నార్లవారి ఉత్తరాలు 

20 Jul, 2020 00:39 IST|Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

సాహిత్యవేత్తల జీవితంలోని వెలుగు నీడలు, నిర్వేద నిశ్శబ్దాలు ఏ విధంగా వాళ్ల రచనల్ని, వ్యక్తిత్వాల్ని ప్రభావితం చేశాయో అవగతం చేసుకోవాలంటే వాళ్ల లేఖలు దోహదం చేస్తాయి. ప్రముఖ పత్రికా సంపాదకులు, చింతనాశీలి నార్ల వేంకటేశ్వరరావు హితులకు, సన్నిహితులకు, సామాన్య పాఠకులకు ఎన్నెన్ని లేఖలు రాసివుంటారో ఎవరి కెరుక? ఆయన కర్ణాటకలో వుండే ఓ కన్నడ రచయితకు, ప్రబుద్ధ పాఠకుడికి రాసిన వుత్తరాల సంకలనం ‘నార్లవారి ఉత్తరాలు’.

ఇది 1986లో వెలువడింది. ఈ లేఖల్ని సంకలనం చేసి, ప్రచురించిన వ్యక్తి హరిహరప్రియగా కన్నడ సాహిత్య క్షేత్రంలో పేరుమోసిన సాతవల్లి వేంకట విశ్వనాథ. 1973 మార్చి 23న రాసిన మొట్టమొదటి లేఖ, 1984 ఫిబ్రవరి 21న రాసిన చిట్టచివరి ఉత్తరం– 11 ఏళ్ల అవధిలో రాసిన మొత్తం 57 జాబులు ఇందులో సంకలింపబడ్డాయి. వీటిల్లో ఒకటి హరిహరప్రియ తండ్రి సాతవల్లి శంకర రామశాస్త్రికి రాసింది. అన్నీ ఇంగ్లిషులో రాసిన ఉత్తరాలు.

సర్వదా అపరిచితుడైన హరిహరప్రియ అడిగిన వెంటనే వి.ఆర్‌.నార్ల ‘మాటామంతీ’, ‘పిచ్చాపాటీ’ సంకలనాల్నుంచి కొన్ని వ్యాసాల్ని కన్నడీకరించేందుకు ఎలాంటి షరతులూ విధించకుండా అనుమతిచ్చారు– తన మొదటి ఉత్తరంలోనే. హైదరాబాద్‌కు రావడం తటస్థిస్తే తమ ఇంటికి వచ్చి భోజనం చేసి, కొన్ని గంటలు ఆషామాషీ గడిపితే మీ గురించి తెలుసుకొనే అవకాశం కలుగుతుందని ఎలాంటి భేషజాలు లేకుండా ఆత్మీయత ప్రదర్శించారు రెండో జాబులో. 

హరిహరప్రియ నార్లవారి అనుమతిపై జాబాలి నాటకాన్ని కన్నడంలోకి అనువదించేటప్పుడు దాన్లోని చివరి పంక్తుల్ని తిరగరాస్తే బాగుంటుందని సూచిస్తే, ఆయన సంతోషంగా మార్పు చేస్తూ, అనువాదకునికి కృతజ్ఞతలు చెప్పారు. నార్లవారి వ్యక్తిత్వంలో మాటలు పెళుసుతనం వ్యక్తమైనా, మనస్సులోని మెత్తదనం ఆయన ఈ లేఖలో కనిపిస్తుంది. గురుగంభీరులుగా భావింపబడే నార్లలో సౌజన్యం, సంస్కారం, సహృదయత ఈ లేఖల ద్వారా తెలుసుకోగలుగుతాం. జాబాలి కన్నడ అనువాదం ఆవిష్కరణ సభలో ఒకరు ఘాటుగా విమర్శించినప్పుడు హరిహరప్రియకు తన అభిప్రాయాన్ని ఇలా తెలియజేస్తారు: ‘‘ఒక రచన గురించి ఎవరైనా భిన్నాభిప్రాయం ప్రకటిస్తే, ఖండిస్తే దాన్ని స్వాగతించాలి.

కాని ఒక రచన పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మాత్రం సహించకూడదు’’ (లేఖ–25). అయితే ఇదే నార్ల సమయమూ, సందర్భమూ గమనించి విమర్శకులు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలంటారు. తన ‘సీత జోస్యం’ నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి ప్రకటించినప్పుడు అకాడమీ ద్వైమాస పత్రిక ‘ఇండియన్‌ లిటరేచర్‌’లో ఆ పత్రిక సంహాయ సంపాదకుడు డి.ఎస్‌.రావు (ఈయనా తెలుగువారే) కటువుగా విమర్శించడంతో నార్ల ఆ బహుమతి తీసుకోనని మొరాయించారు. అకాడమీయే పురస్కరించి, తన పత్రికలోనే విమర్శించడం సబబు కాదన్నారు. విమర్శను వ్యతిరేకించ లేదు, విమర్శించిన సందర్భాన్ని వ్యతిరేకించారు.

నార్ల రోగాల పుట్ట. తన ఉత్తరాల్లో పదేపదే ఈ విషయాన్ని ప్రస్తావించారు. శారీరక క్లేశానికి తోడు దేశ రాజకీయ పరిస్థితులు, తన పూర్వ సహోద్యోగులు, వర్తమాన శత్రువుల వల్ల మానసిక అశాంతికి దూరమై వున్నానని 1981లో రాశారు. ‘‘ఇది(‘ఖద్దరు సంస్కృతి’) అసత్యం, మోసం, నీచత్వం, డబ్బు, అధికారం కోసం ప్రాకులాడే తత్వం, అన్ని విధాల నైతిక పతనానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.’’ 1984 ఫిబ్రవరి 21 నాటి చివరి లేఖలో ‘‘నాకిప్పుడు 76 ఏళ్లు. నేను మరెంత కాలమో జీవించను. నేను మరణించిన తర్వాత నా ఉత్తరాల్ని మీరేమైనా చేసుకోవచ్చు’’ అని రాశారు. సూటిగా, వాడిగా రాసే, మాట్లాడే ఆ మనిషి సరిగ్గా ఏడాది తర్వాత 1985 మార్చ్‌ 13న హైదరాబాద్‌లో చివరి శ్వాస వదిలారు. 
- ఘట్టమరాజు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా