ బాగుంటాయి. మనం లోపలికి ఏం తీసుకుంటామో అదే బయటికి ప్రతిబింబిస్తుంది. అందుకే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అది కూడా మన శరీరానికి ఏది సరిపడుతుందో తెలుసుకోవడం ముఖ్యం. మంచి ఆహారంతో పాటు వర్కవుట్స్ కూడా ఫిట్‌గా ఉండటానికి కారణమవుతాయి.

ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ‘సైజ్ జీరో’ సినిమా కోసం అనుష్క లావయినట్లు అవుతారా?
నా వల్ల కాదండి బాబూ. అలాంటి పాత్రలు వస్తే నిర్మొహమాటంగా నిరాకరించేస్తా.

ఎందుకని... మీకు ఇలా స్లిమ్‌గా ఉండటమే ఇష్టమా?
స్లిమ్ గురించి కాదు. అంత లావయ్యి, మళ్లీ సన్నబడటం అంటే ఆరోగ్యంతో ఆడుకున్నట్లే. శరరీంలో ఉండే అవయవాలకు అంత శ్రేయస్కరం కాదు.

అవయవాల మీద ప్రభావం అంటే.. ఎలా?
మన శరీరం ఒక లైఫ్ స్టయిల్‌కి అలవాటు పడిపోతుంది. అందుకు భిన్నంగా వెళ్లినప్పుడు ఇబ్బంది రావడం ఖాయం. ఉదాహరణకు లావు పెరగడం కోసం అప్పటివరకూ తిననివి కొన్ని తింటాం. అది శరీరానికి కొత్త కాబట్టి, ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత సన్నబడటం కోసం తిండి తగ్గిస్తాం. అవయవాలు మళ్లీ దానికి అలవాటుపడాలి. దాంతో ఇబ్బందిపడతాయి.

ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన శరీర తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా?
  హండ్రెడ్ పర్సంట్ అర్థం చేసుకోవాలి. టీనేజ్‌లో, అంతకుముందూ మనకు ఫిట్‌నెస్ గురించి పెద్దగా అవగాహన ఏర్పడే అవకాశం లేదు. తర్వాత తర్వాత దాని మీద ఆసక్తి ఏర్పడుతుంది. అప్పట్నుంచీ మన శరీర తత్వాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెడతాం. నేను హీరోని కాబట్టి, నార్మల్ పర్సన్ కన్నా కొంచెం ఎక్కువ అవగాహనే ఉంటుంది. ఫిట్‌నెస్‌కి సంబంధించిన బుక్స్ చదువుతాను. డాక్టర్స్‌ని అడుగుతాను. ఇంటర్నెట్ ద్వారా కూడా సమాచారం తెలుసుకుంటాను.
     
శారీరకంగా హెల్తీగా కనిపిస్తున్నప్పటికీ మానసికంగా డల్‌గా ఉన్నారనిపిస్తోంది.. బహుశా మీ నాన్నగారు (ఏయన్నార్) లేరనే ఇంపాక్ట్ మీ మీద బాగా ఉన్నట్లనిపిస్తోంది?

నాన్నగారు లేని ఇంపాక్ట్ హండ్రెడ్ పర్సంట్ ఉంది. ‘ఐ మిస్ హిమ్ ఎ లాట్’. అన్నపూర్ణ స్టూడియోస్‌కి వెళ్లినప్పుడు బాగా గుర్తొస్తారు. ముఖ్యంగా ‘మనం’ హౌస్ సెట్ చూస్తే చాలా గుర్తొస్తారు. నాన్నగారి చివరి సినిమా చేసిన సెట్ కాబట్టి, ‘మనం’ హౌస్ చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది. నాన్నగార్ని తల్చుకున్నప్పుడు ముఖ్యంగా నాకు గుర్తొచ్చేది ఆయన నవ్వు. అందుకని నాకు తెలియకుండా నాకే ఓ చిన్న స్మయిల్ వచ్చేస్తుంది. అలా నవ్వుతూ బతకాలనిపిస్తుంటుంది.

ఫాదర్‌గా మీరు బెటరా? మీ నాన్నగారా?
నాన్నగారిలాంటి మంచి ఫాదర్ దొరకరు. ఆయన నాకు తండ్రి కావడం లక్కీ. నా పిల్లలు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు (నవ్వుతూ). ఒకవేళ నటుడిగా నాన్నగారు బెటరా? మీరు బెటరా? అని అడిగితే ఏం చెబుతాను ‘నాన్నగారే’ అని చెబుతాను కదా. పెంపకం విషయంలో కూడా అంతే.

పిల్లల్ని పెంచే విషయంలో మీ నాన్నగార్ని అనుసరిస్తారా?
అఫ్‌కోర్స్ నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారో అలాగే నా పిల్లలను నేను పెంచుతుంటాను. ఇంటర్‌ఫియరెన్స్ ఉండదు కానీ, గెడైన్స్ ఉంటుంది.
ఇప్పుడు అఖిల్ కూడా హీరోగా చేస్తున్నాడు కాబట్టి, మీరెలాంటి గెడైన్స్ ఇస్తున్నారు?
కథ విన్నాను. బాగా నచ్చింది. వీవీ వినాయక్ మంచి దర్శకుడు. రైట్ ట్రాక్‌లో ఆర్టిస్టులను ప్రేక్షకులకు దగ్గర చేయగలుగుతాడు. ఈ సినిమా చేయాలని అఖిల్ అనుకున్నాడు. ఆ ఫ్రీడమ్ ఇచ్చాను. గెడైన్స్ ఇస్తాను.

విదేశాల్లో షూటింగ్ జరిగినప్పుడు మీరు వెళ్లారు కదా.. అప్పుడు అఖిల్ నటన చూసి ఏమనిపించింది?
చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. కెమెరా ముందు చాలా ఈజ్‌తో కనిపించాడు. ఏ ఆర్టిస్ట్‌కి అయినా అది ముఖ్యం. ఆర్టిస్ట్ అంటే డ్యాన్సులు, ఫైట్స్ చేయడం మాత్రమే కాదు. అన్నీ చేయాలి. పర్‌ఫెక్ట్‌గా యాక్ట్ చేయాలంటే కెమెరా ఫియర్ ఉండకూడదు. చిన్నప్పట్నుంచీ అఖిల్ తనేం చేయాలనుకుంటే అది పర్‌ఫెక్ట్‌గా చేస్తాడు. ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు క్రికెట్ నేర్చుకుంటానన్నాడు. పర్‌ఫెక్ట్‌గా ఆ పని చేశాడు. ఇప్పుడు ఆర్టిస్ట్‌గా కూడా పర్‌ఫెక్షనిస్ట్ అనిపించుకుంటాడు.

సినిమా తారలు రాజకీయాల్లోకి రావడం అనేది ఎప్పట్నుంచో వస్తోంది. మీకా ఉద్దేశం లేదా?
రాజకీయాల మీద నాకు ఆసక్తి లేదు. అంత టైమ్ కూడా లేదు. రాజకీయాలు అవసరం. పాలిటిక్స్‌లో వస్తున్న మార్పులను ఫాలో అవుతుంటాను.

అఖిల్‌ని అన్నపూర్ణ ద్వారా కాకుండా వేరే బేనర్ ద్వారా పరిచయం చేయడానికి కారణం?
బేనర్ గురించి ఆలోచించలేదు. ఎప్పట్నుంచో కథలు వెతికే పని మీద ఉన్నాం. విక్రమ్‌కుమార్ కొన్ని కథలు చెప్పాడు. ‘మనం’ చూశాక అఖిల్‌తో సినిమా చేస్తానని వినాయక్ ముందుకొచ్చాడు. కథ బాగుంది. నితిన్, అఖిల్ బాగా క్లోజ్. బ్రదర్స్‌లా ఉంటారు. నితిన్ వచ్చి సినిమా తీస్తానని అంటే ఓకే అన్నాను. చెప్పాలంటే నా ప్రొడక్షన్ కన్నా బాగా చేస్తున్నారు.

అఖిల్‌కి బాలీవుడ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా?
యాక్చువల్‌గా తెలుగుకన్నా ముందే హిందీలో అవకాశాలు వచ్చాయి. కానీ, తొందరపడొద్దని చెప్పాను. అలాగే, ఇక్కడ ఒక హిట్ సినిమా చేసి, ఆ చిత్రం హిందీ రీమేక్‌లో నటించమన్నాను. అప్పట్లో నేను ‘శివ’ అలానే చేశాను. ఇక్కడ హిట్టయిన తర్వాత హిందీలో చేశాం. ఇప్పటికీ నన్ను హిందీలో శివ అనే పిలుస్తారు.

{పయోగాత్మక చిత్రాలు ఇష్టమేనా?
ప్రయోగం అంటే ఏంటో నాకర్థం కాదు. నేను చేసిన ‘రాజన్న’, ‘గగనం’ ఎక్స్‌పరిమెంట్సా? ఏమో చెప్పలేను. ‘మనం’ కూడా ఎక్స్‌పరిమెంట్ అని అనను. ఇప్పుడో ఫ్రెంచ్ సినిమా రీమేక్‌లో నటిస్తున్నాను. అందులో కంప్లీట్ ప్యారలైజ్డ్ పర్సన్‌ని. దాన్ని ఎక్స్‌పరిమెంట్ అంటారా? తెలియదు. అందరూ చూసే సినిమాలు చేయాలనుకుంటాను.

‘బాహుబలి’తో తెలుగు సినిమా కూడా వందల కోట్ల క్లబ్‌లో చేరింది. దానివల్ల మన సినిమా మార్కెట్ పెరిగింది కదా?
అది ఓకే కానీ, అన్ని సినిమాలూ ‘బాహుబలి’ అవ్వవు. రాజమౌళి డ్రీమ్ చాలా పెద్దది. నిర్మాతలు అంత ఖర్చు పెట్టి తీయడం, ప్రభాస్ మూడేళ్లు వేరే సినిమాలు చేయకపోవడం, రానా తదితరులు కూడా చాలా కష్టపడటం.. దానికి తగ్గ ప్రతిఫలాన్ని ప్రేక్షకులు ఇచ్చారు.
 
రాజమౌళితో సినిమా చేయాలని ఉందన్నారు.. ఎప్పుడు చేస్తున్నారు?
నాతో చేయాలని ఆయనకుండాలి కదా (నవ్వుతూ). ‘బాహుబలి’ రెండో పార్ట్ అవ్వాలి. ఆ తర్వాత రాజమౌళి ‘మహాభారతం’ అంటున్నారు. ఏమో చూడాలి. నాకు పౌరాణిక చిత్రాలంటే ఇష్టమే.

ఫైనల్లీ... పుట్టినరోజు నాడు ఎలా గడుపుతారు.. ఏదైనా మర్చిపోలేని పుట్టినరోజు ఉందా?
ఫ్యామిలీతోనే ఉంటాను. పర్టిక్యులర్‌గా ఆ రోజే గుడికి వెళ్లాలనుకోను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ విషెస్ చెబుతారు. బర్త్‌డే నాడు నాకు ఇష్టమైన వాళ్లతో స్పెండ్ చేయాలనుకుంటాను. నా ఏ పుట్టినరోజు నాడూ ఏదీ ప్రత్యేకంగా జరగలేదు. అందుకని మెమొరబుల్ బర్త్ డే లేదు. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదు. మంచి నిర్ణయం ఎప్పుడనిపిస్తే అప్పుడు ఆచరణలో పెట్టేస్తా.    
 - డి.జి. భవాని
 
ప్రస్తుతం చేస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ గురించి చెబుతారా?
 ఇందులో తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రలు చేస్తున్నాను. తండ్రి పాత్ర ఆత్మ రూపంలో కనిపిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత రమ్యకృష్ణతో కలిసి నటిస్తున్నాను.  నేనెక్కువ సినిమాలు చేసింది రమ్యతోనే. తండ్రి పాత్ర సరసన రమ్యకృష్ణ, కొడుకు సరసన లావణ్య నటిస్తున్నారు.

ఆత్మ రూపంలో కనిపిస్తారా.. దెయ్యాలంటే నమ్మకం ఉందా?
 ఇప్పటివరకూ నాకెలాంటి అనుభవం కలగలేదు. అందుకని నమ్మకం గురించి చెప్పలేను. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పగలను. తెలుగు సినిమాల్లో ఈ ఫార్ములా మాత్రం వర్కవుట్ అవుతుంది. దర్శకుడు అనిల్ కల్యాణ్ ఈ చిత్రాన్ని చాలా  కాన్ఫిడెంట్‌గా తీస్తున్నాడు.
 
 

మరిన్ని వార్తలు