హ్యాపీ డేస్‌

13 Feb, 2018 01:30 IST|Sakshi
‘సహజ’ నాప్కిన్స్‌తో కస్తూరిబా విద్యాలయాల బాలికలు

ఆ మూడు రోజులూ హాౖయెన రోజులే

రుతుస్రావంపై ‘సహజ’ అవగాహన కార్యక్రమం

ఉచిత శానిటరీ నాప్కిన్ల పంపిణీ

సర్వశిక్ష అభియాన్‌ డైరెక్టర్‌ జి. శ్రీనివాస్‌ చొరవ

ఆంధ్రా ‘ప్యాడ్‌మేన్‌’గా విద్యార్థినుల ప్రశంసలు

‘మౌనం వద్దు... మాట్లాడదాం..’ అంటూ ఆడపిల్లల రుతుస్రావ పరిశుభ్రత మీద ఆంధ్రప్రదేశ్‌ సర్వ శిక్ష అభియాన్‌ చేపట్టిన అవగాహనా కార్యక్రమం ‘సహజ’ సత్ఫలితాలనిస్తోంది. అమ్మాయిలకు రుతుస్రావం సహజం అని, శానిటరీ నాప్కిన్స్‌ వాడటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదంటూ అభియాన్‌ చేపట్టిన ప్రచారం అమ్మాయిల ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చింది. అభియాన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో   చదువుతున్న మొత్తం 70 వేల మంది అమ్మాయిలలో నలభై వేల మంది అమ్మాయిలు ఇప్పుడు పెన్సిల్‌ అడిగినంత సహజంగా శానిటరీ నాప్కిన్‌ కావాలని అడిగి తీసుకొని వాడుతున్నారు. దీనికి కారణం సర్వశిక్ష అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌  జి.శ్రీనివాస్‌ చూపిన చొరవ. ప్రదర్శించిన సహానుభూతి. అందువల్లే ఇప్పుడు ఆయన ‘ప్యాడ్‌మేన్‌’గా ప్రశంసలు అందుకుంటున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆసరా కోసం అల్లాడుతున్న అమ్మాయిలను అక్కునచేర్చుకొని విద్యాబుద్ధులు నేర్పి చేయూతనిస్తున్న ‘కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు’ (కేజీబీవీ) నడుస్తున్న తీరుతెన్నులను  ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీనివాస్‌ వివరించారు.


దేశంలో శానిటరీ నాప్కిన్స్‌ వాడకం గురించి, రుతుస్రావ పరిశుభ్రత గురించి చైతన్య కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఆ విధంగా చూసినప్పుడు కొంత ముందుగానే మీరు ‘సహజ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం అనే చెప్పాలి.
అవును. ఆడపిల్లల రుతుస్రావ పరిశుభ్రత కోసం ‘సహజ’ కార్యక్రమం మేము మొదలుపెట్టాం. ఇది సత్ఫలితాలను ఇవ్వడం ఆనందంగా ఉంది.

వివరంగా చెప్పండి.
ఆంధ్రప్రదేశ్‌లో 352 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు ఉన్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, సమాజంలో ఏ ఆసరా లేని పిల్లలకు వీటిలో ప్రవేశం ఉంటుంది. మధ్యలో చదువు మానేసిన(డ్రాపవుట్‌) పిల్లలనూ చేర్చుకుంటాం. ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్నీ ఉచితమే. ఇంటర్‌ కూడా ప్రారంభిస్తున్నాం.

చదువుతో పాటు దుస్తులు, పుస్తకాలు, భోజనం, వసతి, కాస్మోటిక్స్‌.. అన్నీ ఉచితంగా ఇస్తాము. కేజీబీవీల్లో 70 వేల మంది విద్యార్థినులు ఉంటే వారిలో 45 వేల మంది రుతుస్రావం దశలో ఉన్నారు. రుతుస్రావం సమయంలో వీరు సంప్రదాయ పద్ధతులను అనుసరించడం, అసురక్షిత పద్ధతులను ఆశ్రయించి అనారోగ్యం బారిన పడటం మా దృష్టికి వచ్చింది. రుతుస్రావం సమయంలో తాము రుతుస్రావంలో ఉన్నాం అని చెప్పుకోవడానికి కూడా వారు సంకోచించే పరిస్థితి.

అదీగాక రుతుస్రావం భయంతో డ్రాపవుట్స్‌గా మారుతున్నారు. సాటి విద్యార్థినుల హేళన కూడా వాళ్లను కుంచించుకుపోయేలా చేసి చదువు మానేస్తున్నారు. ఇది చాలా తప్పు. అందువల్ల ముందు వారిలో చైతన్యం కలిగించాం. రుతుస్రావంకు సంబంధించి న్యూనత అక్కర్లేదని వారిలో ధైర్యం నూరిపోశాం. ‘మౌనం వద్దు... మాట్లాడదాం’ పేరిట వారిలో సంకోచాలన్నీ తొలగించాం.

నాప్కిన్స్‌ ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
ఈ విద్యార్థినులకు పుస్తకాలు, బట్టలు ఇస్తున్నప్పుడు నాప్కిన్స్‌ ఎందుకు ఇవ్వకూడదు అని అనిపించింది. ఒకవేళ ఇచ్చే పరిస్థితి ఉన్నా ఇచ్చే పరిస్థితి ఉండాలి కదా. ముందు వారికి అడగడం చాలా మామూలు విషయమని ప్రిపేర్‌ చేశారు. ఆ తర్వాత ప్రతినెలా ఉచితంగా ‘సహజ’ బ్రాండ్‌ పేరుతో శానిటరీ నాప్కిన్స్‌ ఇస్తున్నాం.

మూడు నెలలకు సరిపడా నిల్వలు ముందస్తుగా స్కూళ్లకు చేరుస్తాం.  మొదట టీచర్లు వాడి చూశారు. నాణ్యత సంతృప్తికరంగా ఉన్న తర్వాతే సరఫరా కాంట్రాక్టర్‌ను ఎంపిక చేశాం. ‘సహజ’ అమలుకు ఏటా రూ. కోటి ఖర్చు చేస్తున్నాం. ఇంతకుమునుపు నాప్కిన్స్‌ అంటేనే సంకోచించే ఆడపిల్లలు ఇప్పుడు పెన్సిల్‌ అడిగినంత సులభంగా వాటిని తీసుకుని ఉపయోగిస్తున్నారు.

కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలకు ఆదరణ ఎలా ఉంది?
కేజీబీవీల్లో చదువుకుని జీవితంలో స్థిరపడిన 20 వేల మంది విద్యార్థినుల వివరాలు మా వద్ద ఉన్నాయి. దీనిని బట్టే ఈ విద్యాలయాల పని తీరు అంచనా వేయవచ్చు. కేజీబీవీలో చదువుకొని బయటకు వెళ్లిన వారు తమకాళ్ల మీద నిలబడగలిగే సత్తా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.

చదువుతో పాటు సాఫ్ట్‌ స్కిల్స్, స్పోర్ట్స్, కల్చరల్‌ యాక్టివిటీస్, ఆత్మరక్షణ.. అన్ని రకాలుగా శిక్షణ ఇస్తాం. ఎంతో మంది అమ్మాయిలు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఉన్నత చదువులు చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. కేజీబీవీల్లో చదువుకున్న విద్యార్థినిలకు చదువుతో పాటు సామాజిక విషయాల్లో అవగాహన, వ్యక్తిగత పరిశుభ్రత, లలిత కళలు, బ్రతుకుదెరువుకు దోహదపడే నైపుణ్యాలు.. తప్పకుండా ఉంటాయి.

కేజీబీవీల్లో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వాటి నుంచి బయటపడటానికి చేపట్టిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?
పేదరికం, వెనకబాటుతనం కారణంగా పదో తరగతి కాగానే చాలా మంది అమ్మాయిలకు వివాహం చేస్తున్నారు. పదోతరగతి పరీక్షలు రాసి ఇళ్లకు వెళ్లిన అమ్మాయిలు తిరిగి విద్యాలయానికి రావడం లేదు. ఎందుకు రావడం లేదనే విషయాన్ని ఆరా తీస్తే.. పెళ్లిళ్లు చేస్తున్నారని తెలిసింది.  పదోతరగతి పరీక్షల తర్వాత ఇళ్లకు వెళుతున్న విద్యార్థినులకు.. పెళ్లికి ఇది తగిన వయసు కాదని, బలవంతంగా పెళ్లి చేస్తే ఎదిరించాలని చెప్పి పంపిస్తున్నాం.

విద్యాలయం ప్రిన్సిపాల్, స్థానిక పోలీస్‌ అధికారి, డీజీడీవో (గర్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌)... అందరి నంబర్లు ఇచ్చి పంపుతున్నాం. తల్లిదండ్రులు పెళ్లికి బలవంతం చేస్తే..  సమాచారం ఇవ్వమని చెబుతున్నాం. మేం చేసిన ఈ ప్రయత్నం ఫలించింది. చాలా మంది అమ్మాయిలు ధైర్యంగా ఫిర్యాదు చేసిన ఘటనలు ఉన్నాయి. ‘పది తర్వాత పెళ్లి కాదు.. 11వ తరగతి’ అని ప్రచారం చేయడంతో పాటు తల్లిదండ్రులకూ కౌన్సిలింగ్‌ ఇస్తున్నాం.

కేజీబీవీల్లో విద్యార్థినుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు?
ఈ విద్యాలయాల్లో సెక్యూరిటీ గార్డు నుంచి ప్రిన్సిపాల్‌ వరకు.. అందరూ మహిళలే. పురుషులకు ప్రవేశం లేదు. సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఒక మహిళా కానిస్టేబుల్‌ను రాత్రి బీట్‌ కోసం పంపించమని అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖలు రాశాం. నైట్‌బీట్‌ కానిస్టేబుల్‌ను పంపించడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. అన్ని స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ విద్యాలయాల్లో విద్యార్థినిలు సురక్షితమైన వాతావరణంలో ఉంటారు.

ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది?
పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం 87 నుంచి 96 శాతానికి పెరిగింది. ఇంటర్మీడియెట్‌లోనూ ఇదే తరహాలో ఉత్తీర్ణత నమోదవుతోంది. మధ్యలో స్కూలు మానేస్తున్న విద్యార్థినిల సంఖ్య ఇటీవల బాగా తగ్గింది.

ఎస్‌ఎస్‌ఏ తీసుకొస్తున్న ‘కస్తూరి’ ద్వైమాసిక పత్రికకు ఆదరణ ఎలా ఉంది?
దేశంలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా పత్రిక తీసుకురావడం ఇదే తొలిసారి. కస్తూరి పత్రికను ఇటీవల కాలం వరకు కేజీబీవీ విద్యార్థినిలకు మాత్రమే ఇచ్చే వాళ్లం. పత్రిక కావాలని మిగతా వాళ్లు కూడా అడుగుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి బహిరంగ మార్కెట్‌లోకి కూడా విడుదల చేశాం.

( సర్వశిక్ష అభియాన్‌ డైరెక్టర్‌ జి. శ్రీనివాస్‌)

 

– మల్లు విశ్వనాథరెడ్డి,సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో


 

మరిన్ని వార్తలు