కాయలివ్వొద్దంటే   చెట్టు వింటుందా?!

13 Jun, 2018 00:01 IST|Sakshi
వ్యవసాయ  విరమణ చేసిన నాగులు, పూర్ణలకు సన్మానం చేస్తున్న కొడుకులు, కోడళ్లు 

మనకెంత ప్రేమైనా ఉండొచ్చు..చెట్టు మీద, భూమి మీద, ఆకాశం మీద.వాటి కష్టాన్ని గుర్తించి చెట్టుని కాయొద్దని చెప్పినాభూమిని పండించొద్దని చెప్పినాఆకాశాన్ని వర్షించొద్దని చెప్పినాసూర్యుణ్ణి శక్తినివ్వొద్దని చెప్పినాఅవి వింటాయా!!ప్రకృతిలో ఉన్న దైవత్వమే.. నిస్వార్థంగా ఇవ్వడం.అలా ప్రకృతిలా.. ఇవ్వడమే తెలిసిన మట్టి మనిషి రైతు. ఆయన్ని ఆగమంటే..  చేసే పని ఆపమంటే..‘అయ్యా.. అందరికీ రిటైర్మెంట్‌ ఉంటుందినీకూ ఉంటే బాగుండు’ అని పిల్లలు పండుగ చేస్తే మాత్రం వింటాడా?!

ఉద్యోగ విరమణ అంటే ప్రభుత్వ.. ప్రైవేట్‌ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు, అధికారులకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మాత్రం నిత్యం చెమటోడుస్తూ ఏళ్లకేళ్లు కుటుంబ పోషణ కోసం ఏటికి ఎదురీదే పరిస్థితుల్లో సైతం వ్యవసాయాన్ని దైవంగా భావించి సాగు చేసిన ఓ రైతుకు ఆయన కుటుంబం వ్యవసాయ విరమణ ఇచ్చింది! ‘ఇన్నేళ్లుగా మా ఉన్నతి కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసిన కాయ కష్టం చాలు.. మేము ఎదిగాం.. ఇక మీరు విశ్రమించండి’ అంటూ ఆ ముగ్గురు కుమారులు తమ తండ్రికి ఇచ్చిన భరోసా ఇది.  ఖమ్మం సమీపంలోని రఘునాథపాలెం మండలం హర్యాతండాకు చెందిన బాణోతు నాగులు ఐదు దశాబ్దాలుగా పుడమినే నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఎకరంన్నర పొలం సాగు చేసుకుని, బతుకు బండి నడుపుకుంటూ వస్తున్న నాగులుకు వ్యవసాయం అంటే అమితమైన ప్రేమ. ఏ వృత్తిలో అయితే కష్టపడుతున్నామో.. సమస్యలు ఎదుర్కొంటున్నామో.. ఫలితం సైతం అక్కడి నుంచే పొందాలన్నది ఆయన విధానం. అందుకే 50 ఏళ్ల సాగు జీవితంలో విత్తు మొలకెత్తినా.. ఎండిపోయినా.. చేనులో పంట పండకపోయినా.. పండిన మిర్చికి ధర రాకపోయినా ఆయన వీసమెత్తయినా చలించలేదు. 

విశ్రాంతి ఎరుగని రైతు
నేల తల్లి అన్యాయం చేయదని నాగులు నమ్మకం.  ఈ ఏడాది కాకపోతే మరో ఏడాది ప్రయత్నిద్దామన్న ఆయన పట్టుదల, నిరంతర శ్రమ, ఏ చేనుకు ఏ సమయంలో ఎటువంటి మందు వేయాలో.. అదును దాటకముందే సదరు పంటకు పురుగు సోకకుండా ఎలా కాపాడుకోవాలో ఆయనకు అనుభవం నేర్పిన విద్య. అందుకే నాగులు 65 ఏళ్ల వయసులోనూ గ్రామస్తులకు తలపండిన వ్యవసాయæదారుడిలా, మేలిమి పంటలను పండించే శాస్త్రవేత్తగా కనిపిస్తాడు. సాగుకు పెట్టుబడి లేని రోజుల్లో అప్పు చేసినా.. వ్యవసాయంలో వచ్చిన పంట దిగుబడి అప్పు కట్టడానికి సైతం సరిపోకపోయినా ఆయనలో ఆత్మవిశ్వాసం సడలలేదు. వ్యవసాయాన్ని విరమించి విశ్రాంతిని తీసుకోలేదు. ఇప్పుడైనా.. వ్యవసాయానికి  తనను కుటుంబం దూరం చేస్తుందన్న బాధ ఒకవైపు ఉన్నా.. తన కొడుకులు ఉన్నతులు అయ్యారన్న సందేశాన్ని సమాజానికి చాటి చెప్పినట్లవుతుందనే, మనిషికి ఏదో ఒక స్థాయిలో సంతృప్తి అవసరమన్న భావనను పది మందికి తెలియజేయాలన్న లక్ష్యంతోనే నాగులు వ్యవసాయ విరమణకు అంగీకరించాడు. 

పోరు పెట్టి మాన్పించారు
భార్య, కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతో ఎకరంన్నర భూమిని పదెకరాల వరకు పెంచిన ఘనత నాగులుది. ఆయనకు భార్య పూర్ణ, ముగ్గురు కొడుకులు. ఇందులో ఒక కొడుకు విజయవాడలో ఆబ్కారీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుండగా.. మరో కొడుకు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ రంగంలో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇక మూడో కొడుకు తన దగ్గరే ఉన్నా.. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు చదువుకుని తన కాళ్లపై తాను నిలబడగలిగే సామర్థ్యం తెచ్చుకున్నాడు. ‘‘మెరికల్లాంటి ముగ్గురు కొడుకులం ఉన్నాం.. ఇక నీకు వ్యవసాయంతో పనేంటి.. నీ కష్టాన్ని మేము చూడలేమంటూ..’’ ఆ కుటుంబ సభ్యులు చేసిన పోరుకు నాగులు ఎట్టకేలకు సరే అనాల్సి వచ్చింది.

ఆధారపడే అవసరమే లేదు
తమ పది ఎకరాల వ్యవసాయ భూమిని నాగులు ఈ ఏడాది నుంచి కౌలుకు ఇస్తున్నారు. కౌలు రైతు పడుతున్న కష్టం కళ్లారా చూసి తనకు తోచిన సలహా ఇస్తూ శేష జీవితాన్ని నాగులు, పూర్ణ దంపతులు గడిపేయదలచుకున్నారు. ఇక ఆ పదెకరాలకు వచ్చే కౌలు డబ్బులకు  ఈ భార్యాభర్తలిద్దరే సర్వ హక్కుదారులు. ‘వ్యవసాయం చేసినప్పుడు ఏ రకంగానైతే ఆర్థిక స్వేచ్ఛను అనుభవించారో.. ఇప్పటికీ అదే స్వేచ్ఛ మీకు ఉండాలని’ ఆయన కుటుంబం ఆకాంక్షించింది.  

తల్లిదండ్రులు పడిన కష్టానికి.. విరమణతో తీర్చుకున్న రుణం
నాగులు ‘వ్యవసాయ విరమణ’ వేడుకను ఆయన కుమారులు అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ ఏడాది మే 29వ తేదీన గ్రామంలో మేళతాళాలతో వచ్చి తండ్రిని ఘనంగా సత్కరించారు. ఐదు పదుల వ్యవసాయ జీవితంలో నాగులు తన కుటుంబాన్ని సంరక్షించిన తీరును, వృద్ధిలోకి తెచ్చిన వైనాన్ని అక్కడికి వచ్చిన ప్రతి అతిథి కొనియాడారు. తండ్రికి కష్టం రాకుండా కొడుకులు చూసుకోవడం.. ముదిమి వయసులో మేమున్నామంటూ తల్లిదండ్రులకు అండగా ఉండటం ఊరు ఊరునే కాదు.. జిల్లా ప్రజలందరినీ అబ్బురపరిచింది. ఇది ఇంకెందరికో స్ఫూర్తిదాయకంగా నిలవాలని ప్రతి ఒక్కరూ కాంక్షించారు. ఉద్యోగ విరమణ రోజున ప్రభుత్వ ఉద్యోగిని ఎలా సన్మానిస్తారో.. అదే విధంగా వ్యవసాయ విరమణకు సమ్మతించిన ఆ రైతుకు అరుదైన గౌరవం కుటుంబ సభ్యుల ద్వారా దక్కింది. ‘మా అమ్మానాన్న మా ఉన్నతి కోసం పడిన కష్టానికి గుర్తుగా ఈ సన్మానం’ అంటూ కుమారులు చేసిన ప్రసంగాలు ఆహూతులను కంటతడి పెట్టించాయి. ఈ తరహా వ్యవసాయ విరమణ ప్రతి రైతు కుటుంబానికి స్ఫూర్తిదాయకం కావాలన్నది ఆ గిరిజన కుటుంబం ఆకాంక్ష.
– మాటేటి వేణుగోపాల్‌ రావు, సాక్షి, ఖమ్మం

మరిన్ని వార్తలు