మనుషులు మారారు! బతుకులింకా మారలేదు!!

4 Nov, 2014 23:38 IST|Sakshi
మనుషులు మారారు! బతుకులింకా మారలేదు!!

నల్లమల అడవుల్లో అదో కుగ్రామం.ఒకప్పుడు దాని పేరు సెటిల్‌మెంట్.ఇప్పుడు సిద్ధాపురం. ఆ ఊరిలో క్రీడా పతకాన్ని సాధించిన యువకుడు ఉన్నాడు. కంప్యూటర్స్‌లో పట్టభద్రులున్నారు. కానీ, పట్టా చేతపుచ్చుకుని ఉద్యోగానికెళితే ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. పెళ్లి చేసుకుంటామంటే అమ్మాయినివ్వరు. ఆ ఊరి ఆడపిల్లను కోడలిగా చేసుకోవడానికి ఏ ఊరూ ముందుకు రాదు. ఇది ఏ దేవుని శాపమూ కాదు. కేవలం స్వార్థపరుల కుయుక్తుల ఫలితం! బ్రిటిష్ కాలంలో వెలసిన ఈ గ్రామ వివరాల్లోకి వెళితే...
 
ఒకప్పుడు చెన్నై, బేతంచర్ల, దేవరకొండ, కప్పట్రాళ్లతిప్ప ప్రాంతాల్లో కరడుగట్టిన దొంగలుండేవారు. వారిలో పరివర్తన తీసుకువచ్చే ప్రయత్నం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. దాదాపుగా 30 మంది దొంగలను సమీకరించి, వారిని కుటుంబాలతో సహా ఒక ప్రదేశానికి తరలించింది. తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసి, దానికి సెటిల్‌మెంట్ అని పేరు పెట్టింది. నిత్యజీవిత అవసరాలకు తగినట్లు సౌకర్యాలు సమకూరుస్తూ క్రమంగా గ్రామంగా రూపుదిద్దింది. బడి, ఆసుపత్రి, పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసింది. ఆ గ్రామం పేరు... సిద్ధాపురం. నల్లమల అటవీ ప్రాంతంలో, కర్నూలు జిల్లా కేంద్రానికి 82 కి.మీ.ల దూరంలో ఉందీ ఊరు.
 
నిజానికి బ్రిటిష్‌వారి కాలంలో వీరి జీవితాలను బాగు చేయడానికి చాలా కసరత్తే జరిగింది. పని మీద దృష్టి మళ్లిస్తే దొంగతనాలను మరిపించవచ్చనే ఉద్దేశంతో 70 ఎకరాల సర్కారు పొలాన్ని ఇచ్చి, చెరువు తవ్వి సాగుచేసుకోమన్నారు నాటి అధికారులు. పశువుల పెంపకం అలవాటు చేశారు. సభ్యసమాజంలో ధైర్యంగా జీవించగలిగేటట్లు వారిలో పరివర్తన తీసుకువచ్చారు. అంతా అనుకున్నట్లే జరిగితే... ఇది ఓ ఆదర్శగ్రామం అయ్యేది. అయితే నూటికి తొంభై మంది మంచిగా మారిపోయి, గౌరవప్రదంగా జీవిస్తున్నప్పటికీ పదిశాతం మంది దొంగతనాలను వదలకపోవడంతో సిద్ధాపురం ఓ ‘దొంగల గ్రామం’గా ముద్ర వేయించుకుంది. ఆ ముద్ర నుంచి బయట పడడానికి నాటి నుంచి నేటి వరకూ అష్టకష్టాలు పడుతూనే ఉంది.
 
స్వాతంత్య్రం వచ్చింది... కానీ!
దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. బ్రిటిష్ పాలకులు దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. కానీ స్థానిక అధికారులకు సిద్ధాపురం గురించి అవగాహన లేకపోవడంతో పర్యవేక్షణ లోపించింది. పరివర్తన చెందకుండా ఉన్న పదిశాతం మంది వీరవిహారం చేయడం మొదలు పెట్టారు. తెలుగు నేల మీదే కాక తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఎక్కడ దొంగతనాలు చేయాలన్నా వీరే ముందుండేవారు. ఒక సమయంలో వీరు తమకు తెలియకుండానే కొందరు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయారు. వారు చెప్పినట్టు నాటు సారా తయారుచేయడం, అడవిలో చెట్లను నరికి అక్రమ రవాణాకు సహకరించడం, జంతువులను వేటాడడం వంటి అరాచకాలకు పాల్పడేవారు.

కేవలం వీరివల్ల ఆ ఊరు దొంగల గ్రామంగానే మిగిలి పోయింది. నిజానికి 360 కుటుంబాలున్న ఆ గ్రామం ఇప్పుడు బాగా మారింది. పిల్లలు చదువుకున్నారు. పెద్దలు వ్యవసాయం చేసుకుంటున్నారు. గేదెలను మేపుకుంటూ పాల వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ దురదృష్టం... ఇప్పటికీ ఎప్పుడు ఎక్కడ చోరీ జరిగినా అందరి చూపూ వీరి మీదికే మళ్లుతోంది.
 
మార్పు వచ్చింది..!
సిద్ధాపురం వాసుల్లో మంచి మార్పు వచ్చింది. ఇంకా కొందరు దొంగలున్నారు. వారిలోనూ మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. వారికి అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు ఎస్పీ రవికృష్ణ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం. వారికి తరచూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అక్రమ మార్గంలో కాకుండా సక్రమ మార్గంలో సంపాదించేందుకు తోడ్పడుతున్నాం.
 - నరసింహారెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ, కర్నూలు జిల్లా
 
కాలం మారింది... మేమూ మారాం!
‘దేశం శాస్త్ర సాంకేతికంగా ఎదుగుతోంది. ఆ ప్రకారమే మేమూ ఎదుగుతాం’ అంటున్నారు సిద్ధాపురం యువకులు. ఈ ఊళ్లో బీఏ, బీకామ్ బీఎస్సీ, కంప్యూటర్స్ కోర్సులు చేసిన వాళ్లు ఉన్నారు. స్పోర్ట్స్ అవార్డు అందుకున్న సుధాకర్ ఉన్నాడు. కానీ వీరిని నిరుద్యోగం పీడిస్తోంది. ‘‘ఎక్కడ ఉద్యోగానికి వెళ్లినా సిద్ధాపురం పేరు చెబితే వెనక్కు పంపేస్తున్నారు. పోనీ ఊళ్లోనే ఉండి ఏ గేదెలో మేపుకుంటూ బతుకుదామంటే ఎక్కడ దొంగతనం జరిగినా మమ్మల్ని అరెస్టు చేస్తారని భయం’’ అని యువకులు ఆవేదన చెందుతున్నారు. వారి భయంలో నిజం లేకపోలేదు. కొన్నిసార్లు వేరేవాళ్లు చేసిన నేరాలు కూడా వారిమీద పడుతుంటాయి పాపం. ఇటీవల శ్రీశైలం స్వామి దర్శనం కోసం వెళ్లినప్పుడు... సిద్ధాపురం వాసులని తెలిసి బట్టలూడదీసి కూర్చోబెట్టారంటే వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఇక్కడి యువకులకు అమ్మాయినివ్వడానికి ఏ ఊరివాళ్లూ ముందుకు రావట్లేదు.

అలాగే ఈ ఊరి అమ్మాయిలను చేసుకోవడానికి కూడా ఏ ఊరి యువకులూ మొగ్గుచూపట్లేదు. మరోపక్క సిద్ధాపురం అన్ని రకాలుగానూ వెనుకబడి ఉంది. అభివృద్ధి పనులు లేవు. సిమెంట్ రోడ్లు, వీధిలైట్లు, మురుగు కాలువలు లేవు. వర్షం వస్తే గ్రామమంతా బురద! బ్రిటిష్ పాలకులు పెట్టిన ఆసుపత్రి మూతపడింది. వందల పశువులున్నా పశువైద్యులు లేరు. పాఠశాల కూడా శిథిలావస్థలో ఉంది. వీరి కోసం ఎవరూ ఏమీ చేయక పోవడం బాధాకరం. అయితే అంతకంటే ఎక్కువ బాధ, తమను ఇంకా దొంగలుగానే చూస్తుంటే కలుగుతోందని అంటు న్నారు వారు. ‘అక్రమ మార్గాన్ని వదిలేశాం, సక్రమంగా బతుకుతున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి, అందరిలో కలుపుకోండి’ అని వేడుకుంటున్నారు. ‘పరివర్తన చెందాం... మమ్మల్ని నమ్మండి’ అని బతిమాలుతున్నారు. వారి వేదన ఇప్పటికైనా అందరికీ అర్థమైతే అదే చాలు!
     - రవిరెడ్డి, సాక్షి, కర్నూలు  ఫోటోలు: హుస్సేన్

మరిన్ని వార్తలు