వొద్దు అన్నోళ్లే వావ్‌ అంటున్నారు!

16 Oct, 2018 05:26 IST|Sakshi
వరి పొలంలో యువ రైతు కొప్పుల సునీత

ఎంబీఏ చదివి.. ఉద్యోగం వదిలి.. రైతుగా మారిన సునీత 

బంజరును మాగాణిగా మార్చి.. ఒంటిచేత్తో మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం 

వరి సాగు ద్వారా ఏటా ఎకరానికి రూ. 2 లక్షల నికరాదాయం

సునీత ఐపీఎస్‌ అవ్వాలనుకున్నారు. అమ్మా నాన్నా చనిపోయిన నేపథ్యంలో ఎంబీఏ చదువుకొని హైదరాబాద్‌లో కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేశారు. రసాయనిక అవశేషాలున్న ఆహారం, వాయుకాలుష్యం కారణంగా అనారోగ్యం పాలయ్యారు. సొంతూరుకు తిరిగొచ్చి.. వారసత్వంగా సంక్రమించిన మూడెకరాల బంజరు భూమిని చదును చేసి మాగాణిగా మార్చి.. గత మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు. సులువుగా బ్యాంకు రుణాలివ్వడంతోపాటు.. చిన్న కమతాల మహిళా రైతులు స్వయంగా ఉపయోగించుకోగలిగేలా పవర్‌ టిల్లర్లను, కలుపుతీత యంత్రపరికరాలను ప్రత్యేకంగా రూపొందించి అందించడానికి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు కృషి చేయాలని ఆమె కోరుతున్నారు.

‘ఇదో పిచ్చిది, దీనికేం పనిలేదు..హైద్రాబాద్‌లో మంచిగా ఉద్యోగం చేసుకోక, ఇక్కడ వ్యవసాయం చేస్తానని వచ్చింది. మాతోని కానిది గీ పిల్లతో ఏం అయితది..’ అని కొందరు గ్రామస్తులు ముఖం మీదే చెప్పినా సునీత అధైర్య పడలేదు. పట్టుదల పెంచుకుంది. స్కూటీపై ఇంటి నుంచి రోజూ పొలం వద్దకు వెళ్లి జీవామృతంతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో, గ్రామరైతులు సునీతను చూసి ఆశ్చర్యపడుతున్నారు.   జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలంలోని ముక్కెట్రావుపేట గ్రామానికి చెందిన  సింగరేణి ఉద్యోగి కొప్పుల ధర్మయ్య, శాంతమ్మల ఏడుగురు సంతానంలో చివరి సంతానం సునీత(30). తోడబుట్టిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. హైద్రాబాద్‌లో ఎంబిఎ వరకు చదివారు. ఐపీఎస్‌ అధికారి కావాలన్నది ఆమె కల. కానీ, తల్లీదండ్రులు కాలం చేశారు. కుటుంబ పరిస్థితులు కలసి రాలేదు. ఆ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే ప్రైవేటు ఉద్యోగంలో చేరారు. వచ్చే జీతం ఖర్చులకు సరిపోయేవి. కానీ, ఏదో తెలియని వెలితి. హాస్టల్‌లో అంతా రసాయనిక అవశేషాలున్న ఆహారమే. దీనికి వాయుకాలుష్యం తోడుకావడంతో అనారోగ్యం పాలయ్యారు. మందులు వాడుతున్నా ఆరోగ్యం మరింత దిగజారింది.

బంజరును మాగాణిగా మార్చి..
ఈ నేపథ్యంలో ఐదారేళ్ల క్రితం సునీత దసరా పండుగకు సొంతరు వెళ్లారు. పచ్చని పొలాలు, బంధుమిత్రుల అనుబంధాలు కాలుష్యం లేని గ్రామీణ వాతావరణం ఆమెను కట్టిపడేసాయి. ఆ విధంగా సొంత ఊరులోనే జీవనాన్ని సాగించాలని ఆమె నిర్ణయించుకున్నారు. అక్కడుండి ఏమి చేయాలో పాలుపోలేదు. చేతిలో డబ్బు లేదు కానీ.. తండ్రి సంపాయించిన 3 ఎకరాల భూమి మాత్రం ఉంది. అది రాళ్లు, రప్పలతో నిరూపయోగంగా ఉన్న బంజరు భూమి. వ్యవసాయాన్నే వృత్తిగా చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే, వ్యవసాయంలో ఆమెకు ఓనమాలు తెలియదు. అయినా, సంకల్పంతో ముందడుగు వేశారు. సంప్రదాయ దుస్తులు వదిలేసి.. ప్యాంటు, షర్ట్‌ ధరించి భూమిలోకి కాలు పెట్టింది. గ్రామస్తుల ఎగతాళి మాటలు ఆమె పట్టుదల ముందు ఓడిపోయాయి. స్నేహితులు ఇచ్చిన తోడ్పాటుతో నిధులు సమకూర్చుకొని రూ 3.50 లక్షల ఖర్చుతో నిరూపయోగంగా ఉన్న భూమిని చదును చేయించి, మాగాణి పొలంగా ఉపయోగంలోకి తీసుకువచ్చారు. భూమి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.

‘సాగుబడి’ కథనాల స్ఫూర్తితో..
‘సాక్షి’లో ‘సాగుబడి’ కథనాల ద్వారా, యూట్యూబ్‌ వీడియోల ద్వారా సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయం గురించి సునీత తెలుసుకొని ఆ దిశగా అడుగులు వేశారు. పాలేకర్‌ శిక్షణా శిబిరాలకు హాజరయ్యారు. పాలేకర్‌ పుస్తకాలు, ‘గడ్డిపరకతో విప్లవం’ వంటి పుస్తకాలు చదివి.. ప్రకృతికి వ్యవసాయానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని, రసాయనాలతో అనర్థాలను అర్థం చేసుకున్నారు. 2016 ఖరీఫ్‌ నుంచి ప్రకృతి వ్యవసాయ పద్దతిలో మూడు ఎకరాల్లో వరి సాగు చేయడం ప్రారంభించారు. ఆవును సమకూర్చుకొని జీవామృతం, ఘనజీవామృతం స్వయంగా తయారు చేసుకొని వాడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్స్‌ను మోటారుతో తోడుకొని ఏటా రెండు పంటలూ సాగు చేస్తున్నారు. పొలం దున్నేటప్పుడు ఆవుల పేడను పొలమంతా చల్లటం, నాటు వేసే సమయంలో ఘనజీవామృతాన్ని అందించింది. తర్వాత, నాటు వేసి జీవామృతాన్ని ప్రతి 20 రోజులకొకసారి పొలానికి అందిస్తున్నారు.

ఎకరానికి రూ. 2 లక్షల నికరాదాయం
వచ్చే ఖరీఫ్‌ నుంచి పాలేకర్‌ ఐదంస్థుల సాగు చేపట్టి, క్రమంగా కొన్ని సంవత్సరాల్లో తన 3 ఎకరాలను జీవవైవిధ్యంతో కూడిన ఆహార అడవిగా మార్చుకోవాలని సునీత కృతనిశ్చయంతో ఉన్నారు. ఎకరానికి తొలి ఏడాది 28 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రస్తుతం బీపీటీ రకాన్ని మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి 33 బస్తాల వరకు దిగుబడి రావచ్చని ఆశిస్తున్నారు. ఎకరానికి రెండు పంటలు కలిపి రూ. 2 లక్షల మేరకు నికరాదాయం వస్తున్నదన్నారు.

సామాజిక సేవ
ప్రజల ఆరోగ్యం రైతుల చేతుల్లోనే ఉందని నమ్మే సునీత.. రైతులు విపరీతంగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయడం వల్ల సమాజం అనారోగ్యకరంగా మారే ప్రమాదం ఉందంటారు. పరిసర గ్రామాల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయం నేర్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నానని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజంతో పాటు, అవినీతి లేని సమాజాన్ని నిర్మించడంలోనూ రైతులు తమదైన పాత్ర నిర్వహించాలన్నది ఆమె భావన. ఎవరికి అన్యాయం జరిగిందని తెలిసినా వారికి అండగా నిలుస్తున్నారు. స్వయానా తన అన్న ఆ గ్రామ సర్పంచ్‌గా అవినీతికి పాల్పడ్డాడంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, అతని చెక్‌ పవర్‌ను రద్దు చేయించటం సునీత చిత్తశుద్ధికి నిదర్శనం.  
– పన్నాల కమలాకర్‌ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్, ఫొటోలు: ఎలేటి శైలేందర్‌ రెడ్డి

సులభ రుణాలు, మహిళలు నడపగలిగే ప్రత్యేక పవర్‌ టిల్లర్లు తయారుచేయాలి
సమాజంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలన్నదే నా అభిమతం. అడ్డంకులను అధిగమించినప్పుడే జీవితంలో తృప్తి. మనం చేసే పని నీతి, నీజాయితిగా ఉండాలి. అవాంతరాలు రావచ్చు. పట్టుదలతో నిలదొక్కుకుంటే సమాజం ఆ తర్వాత గుర్తించి విలువనిస్తుంది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న మహిళా రైతులు తమ సాగు భూముల్లో తాము స్వయంగా నడుపుకోగలిగేలా అనువుగా ఉన్న పవర్‌ టిల్లర్లు, వీడర్లు అందుబాటులో లేవు. తక్కువ వైబ్రేషన్స్‌ ఉండేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు మహిళా రైతులకు అందించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మహిళా రైతులకు భూమిని తనఖా పెట్టుకొని సులువుగా బ్యాంకు రుణాలు అందించేలా ప్రభుత్వం శ్రద్ధతీసుకోవాలి. మహిళా రైతులు పండించిన సేంద్రియ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వం స్టాళ్లు ఏర్పాటు చేయాలి లేదా ప్రత్యేక రుణాలను అందించాలి.
– కొప్పుల సునీత(79890 45496), యువ మహిళా రైతు, ముక్కెట్రావుపేట, వెల్గటూర్‌ మండలం, జగిత్యాల జిల్లా   
keerthisk999@gmail.com


ఆవులతో సునీత

మరిన్ని వార్తలు