గాంధీ మార్గంలో పల్లెను మళ్లిదాం..

2 Oct, 2019 04:55 IST|Sakshi

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గ్రామ ఆర్థిక వ్యవస్థ ఒక భాగం. ఒక గ్రామానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, అనేక గ్రామాలను జతపరిచే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాదిరాయిగా నిలుస్తుంది. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా, స్వతంత్రంగా ఉన్న రోజుల నుంచి క్రమేపి బాహ్య ఆర్థిక వ్యవస్థపై ఆధారపడడం వలన సామాజిక, పర్యావరణ, ఆర్థిక, పాలనాపర మార్పులొచ్చాయి. కొన్ని ఆహ్వానించదగినవే కాగా, అనేక మార్పులు గ్రామీణ పరిస్థితులను, మానవ సంబంధాలను మార్చేశాయి. వందేళ్ల క్రితం నాటితో పోలిస్తే గత 50 ఏళ్లలో పలు గ్రామాలకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. సగటు ఆదాయం పెరిగింది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు పెరిగాయి. ఇదే కాలంలో, గ్రామ వాతావరణం మారింది. గ్రామంలో పశువుల సంఖ్య తగ్గింది. వాహనాల సంఖ్య పెరిగింది. ఆత్మహత్యలు పెరిగాయి. పిల్లల్ని పోషకాహార లోపం పీడిస్తోంది.  పచ్చటి పొలాల్లో విష రసాయనాల గత్తర కంపు ఊపిరి తీస్తోంది. భూగర్భ జలాలు అడుగంటాయి.

నీటి కాలుష్యం పెరిగింది. ఉపాధి తగ్గింది. సంప్రదాయ వృత్తులు దెబ్బతిన్నాయి. వ్యవసాయం సంక్షోభంలో పడింది. భూమి లేని నిరుపేదలు ప్రభుత్వం అందించే రేషన్‌ సరుకులపైనే ఆధారపడే దుర్భర పరిస్థితి..  పల్లెలలో ఆహార కొరత ఏర్పడింది. కొంటేనే కాని దొరకని ఆహార వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో వేళ్లూనింది. కొనే స్తోమత లేని కుటుంబాల సంఖ్య పెరిగింది. కూల్‌డ్రింకులు, చిప్స్‌ ప్యాకెట్లు దొరికినంత సులువుగా పల్లెల్లోనూ సహజ ఆహారం దొరకడం లేదు. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం రక్తహీనత గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉంది. ఇటీవల విడుదలైన లాన్సేట్‌ పత్రికలో ఒక అధ్యయనం ప్రకారం 1990–2017 మధ్య కాలంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న లేదా చనిపోతున్న చిన్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. ఐదేళ్లలోపు పిల్లలలో 68.2 శాతం మంది పోషకాహార లోపంతో చనిపోతున్నారని ఈ అధ్యయనం తేల్చింది. మహాత్మాగాంధీ ఆలోచించిన గ్రామ స్వరాజ్యాన్ని విస్మరించిన ప్రభుత్వ విధానాలు ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించలేకపోయాయి.

ఫలితంగా గ్రామీణులు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మారిపోయారు. గ్రామస్తులకు తమ పరిధిలోని ప్రకృతి వనరులు ‘తమ సొంతం’అనే భావన పోయింది. ఒకప్పుడు, గ్రామ చెరువును, చెరువు పరీవాహక ప్రాంతాన్ని, సమీప అటవీ ప్రాంతాన్ని, నేలను, భూమిని, నీటిని క్రమబద్ధంగా, ఏటా పద్ధతి ప్రకారం నిర్వహించుకునే గ్రామస్తులు ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక గ్రామాలు పూర్తిగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మీద కునుకు తీస్తున్నాయి. ఒకప్పటి గ్రామాలు ఉత్పత్తి, సేవల కేంద్రాలుగా, స్వయం సమృద్ధితో, నైపుణ్యంతో, కళలతో విరాజిల్లాయి. గ్రామ వనరుల స్వయం నిర్వహణ నుంచి క్రమేపీ కేంద్ర నిధులు, కాంట్రాక్టర్లు, కాంట్రాక్టుల పద్ధతి వచ్చింది. దేశంలోని ఆరున్నర లక్షల గ్రామాల నీటి వనరుల నిరంతర నిర్వహణ కేంద్రీకృత పాలనలో అసాధ్యంగా మారింది. గ్రామాభివృద్ధి నిధులు పలు అంచెలు, అవాంతరాలు దాటుకుని వచ్చేసరికి కొండంత నిధులు బఠానీలుగా మారుతున్నాయి.

గాంధీ గ్రామ స్వరాజ్యం పునాదులపై కాకుండా, దానికి  వ్యతిరేక దిశలో ఆర్థిక వ్యవస్థ నిర్మితమైంది. ఫలితం..పల్లెల్లోనూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఉపాధి కోసం, ఉజ్వల భవిష్యత్తుపై ఆశతో ‘వలసలు’ పెరిగాయి. జనాభా లెక్కల ప్రకారం 2001లో 500లోపు జనాభా సంఖ్య ఉన్న గ్రామాలలో దేశ జనాభాలో 7.16 శాతం నివసిస్తుండగా, 2011 నాటికి అది 5.74 పడిపోయింది. 5,00,999 జనాభా ఉన్న గ్రామాల్లో నివాసితుల సంఖ్య 14.2 నుంచి 12.4 పడిపోయింది. ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులు పట్టణీకరణకు దారితీస్తోంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఒకపక్క మనం పాశ్చాత్య దేశాల్ని అనుకరిస్తోంటే, మరో వైపు ఆ దేశాలు స్థానిక ఆర్థిక వ్యవస్థల్ని గట్టిపర్చుకుంటున్నాయి. అమెరికా వంటి దేశాల్లో వారాంతపు సంతలు పెరుగుతున్నాయి.

ఆహారం, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే పర్యావరణం దెబ్బతింటుందని గుర్తించి, తమ స్థానిక ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణానికి పునాదులు వేసుకుంటున్నాయి. కరెన్సీ లావాదేవీల బదులు పురాతన బార్టర్‌ పద్ధతి మేలని భావిస్తు్తన్నాయి. మన గ్రామాలు స్వతంత్ర వ్యవస్థతో నడిచేలా ప్రభుత్వ విధానాలు రావాలి. మహాత్మాగాంధీ–కుమారప్ప జోడి అందించిన ఆర్థిక సూత్రాలు, విధానాలను నీతి ఆయోగ్‌ వంటి ప్రణాళిక సంస్థలు ఆచరణలోకి తేవాలి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామ స్వరాజ్య స్థాపనలో ఒక ముందడుగు. ఇప్పటి పరిస్థితులకు అది సరిపోయే ఆలోచన. కాకపోతే, గ్రామ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఉపయోగపడేలా, ఉత్పత్తిని, ఉత్పాదకతను ప్రోత్సహించేలా దీనిని మలుచుకోవాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారమూ అవసరం.

పల్లెలకు నిధులు కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు, ఒక దామాషా పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వస్తాయి. ఇది రాన్రాను  రాజకీయమవుతోంది. ఏటా ప్రతి గ్రామానికి కేంద్రం సగటున రూ.10 లక్షల అభివృద్ధి, నిర్వహణ నిధులిస్తే, పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతుంది. అంటే, 6,40,000 గ్రామాలకు రూ.64 వేల కోట్లు. సాలీనా రూ.28 లక్షల కోట్ల బడ్జెట్లో ఇది 2 శాతం మాత్రమే. ఏటా క్రమం తప్పకుండా ఈ నిధులిస్తే, గ్రామాభివృద్ధి సాధ్యమే. గ్రామీణులు సహజ వనరులను తమ సొంతమనే భావనతో కాపాడుకుంటూ, సుస్థిరంగా నిర్వహించుకుంటే సమతుల్య అభివృద్ధి సాధించవచ్చు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు బలంగా, సుస్థిరంగా ఉంటే దేశం అభివృద్ధి చెందినట్లే.
– దొంతు నర్సింహరెడ్డి

మరిన్ని వార్తలు