నయా నిజం..గాంధీయిజం

2 Oct, 2019 04:28 IST|Sakshi

ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించాడు! బలహీనుడు కాక బలవంతుడా? సైన్స్‌ తెలీదు, ఆధునికుడు కాదు! గోచిగుడ్డ, చేతికర్ర, కళ్లజోడు, బోడిగుండు.. ఏముంది ఆకర్షణ? రాట్నం వడకమంటాడు. ఖాదీ అంటాడు. గ్రామాలకు వెళ్లమంటాడు. ఎలా? ఇలాంటి మాటలు నలభై, యాభై ఏళ్లుగా వినబడ్డాయి, కనబడ్డాయి, చర్చించబడ్డాయి, స్థిరపడ్డాయి! నిజానికి గాంధీ ఇంతేనా? మరేమీ కాదా?

‘‘రండి! మగటిమి చూపండి! ఈ పూజారులను తన్ని తరమండి. చచ్చినా మారలేరు కనుక, వీరు ప్రగతి విరోధులు! వీరికి హృదయ వికాసం లేదు. శతాబ్దాలుగా పేరుకుపోయిన గుడ్డి నమ్మకాల్లోంచి, ప్రజాహింస నుంచి వీరు పుట్టుకొచ్చారు. ముందుగా కూకటివేళ్లతో పెరికి పారవేయవలసింది వీరి పూజారితనాన్నే. మీ కలుగులలో నుంచి వెలికి రండి! నలుదిక్కులకు చూడండి! దేశదేశాలు ఎలా పురోగమిస్తున్నవో గమనించండి..’’

ఈ మాటలు ఎవరివో ఊహించగలమా? ప్రచండమైన ఉరుముల్లాంటి ఈ పలుకులు వివేకానంద అన్నారని ఆశ్చర్యం కలగదా? ఇందులో భావం ఎంత తీవ్రంగా ఉందో, భాష అంత పదునుగా ఉంది కనుకనే ఒళ్లు జలదరిస్తుంది. 1972లో సంపాదకీయం కోసం నార్ల వెంకటేశ్వరరావు చేసిన అనువాదమిది. గాంధీజీ వాదనను, వాదనా విధానాన్ని గమనిస్తే అంతటి ఆశ్చర్యం కలుగుతుంది. గాంధీని పోల్చగలిగితే మనకు బుద్ధుడు, ఏసు, వివేకానంద కనబడతారు. మరోరకంగా చెప్పాలంటే గాంధీ వీరందరికన్నా సార్వత్రికంగా, సహజంగా, సర్వతోముఖంగా కనబడతారు. అందుకే ఆయన ఐదు వేల సంవత్సరాల (అది ఎంతైనా కావచ్చు) మానవ చరిత్రలో అపురూపమైన వ్యక్తి.

బలము, బలహీనత
గాంధీ మానసికంగానే కాదు, శారీరకంగానూ బలవంతుడు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్ప చివరిదాకా ఆయన జనంలో ఉన్నారు. దేశమంతా స్వాతంత్య్ర సంబరాలలో మునిగి ఉంటే ఆయన నౌకాలిలో గాయపడిన హృదయాలను సముదాయించారు. ఆయన సగటున రోజుకు 18.22 కిలోమీటర్లు నడిచేవారు. బోయర్‌ యుద్ధ సమయంలో క్షతగాత్రులను మోసుకుంటూ 40 కిలోమీటర్లు నడిచిన దాఖలాలున్నాయి. చివరి దశలోనూ రోజుకు 18 గంటలు పనిచేశారు.  

వైద్యం, వైద్య దృష్టి
ఆశ్రమంలోని ఆసుపత్రికి తెప్పించిన అస్థిపంజరాన్ని బీరువా తీసి పరిశీలనగా చూశాడు గాంధీ. దేహ నిర్మాణం మీకు తెలుసునా అని ఆయనను అడిగినపుడు దేహనిర్మాణం, ఏ అవయవంలో ఎన్ని ఎముకలుంటాయో ఏడెనిమిది నిమిషాలు వివరించాడు. చివరలో అస్థిపంజరం గడ్డం పట్టుకుని, ‘‘నాయనా! నేను కూడా ఏదో ఒకనాడు నీలాగే ఔతానులే’ అన్నాడు. (ఊట్ల కొండయ్య రచన ‘గాంధీపథం’1982 ప్రచురణ నుంచి) 1888 లోనే కాదు, 1908లో సైతం మెడికల్‌ డిగ్రీ సంపాదించి పూర్తిస్థాయి వైద్యుడిగా స్థిరపడాలని గాంధీ ప్రయత్నించాడు.

కానీ, రెండుసార్లు రెండు ఆటంకాలు ఎదురయ్యాయి. ఆయన ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, హోమియోపతిని ఆదరించారని భావిస్తాం. అయితే ఆధునిక వైద్యరంగంలో పరిశోధకుల వినయాన్ని, చిత్తశుద్ధిని విశేషంగా శ్లాఘించి మన ఆయుర్వేద వైద్యులు మెరుగుపడాలని కోరారు. 1925లో ఆయుర్వేదంలో లైంగిక సామర్థ్యం పెంచుకోవచ్చనే ప్రకటనలను గట్టిగా వైద్యుల మధ్యనే ఖండించారు.

అప్‌డేట్‌ అవడం:
గాంధీ అనేక అంశాలపై చూపిన శ్రద్ధ ఆసక్తికరం. ఆయన ఒక అంశంపై ఆసక్తి చూపడం ఆరంభిస్తే, లోతుగా అధ్యయనం చేసేవారు. జీవితంలో చిన్న చిన్న అంశాలు అని మనం భావించే వాటిపై ఆయన చూపిన అమితమైన శ్రద్ధే ఆయన మానవతా వాదంలో విశిష్టత కావచ్చు. అది ఆయన వ్యక్తిత్వానికి మూలం అని ‘బహురూపి’ పుస్తకానికి 1964లో ముందుమాట రాస్తూ జవహర్‌ లాల్‌ అంటారు. ఏదైనా ఒక విషయం గురించి పలు  అభిప్రాయాలుంటే తాజా అభిప్రాయాన్నే తన అభిప్రాయంగా, సవరించిన అభిప్రాయంగా పరిగణించమంటాడు. ఇది పూర్తి శాస్త్రాభివేశ దృక్పథం.

నగరాల నిరంతర అహంకారం
ఇవి ఆయన మాటలే. ఇందులో అహంకారం అనేది ఎంత తీవ్రంగా ఉందో, నిరంతరం అనేది అంతలోతుగా ఉంది. ఇందులో వనరుల దోపిడీ, కాలుష్య కారణ వ్యవస్థలు, వినియోగలాలసత, పటాటోపం, కల్లాకపటం.. ఇలా చాలా వర్తమాన కాలపు దుర్గుణాలు మనకు ద్యోతకమవుతాయి. ఈ విధానాలను ఇంత తీవ్రంగా వ్యతిరేకించిన గాంధీ మరెంతటి విప్లవవాది?

స్త్రీ హృదయం–మాతృభావన
If nonviolence is the law of our being, the future is with woman..ఈ మాటన్నది గాంధీ అని చాలామంది నమ్మకపోవచ్చు! సైనికబలంలో పురుషుల కంటే స్త్రీలు మెరుగని గాంధీ నిశ్చయం. అహింసా సమరంలో నైతిక బలమే ముఖ్యం.. ఇదీ గాంధీ మహిళాదృష్టి. దేవదాస్‌ గాంధీ 1900లో జన్మించినపుడు మిగతా పిల్లలను చూసుకుంటూ, కస్తూరిబాయి సుఖప్రసవానికి తనే ఏర్పాట్లు చేశారు. వైద్య పుస్తకాలు చదివి, మంత్రసానిగా మారిన స్త్రీ హృదయం ఆయనది.

మాతృభాషలకు ఊతం
ఇంగ్లండ్‌లో చదివి, దక్షిణాఫ్రికాలో ప్రజానాయకులై కూడా తన తొలి పుస్తకం ‘హింద్‌ స్వరాజ్‌’ను 1909లోనూ, తర్వాత 1925లో ఆత్మకథను గుజరాతీ భాషలో రాశారు. ఇంగ్లిష్‌ చదువుతోనే మన బానిస ధోరణి అలవడిందని ఆయన అంటారు. నౌకాలి ఉత్పాత సమయంలో పాత్రికేయులు అడిగిన దానికి ఆయన–  ‘నా జీవితమే నా సందేశం’ అని బెంగాలీలో చెప్పారు (అప్పుడు కలకత్తాలో ఉన్నారు). సైన్స్‌ బోధన మాతృభాషలలో జరగాలని అంటారు.  

యంత్రాలను నిరాకరించలేదు
సర్వేపల్లి రాధాకృష్ణ 1969లో రాసిన ‘మహాత్మాగాంధీ’అనే వ్యాసంలో– ‘నా శరీరమే అతి సూక్ష్మాంశాలతో కూడిన అతి సంకీర్ణమైన యంత్రమని నాకు, తెలిసినపుడు నేను యంత్రాల వ్యతిరేకిని ఎలా అవుతాను? చరఖా అనేది యంత్రం.పళ్లు కుట్టుకునే పుల్ల యంత్రం. యంత్రాలను గురించిన వ్యామోహానికి మాత్రం నేను వ్యతిరేకినే’.. ఇది గాంధీ విజన్‌.

కలుపుకు పోవడం, సంభాషించడం
1941 జనవరి 26 ‘హరిజన్‌’పత్రికలో ఇలా రాశారు ‘‘కమ్యూనిస్టులందరూ చెడ్డవారు కాదు. కాంగ్రెస్‌ వారందరూ దేవతలూ కాదు. కాబట్టి కమ్యూనిస్టు అంటే నాకు దురభిప్రాయం లేదు. కానీ వారి సిద్ధాంతాలను మాత్రం ఆమోదించలేను’’(గాంధీ దర్శనం, ఆదర్శ గ్రంథమండలి ప్రచురణ, 1959, అనువాదం ఉప్పులూరి వెంకట సుబ్బారావు). ఆయన అభిప్రాయాలలో రాజీ లేదు. భాష, వ్యక్తీకరణ కడు సాత్వికం.
– డా. నాగసూరి వేణుగోపాల్‌

మరిన్ని వార్తలు