వర భోజనం

7 Nov, 2018 00:25 IST|Sakshi

రుచి శుచి

టైమ్‌కి తినడం ఆరోగ్యం.టైమ్‌లీగా తినడం ఆహ్లాదం. ఆరోగ్యం, ఆహ్లాదం కలిసిందే ఆయుర్‌ భోజనం. ప్రకృతి ప్రసాదించిన రేకలు, శాకలతో తయారవుతుంది  కనుక ఇది వర భోజనం కూడా! 

పూల రెక్కలు.. కొన్ని తేనె చుక్కలు కలిపి రంగరించి బొమ్మ చేస్తే అందమైన అమ్మాయి రూపం వస్తుందో రాదో కానీ, పూలరెక్కలను పోపులో వేసి మరిగించి తేనె చుక్కలు కలిపితే రుచికరమైన చారు తయారవుతుంది. ఆశ్చర్యంగా అనిపించినా, విచిత్రంగా ముఖం పెట్టినా సరే.. ఇది నిజం. వెల్లుల్లి కర్రీ కూడా దాదాపుగా అంతే. కూరల్లో వెల్లుల్లి రేకలు వేయడమే మనకు తెలిసిందే. వెల్లుల్లి పేస్ట్‌తో మాంసాహారం వండుకోవడమూ తెలుసు. అయితే వెల్లుల్లి రేకలతోనే కూర చేయడం ఓ ప్రయోగం. మాంసాహారాన్ని మరిపించిన ఆరోగ్యవర్ధిని వెల్లుల్లి కర్రీ. కోడిగుడ్డు సొన కనిపించని ఆమ్లెట్‌ కూడా అంతే విచిత్రం. శనగపిండి– పెసర పిండిని బజ్జీల పిండిలా కలిపి నెయ్యి రాసిన పెనం మీద పోసి పైన కూరగాయ ముక్కలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి చల్లితే ఎగ్‌లెస్‌ వెజ్‌ ఆమ్లెట్‌ రెడీ. ఇవన్నీ జానపద చిత్రంలో... విచిత్రలోకంలో వడ్డించిన విస్తరిలో కనిపించిన ఆచరణ సాధ్యం కాని అద్భుతాలు కాదు. అడవుల్లో సంచరిస్తూన్నప్పుడు కడుపు నింపుకునే ఆపద్ధర్మ భోజనమూ కాదు. అచ్చమైన ఆయుర్వేద భోజనం. ఆరోగ్యకరమైన భోజనం. అభివృద్ధి పరుగులో ప్రకృతికి దూరంగా వచ్చేసిన మనిషిని తిరిగి ప్రకృతికి దగ్గర చేసే ప్రయత్నమే ఈ భోజనం. 

రేపటి నుంచి కార్తీకం
కార్తీకం.. వనభోజనాల సందడి మొదలయ్యే మాసం. ఈ ఆయుర్‌ మెనూని పాటిస్తే ఆరోగ్యంతో పాటు, సందర్భోచితంగా కూడా ఉంటుంది. ఆయుర్‌ భోజనం అంటే కందమూలాలు తినాలా అని ముఖం చిట్లించాల్సిన కష్టమూ అక్కర్లేదు. వెల్‌కమ్‌ డ్రింక్స్‌గా ఆమ్‌పన్నా, కొబ్బరి పాలు; పండ్లు– కూరగాయల సలాడ్‌లు; మొక్కజొన్న– క్యారట్‌ సూప్‌లోకి మెంతి ఆకు–మునగాకు పకోడీ స్టార్టర్స్‌; అలసంద – సగ్గుబియ్యం గారె; మెయిన్‌ కోర్సులో పాలకూర రోటీలోకి జీడిపప్పు– అల్లం తరుగు కూర, వెల్లుల్లి ఇగురు, నేతితో వెజ్‌ ఆమ్లెట్, పెసర (ముద్ద) పప్పు–నెయ్యి, గుమ్మడికాయ పప్పు, మందార పూల చారు, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి.ఇక మజ్జిగలో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీన, కరివేపాకు కలుపుకోవాలి. చివరగా శనగపప్పు– బెల్లం పాయసం, ఉసిరి – పటిక బెల్లం హల్వా... వీటితో సంపూర్ణ భోజనం. దీపావళికి రెండు రోజుల ముందు ధన్వంతరి దినోత్సవం. ఆ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు పరిచయం చేసిన సంప్రదాయ, ఆరోగ్య సంపన్న భోజనమిది. 

గుర్తుంచుకోండి
∙అల్లం దేహంలోని మలినాలను తొలగిస్తుంది, మిరియాలు రోగాలను నయం చేస్తాయి, పండ్లు, కూరగాయలు దేహాన్ని శుభ్రపరుస్తాయి. 
∙దక్షిణాదిలో చింతపండు వాడకం ఎక్కువ, అది ఎముకల పటుత్వాన్ని దెబ్బతీస్తుంది. ఆర్థరైటిస్‌ సమస్యలకు కారణమవుతుంది. 
∙కొబ్బరి దేహాన్ని చల్లబరిచి జీవక్రియను వేగవంతం చేస్తుంది. సమతుల ఆహారం ఒబేసిటీని దగ్గరకు రానివ్వదు, బరువు తగ్గడానికీ దోహదం చేస్తుంది.
∙మన దేహం ఆకలి అనే హెచ్చరికను మెదడుకు చేర్చేది కడుపు నింపమని చెప్పడానికి కాదు. పోషకాలతోకూడిన సమతుల ఆహారాన్ని ఇవ్వమని మాత్రమే. బిస్కట్, సమోసాలతో తాత్కాలికంగా ఆకలిని మరిపిస్తుంటాం. అందులో దేహానికి అవసరమైన పోషకాలు లేకపోవడంతో అరగంట లోపే మళ్లీ ఆకలి వేస్తుంటుంది. 

పప్పులో మునగ పువ్వు
మునగలో వాపును నివారించే గుణం ఉంది. దేహానికి గాయమైతే మునగచెట్టు బెరడును ఒలిచి దంచి గాయం మీద పెట్టి కట్టుకడితే మూడో రోజుకి గాయం ఆనవాలు లేకుండా పోతుంది. మునగ కాయలనే కాదు, మునగ పువ్వును పప్పులో వేసుకోవచ్చు, ఆకుతో కూర, పకోడీలు చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న లైఫ్‌స్టయిల్‌ డిసీజ్‌లు తగ్గాలంటే, బ్రౌన్‌రైస్‌ అన్నం తినడంతోపాటు ఆహారంలో మునగ, వెల్లుల్లి వీలయింత తరచుగా వాడాలి.
– డాక్టర్‌ యాన్సీ డి సౌజా

పండ్లు.. భోజనానికి ముందే
మన మనసుకి అసలైన భాగస్వామి మన శరీరమే. అందుకే దేహాన్ని కాపాడుకోవడం మీద మనసు పెట్టాలి. మంచి ఆహారంతో రోగాలను నివారించవచ్చు. అలాగే మనకు భోజనం తర్వాత పండ్లు తినాలనే పెద్ద అపోహ ఉంది. నిజానికి పండ్లను భోజనానికి ముందు తినాలి. ఆహారం– విహారం సక్రమంగా ఉంటే డాక్టర్‌ అవసరం లేని జీవితాన్ని గడపవచ్చు.
– డాక్టర్‌ సాజీ డి సౌజా 
– వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు