ప్రకృతి... ప్యాకింగ్!

21 Feb, 2016 22:50 IST|Sakshi
ప్రకృతి... ప్యాకింగ్!

హ్యూమర్ ప్లస్
 
ప్రాడక్ట్ ఎంత బాగున్నా ప్యాకింగ్ మరింత బాగుండాలి. లేకపోతే ఆ ఉత్పాదనకు తగినంత క్రేజ్ రాదు. అందుకే లోపల ఉండే అసలు వస్తువు కంటే, పైన ఉండే  ప్యాకింగ్ బాగుండేలా శ్రద్ధ తీసుకుంటాయి కార్పొరేట్ కంపెనీలు. ఈ ప్యాకింగ్ గుట్టుమట్లన్నింటినీ ప్రకృతినుంచే అవి నేర్చుకున్నాయని పండిపోయిన బిజినెస్ పండితులు చెప్పే మాట. తొక్కలోది ప్యాకింగ్ ఏముందండీ... లోపలి సరుకు బాగుండాలని కొందరు అంటుంటారు. కానీ కమలాపండు చూడండి. తొక్క చాలా అందంగా ఉండేలా కమలాలను కమనీయంగా ప్యాక్ చేసి ఉంచుతుంది ప్రకృతి. అందుకే కొన్ని సార్లు ప్యాకింగ్ చూసి టెంప్ట్ అయి, పండు తింటారు కొందరు. సదరు ప్యాకింగ్‌తో మోసపోయి పళ్లుకరచుకుంటారు. పైన ప్యాకింగ్ చూస్తే పక్వానికి వచ్చినదానిలా అనిపిస్తుంది. కానీ లోపల పండు రుచిచూస్తే అది పుల్లగా ఉంటుంది. అందుకే ప్రకృతిలోనూ కొన్ని ప్యాకింగ్‌లు పైకి ఎఫెక్టివ్‌గా కనిపిస్తూ, లోపల డిఫెక్టివ్‌గా ఉండవచ్చు. ఆరెంజ్ విషయంలోనూ కమలాలాంటి అరేంజ్‌మెంటే జరిగిపోయింది. అదే కుటుంబానికి చెందినదే అయినా కమలాపండు కంటే బత్తాయి ప్యాకింగ్ కాస్త టైట్‌గా ఉంటుంది. కమలాలతో పోలిస్తే దీని ప్యాకింగ్ అంత తేలిగ్గా విప్పడం సాధ్యం కాదనేనేమో తినడం కంటే రసం తీసుకుని తాగేస్తూ ఉంటారు మనుషులు. ఇక అరటిపండు ప్యాకింగ్‌ను అలవోకగా విప్పేయవచ్చు కాబట్టే తోపుడుబండ్లలో వాటి అమ్మకమే ఎక్కువ.

కోన్ ఐస్‌క్రీమ్‌ల విషయానికి వద్దాం. లోపల నింపిన బటర్‌స్కాచ్, వెనిల్లా వంటి ఫ్లేవర్‌కూ పైనున్న కరకరలాడే బిస్కెట్‌కోన్ ఒక ప్యాకింగ్ అనుకుందాం. ద్రాక్షపండులాగే సదరు కోన్‌నూ ప్యాకింగ్‌తో సహా తినేయవచ్చు. ఇలా తొక్కతో పాటూ తినేసే సౌలభ్యం విషయంలో ద్రాక్షకు ఆపిల్ జోడీగా వస్తుంది. తోడుగా ఉంటుంది. ఇక పుచ్చకాయ వంటి ప్యాకింగ్‌లను అంత తేలిగ్గా విప్పడం సాధ్యం కాదు. అందుకే ముక్కలు ముక్కలు చేసేసి, మధ్యలోని గుజ్జు తినేసి, పండుపైనున్న ప్యాకింగ్‌ను పారేస్తూ ఉంటారు. అయితే ఎర్రటి గుజ్జు ఉన్న అసలు ప్రాడక్ట్‌తో పాటు పైన ప్యాకింగ్‌లోని తెల్లభాగానికీ కాస్త మహత్యాన్ని ఇచ్చిందట ప్రకృతి. కేవలం రుచిగా ఉండే అసలుతో పాటు ప్యాకింగ్‌లోని కొసరు కూడా తింటే ఆరోగ్యం అంటుంటారు విజ్ఞులు. పనసకాయ విషయంలో ప్యాకింగ్ విప్పాలంటే దానికి కత్తిలాంటి నైపుణ్యం కూడా కావాలంటారు పెద్దలు. కొబ్బరికాయను చాలా ఎత్తుమీద ఉండేలా చూసింది కాబట్టి... గభాల్న అంతెత్తునుంచి కింద పడిపోతే కొబ్బరికి దెబ్బతగలకుండా లోపల పీచూ, టెంక వంటి వాటితో పకడ్బందీ ప్యాకింగ్ చేసింది ప్రకృతిమాత.

 ఇక కూరగాయల్లో బెండ, దొండ, వంకాయ వంటి వాటికి ప్యాకింగ్ ఏదీ లేకుండా అను గ్రహించిందట శాకంబరీదేవత. టొమాటోపైన పల్చటి పొర లాంటిది ఉన్నా దాన్ని గబుక్కున తొలగించడానికి అంతగా వీల్లేకుండా చేసిందట. దాంతో పాటు బీరకాయ, పొట్లకాయ వంటి కొన్ని కూరగాయలకు పైనున్న పలచటి ప్యాక్‌నూ వంటకు ఉపయోగించాల్సిందేనని కూరల అధిదేవతఅయిన శాకంబరీదేవి ఆదేశం అట. అందుకే వాటిని శుభ్రంచేయడానికి కత్తిని ఉపయోగించినా చెక్కుతీసినట్టుగా కాస్త  పైపైన అటు ఇటు కదిలిస్తారు అనుభవజ్ఞులు.
 ప్రకృతి ప్యాకింగ్‌ను మరింత ఆకర్షణీయం చేయడానికీ కార్బైడ్‌లాంటివి ఉపయోగించడం అంటే... లేని లాభాలతో బ్యాలెన్స్‌షీట్లను అందంగా అలంకరించడం లాంటిదట. పండంటిబిడ్డలా ఆరోగ్యమూ పదికాలాల పాటు కళకళలాడాలంటే కార్పొరేట్ ఉత్పాదనలకూ, కార్బైడ్‌లకూ కాస్త దూరంగా ఉండాలన్నది పెద్దలు చెబుతున్న మాట.
 - యాసీన్
 

మరిన్ని వార్తలు