సభాపతి నటరాజమూర్తి

9 Sep, 2018 01:41 IST|Sakshi

ఆయన నటరాజు. ఆయన నాట్యం తాండవం. మామూలు దృష్టితో చూస్తే అది నృత్యవిశేషంగా అనిపిస్తుంది. కానీ ఆ నాట్యభంగిమలో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. అందుకే ఆయన కొలువుదీరిన చిదంబరం క్షేత్రానికి అంత విశిష్టత ఏర్పడింది. ఇది పంచభూతక్షేత్రాలలో చివరిది. ఆకాశలింగం అనే పేరుతో శూన్యాన్ని పూజిస్తారు. అక్కడ మూలరూపం శూన్యమే. శూన్యం నుండే సృష్టి మొదలైంది అనే తత్త్వానికి ప్రతినిధి స్వామివారు. ఆకాశం నుండి గాలి, గాలి నుండి నిప్పు, నిప్పు నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి ఓషధులు పుట్టాయని సృష్టి క్రమాన్ని వేదాలు చెబుతున్నాయి. మనకు ఇక్కడ దర్శనమిచ్చేది స్వామి వారి ఉత్సవమూర్తి. ఆయన అక్కడ కనకసభలో కొలువుదీరి దర్శనమిస్తాడు.

ఆ కనకసభనే పొన్నంబలం అని పిలుస్తారు. ఆయనే అక్కడి సభాపతి. ముప్పై మూడు కోట్ల దేవతలు ఆయన కోసం భూమి పైకి దిగి వచ్చి ఆయన ఆలయం కప్పుపై ఆకులుగా మారిపోయారు. నేటికి ఆలయంపై వాటిని చూడవచ్చు. స్వామిరూపం నృత్యం చేస్తున్న రీతిగా కనిపిస్తుంది. కుడిచేత అభయముద్ర, ఎడమ చేయి ఏనుగు తొండం వలె ఉంచి, వెనుక చేతిలో డమరుకం మ్రోగిస్తూ, మరో చేతిలో అగ్ని పట్టుకుని కుడిపాదాన్ని కొంచెం వంచి, ఎడమ పాదాన్ని ఎడమచేతివలె ముందుకు తీసుకు వచ్చి, పాదం కింద రాక్షసుడిని తొక్కుతూ ఉన్నట్లుంటుంది. ఆయనకు రెండువైపులా పతంజలి, వ్యాఘ్రపాదులవారు ఆయనను  నిరంతరం సేవిస్తుంటారు. ఆయనకు ఎడమవైపు శివకామసుందరీదేవి నిలుచుని పద్మం ధరించి దర్శనమిస్తుంది. రూపంలో పరమేశ్వరుని పంచకృత్యాలను మనం దర్శించాలి.

సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం అనేవే పంచకృత్యాలు. ఆ చేతి డమరుక ధ్వనినుండి సంస్కృతభాషకు మూలమైన మాహేశ్వరసూత్రాలు ఆవిర్భవించాయి. అదే సృష్టి. ఆయన వంచిన పాదం స్థితికి ప్రతీక. ఆయన చేతిలోని అగ్ని సంహారం .చాచిన ఎడమకాలు తిరోధానం. ఆయన అభయహస్తం అనుగ్రహం. ఈ పంచకృత్యాలనే రహస్యాన్ని తెలుసుకుంటే చిదంబర రహస్యం తెలిసినట్టే. నటరాజస్వామివారి సప్తతాండవరూపాలు చాలా ప్రఖ్యాతి పొందాయి. ముఖ్యంగా ఊర్ధ్వ తాండవరూపం చాలా విశేషమైంది. పరమేశ్వరుడు నటరాజుగా అవతరించింది ఊర్ధ్వ తాండవ భంగిమలోనే.

– డాక్టర్‌ ఛాయా కామాక్షీదేవి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా