నేచురల్‌ హెయిర్‌ కలర్స్‌

25 May, 2018 00:46 IST|Sakshi

హెయిర్‌డైస్‌ వేసుకున్నప్పుడు అవి జుట్టుకు సరిపడకపోవడం, కేశాల సహజమైన కాంతి కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వీటికి విరుగుడుగా శిరోజాలకు ఆరోగ్యాన్ని, సహజమైన రంగును ఇచ్చేవి ఉన్నాయి. వాటిలో...

 బ్రౌన్‌ కలర్‌ రావాలంటే... 
టేబుల్‌ స్పూన్‌ కాఫీ గింజలు లేదా పొడిని కప్పు నీటిలో వేసి బాగా మరిగించి 20 నిమిషాల సేపు చల్లారనివ్వాలి. జుట్టు కాస్త నలుపు రంగు రావాలంటే కాఫీ డికాషన్‌లో పావు టీ స్పూన్‌ లవంగాల పొడిని కూడా కలిపి మరిగించాలి. ఈ డికాషన్‌ని వడకట్టి, తలకు షాంపూతో స్నానం చేశాక ఈ మిశ్రమాన్ని జుట్టుకంతా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత జుట్టును కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు రంగు, ఆరోగ్యం మెరుగుపడుతుంది. డైస్‌ వాడకం వల్ల కేశాల కు కలిగే హాని కూడా తగ్గుతుంది. 

బీట్‌రూట్‌ను పేస్ట్‌ చేసి, నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని రాత్రి పడుకోబోయేముందు మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్‌ చేసుకోవాలి. మరుసటిరోజు ఉదయం తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటే కురులకు కొద్దిగా పర్పుల్‌ కలర్‌ వస్తుంది. హెయిర్‌ కలర్స్‌ వాడే యువతరపు జుట్టుకు ఇది మంచి ఆప్షన్‌. చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది.ముదురు రంగు బంతిపూలను రెండు కప్పుల నీళ్లలో వేసి, కప్పు మిశ్రమం అయ్యేవరకు మరిగిం చాలి. ఈ నీటిని మాడునుంచి శిరోజాలకు పూర్తిగా పట్టించాలి. గంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. తలలో అక్కడక్కడా తెల్లబడిన వెంట్రుకలు ఎర్రగా అవుతాయి.  డై వాడేవారి జుట్టు పొడిబారి వెంట్రుకులు బిరుసు అవుతుంటాయి.  నివారణకు టేబుల్‌ స్పూన్‌ పెరుగులో పెసరపిండి కలిపి, రోజంతా అలాగే ఉంచాలి. తర్వాత రోజు మిశ్రమాన్ని మాడుకు, శిరోజాలకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే హెయిర్‌ డై/కలర్‌లలో ఉండే రసాయనాల ప్రభావం తగ్గడమే కాకుండా వెంట్రుకలు మృదువుగా అవుతాయి. 

>
మరిన్ని వార్తలు